Priyadarshini Krishna ……..
గతవారం Netflix లో విడుదలైన సైఫ్ అలీ ఖాన్ నటించిన “కర్తవ్య” అనే ఇండివిడ్యుయల్ మూవీ ఇప్పుడు టాప్ స్లాట్ లో వుంది..ఈ సినిమా చూసిన ఎవరికైనా అందులో ఒక పాత్ర ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. ఆ కథకి మూలం హర్పాల్ అనే మైనర్ పాత్ర. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూ నడుస్తూ, మలుపులు తిరుగుతుంది.
హర్పాల్ పాత్ర మనచే కన్నీరు పెట్టిస్తుంది. ఈ సినిమాలో హర్పాల్ 14-15 ఏళ్ల అమాయకపు హరియాణ్వీ బాలుడు. ఒక క్రిమినల్ గ్యాంగ్ చేతిలో శారీరక, మానసిక వేధింపులకు గురై, ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించగా, అతను ఈ అబ్బాయిని రక్షించడానికి ప్రయత్నిస్తాడు.
సినిమాలో ఇతని అమాయకమైన ముఖం, సన్నటి శరీరం చూసి ప్రేక్షకులందరూ ఇతను నిజంగానే 14 ఏళ్ల బాల నటుడు (Child Artist) అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే, ఈ పాత్ర పోషించిన యుధ్ వీర్ అహ్లావత్ వయసు 33 సంవత్సరాలు. ఇతను దాదాపు 10 సంవత్సరాలుగా థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
ప్రముఖ ‘ముఘల్-ఎ-ఆజం: ది మ్యూజికల్’ నాటకాల్లో కూడా నటించాడు.ఈ సినిమాలో ఇతని నటన ఎంత సహజంగా, ఎమోషనల్‌గా ఉందంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత రాత్రికి రాత్రే ఇతను స్టార్ అయిపోయాడు. ప్రముఖ IMDb పాపులారిటీ రేటింగ్స్‌లో షారుఖ్ ఖాన్, దళపతి విజయ్ వంటి స్టార్ హీరోలను దాటేసి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు.
33 ఏళ్ళ యుధ్ వీర్ 14 ఏళ్ళ బాలునిలాగా సరిగ్గా సరిపోవడమే కాకుండా చాలా బాగా నటించాడు… నటించాడు అనకూడదు … జస్ట్ జీవించాడు.దర్శకుడు పుల్కిత్ తెరకెక్కించిన చిత్రంలో హర్పాల్ పాత్రతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యుధ్ వీర్ అహ్లావత్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు.
33 ఏళ్ల ఈ నటుడు 2019లో ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించగా, 2022లో విడుదలైన ‘లవ్ హాస్టల్; చిత్రంతో మరింత గుర్తింపు సంపాదించాడు.IMDb తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో యుధ్వీర్ అహ్లావత్ పేరు చోటు చేసుకోవడం విశేషం.
ప్రజాదరణ పరంగా షారుఖ్ ఖాన్, విజయ్, ఐశ్వర్య రాయ్ వంటి అగ్ర తారలను వెనక్కి నెట్టి ఆయన ఈ జాబితాలో నిలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘’ఈ క్షణాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. సినిమాల గురించి కలలు కనే స్థితి నుంచి IMDb ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కడం నిజంగా అద్భుతంగా అనిపిస్తోంది” అని చెప్పుకొచ్చారు.
సినిమా, టెలివిజన్, రంగస్థలం… ఏ మాధ్యమమైనా తనదైన నటనతో ఆకట్టుకునే యుధ్ వీర్ అహ్లావత్, లవ్ హాస్టల్ చిత్రంలో రాకేష్ దిలావర్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ పాత్రలో ఆయన ప్రదర్శించిన తీవ్రత, సహజత్వం విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది.
ప్రస్తుతం యుధ్ వీర్ అహ్లావత్ చేతిలో 3 నుండి 4 కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు..ఒక ఇండిపెండెంట్ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్‌కు చెందిన ఒక పెద్ద కమర్షియల్ సినిమాలో కూడా అతను భాగం కాబోతున్నాడు.భవిష్యత్తు లో కూడా మంచి పాత్రలు పోషించి మరింత పెద్ద స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.

