3,000 year old temple……………
‘ఉతిర కోస మంగై ఆలయం’ ఇది పురాతన శివాలయం.. దీనిని మంగళనాథస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఈ ఆలయం శివుడు పార్వతీ దేవికి వేద రహస్యాలను బోధించిన ప్రదేశంగా నమ్ముతారు.
తమిళంలో ‘ఉతిరం’ అంటే ఉపదేశం, ‘కోశం’ అంటే రహస్యం, ‘మంగై’ అంటే పార్వతీ దేవి అని అర్థం. పరమశివుడు పార్వతీ దేవికి వేద, ఆగమ రహస్యాలను ఉపదేశించిన ప్రదేశం కావడంతో దీనికి ‘ఉతిర కోస మంగై’ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ప్రపంచంలోనే శివుడు మొదటిసారిగా వెలసిన ప్రదేశమని, శివుడికి అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటని భక్తుల నమ్మకం.
ఈ ఆలయానికి 3,000 సంవత్సరాల నాటి పురాతన చరిత్ర ఉంది.తమిళ సాహిత్యంలో ఈ క్షేత్రాన్ని “మణ్ ముందియో మంగై ముందియో” (భూమిపై మట్టి ముందు పుట్టిందా లేక ఉతిరకోసమంగై ముందు వెలసిందా) అని కీర్తించారు.9వ శతాబ్దపు శైవ సంతుడు మాణిక్యవాచకర్ తన ‘తిరువాచకం’ గ్రంథంలో ఈ క్షేత్రాన్ని కీర్తించగా, 15వ శతాబ్దపు కవి అరుణగిరినాథర్ కూడా ఇక్కడి స్వామిని స్తుతించారు.
ఇక్కడి ఆలయంలో స్వామివారు మంగళనాథ స్వామిగా, అమ్మవారు మంగళేశ్వరిగా పూజలందుకుంటున్నారు.ఈ ఆలయంలో సుమారు 6 అడుగుల ఎత్తైన ఏకశిలా మరకత (పచ్చ) నటరాజ విగ్రహం కొలువై ఉంది. పచ్చ రాయి సున్నితమైనది కావడంతో ధ్వని తరంగాలు, వాతావరణ మార్పుల నుండి రక్షించడానికి ఏడాది పొడవునా ఈ విగ్రహానికి గంధపు పూత పూసి ఉంచుతారు.
కేవలం ఆరుద్ర దర్శనం (ధనుర్మాసంలో వచ్చే తిరువాతిరై) నాడు మాత్రమే గంధాన్నితొలగించి భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తారు నటరాజ రూపంలో స్వామి మరకతశిలలో దర్శనమిస్తారు.ఆలయ ప్రాంగణంలో సహస్రలింగం,మాణిక్యవాచకర్ కోసం ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి.
సాధారణంగా ఇతర శివాలయాల్లో మొగలి పువ్వు పూజకు నిషేధం ఉంటుంది, కానీ ఈ ఆలయంలో ప్రతిరోజూ స్వామివారికి మొగలి పువ్వులతో పూజ చేయడం ఒక ప్రత్యేక ఆచారం. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ ఆలయానికి ఏడు అంతస్తుల ఎత్తైన రాజగోపురం, పవిత్ర అగ్ని తీర్థం ఉన్నాయి. పాండ్య రాజులు, నాయక రాజులు, రామనాథపురం సేతుపతి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
ఇక్కడే మండోదరి శివుని గురించి తపస్సు చేసి రావణాసురుడిని వివాహం చేసుకుందని పురాణ కథలు చెబుతున్నాయి. ఇక్కడ అనేక ఉపాలయాలున్నాయి. ఆలయం లోపలికి ప్రవేశించే సమయంలో యాళి విగ్రహం నోటిలో రాతితో చేసిన బంతి అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని చాటి చెబుతుంది.
ఇక్కడ సమీపంలోనే వారాహి మాత ఆలయం ఉంది. రామేశ్వరం యాత్రకు వెళ్లే భక్తులు ఈ ఆలయాలను సందర్శించవచ్చు.రామేశ్వరానికి… కాశీకి మధ్య బలమైన ఆధ్యాత్మిక సంబంధం ఉంది. హిందూ సంప్రదాయంలో, ఈ రెండు పుణ్యక్షేత్రాల సందర్శనను కలిపి ఒక సంపూర్ణ తీర్థయాత్రగా పరిగణిస్తారు.
యాత్రికులు తమ కాశీ యాత్రను రామేశ్వరంలో ప్రారంభించి, అక్కడ సముద్ర తీరం నుండి పవిత్రమైన ఇసుకను (సైకత లింగాన్ని) తీసుకువెళతారు. ఈ ఇసుకను అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) లోని త్రివేణి సంగమంలో గంగానదిలో కలిపి, తిరిగి కాశీ నుండి గంగాజలాన్ని తీసుకువచ్చి, రామేశ్వరంలోని రామనాథస్వామి శివలింగానికి అభిషేకం చేస్తారు. అప్పుడే యాత్ర పూర్తయినట్లు నమ్ముతారు.ఈ ఆలయం రామనాథపురం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల నైరుతి దిశలో ఉంది.

