Horror thriller ……..
‘418’ (2026) ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 418 చిత్రానికి కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించారు.
కథ ఏమిటంటే ?
కర్ణాటక తీర ప్రాంతంలోని దట్టమైన అడవిలో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్‌లోకి వివేక్ (సూర్య రాజ్ వీరబత్తిని) అనే విద్యార్థి చేరతాడు. ఆ హాస్టల్‌లో 15 ఏళ్లుగా మూసిఉంచిన 418వ నంబర్ గది పక్కనే వివేక్‌కు గది కేటాయిస్తారు. తన గదిలో వివేక్‌కు భయానక అనుభవాలు ఎదురవుతాయి.
ఎవరో తనను వెంటాడుతున్నట్టు భయపడుతుంటాడు. కాలేజీ లైబ్రరీ నుంచి,పోలీస్ స్టేషన్ నుంచి కాలేజీలో ఏం జరిగిందో తెలుసుకుంటాడు.యక్షగానం’ కళాకారిణి దేవిక (చైత్ర జె ఆచార్) విషాద గతానికి ఆ గదికి ఉన్న సంబంధం ఏమిటన్నదే ఈ సినిమా కథ.
దేవిక పాత్రలో చైత్ర జె ఆచార్ నటన సినిమాకు అతిపెద్ద బలం. అరుపులు, కేకలు లేకుండా కేవలం తన హావభావాలతోనే ఆమె భయపెట్టిన తీరు ప్రేక్షకులకు నచ్చుతుంది. రొటీన్ హారర్ కామెడీలకు భిన్నంగా, సీరియస్ హారర్ థ్రిల్లర్‌గా తీయడానికి చేసిన ప్రయత్నం బాగుంది. అయితే కథలో లోపాలున్నాయి.కథనంలో వేగం లేదు.
సినిమాలో ముఖ్యంగా ‘దేవిక’ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్, సౌండ్ డిజైన్‌తో భయపెట్టే హాస్టల్ కారిడార్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.నటీనటులంతా బాగానే చేశారు.హీరో సూర్య రాజ్ పాత్రకు కథలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, కేవలం దేవిక పాత్ర మీదే సినిమా మొత్తం ఆధారపడటం వల్ల మిగతా పాత్రలు తేలిపోయాయి.
దేవిక ఫ్లాష్‌బ్యాక్ & యక్షగానం సన్నివేశాలు సినిమా కి ప్రాణం పోశాయి. తల్లి కావాలనే తీవ్రమైన ఆకాంక్ష ఉన్న దేవిక పాత్రలో చైత్ర జె ఆచార్ బాగా నటించారు. కర్ణాటక సంప్రదాయ కళ యక్షగానం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ఒక ప్రత్యేకమైన, భయానకమైన వాతావరణాన్ని ఇచ్చాయి. మూసిఉంచిన 418వ గది తలుపులు తెరుచుకున్న తర్వాత హాస్టల్‌లో మొదలయ్యే వింత పరిణామాలు,ఇంటర్వెల్ సమయానికి వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతాయి.
మెడికల్ కాలేజీ హాస్టల్ గేటు దాటి ఆడవాసన కూడా లోపలికి రాకూడదనే కఠిన నిబంధనలు, పాత మానసిక వైద్యశాల (Asylum) భవనాన్ని హాస్టల్‌గా మార్చడం వెనుక ఉన్న రహస్యాన్ని పరిచయం చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.కేవలం అరుపులు, కేకలు కాకుండా నిశ్శబ్దం,చీకటి కారిడార్లలో నీడలు, వెంకీ జీజీ అందించిన నేపథ్య సంగీతంతో (BGM) భయపెట్టే కొన్ని జంప్-స్కేర్ సన్నివేశాలు బాగా పండాయి.
మొదటి సగభాగంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది, కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి.హారర్ సినిమాకు కావాల్సిన బ్యాక్ డ్రాప్ ఉంది .కథ కథనంపై మరింత కసరత్తు చేసి ఉంటే సినిమా ఆసక్తికరంగా రూపొందేది. ప్రారంభంలో ఉన్నంత ఉత్కంఠ తర్వాత ఉండదు. కథ ముందుకు సాగదు. ఒకటి రెండు భయపెట్టే సీన్లు తప్ప ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోదు.
ఇక ద్వితీయార్థం కొంతవరకు ఆసక్తికరంగా సాగుతుంది. దేవిక నేపథ్యాన్ని,సైకలాజికల్ కోణంలో చూపించడం, ఆ నేపధ్యంలో వచ్చే సీన్లు కొంతవరకు ఆకట్టుకుంటాయి. రెగ్యులర్ గా హారర్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా అంతగా నచ్చదు.
సినిమాపై ఉన్న హైప్‌కు తగ్గట్టుగా భయపెట్టే సన్నివేశాలులేవు. క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో ఉత్కంఠను రేకెత్తించదు. 418వ గది రహస్యాన్ని, క్లైమాక్స్‌లో చాలా సాధారణంగా ముగించడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది.
రొటీన్ దెయ్యాల సినిమాల లాగా కాకుండా, మంచి సౌండ్ ఎఫెక్ట్స్,నటనతో కూడిన స్లో-బర్న్ సైకలాజికల్ హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘418’ ఒకసారి చూడదగ్గ చిత్రం.వెంకీ జీజీ అందించిన నేపథ్య సంగీతం (BGM), సౌండ్ డిజైన్, దినేష్ దివాకరన్ సినిమాటోగ్రఫీ సినిమా ఆరంభం నుండి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాయి.

