Bhandaru Srinivas Rao ……….
నిజమా! నిజంగా నమ్మలేం అనిపించే ఈ సంఘటన నిజంగా జరిగింది.ఒబామా అమెరికా ప్రెసిడెంట్ గా వున్నప్పుడు స్వయంగా చెప్పకపోతే అసలీవిషయం బయటకు పొక్కేదే కాదు.
నమ్మడానికి వీల్లేని ఈ కధా కమామిషూ ఏమిటంటే- కొన్నేళ్ళ క్రితం న్యూ యార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షులవారు సతీ సమేతంగా ఆ నగరం చేరుకున్నారు.
ఓ రోజు వీలుచేసుకుని భార్యను వెంటబెట్టుకుని హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళారు. మాట మంతీ చెప్పుకుంటూ భోజనం ముగించిన తరువాత బిల్లు చెల్లించడానికి క్రెడిట్ కార్డు తీసిచ్చారు. అది తీసుకువెళ్ళిన బేరర్ అంతే వేగంతో తిరిగొచ్చి, ‘ప్రెసిడెంట్! మీ క్రెడిట్ కార్డు చెల్లదు’ అని చావు కబురు చల్లగా చెప్పాడు.
ఆ మాటకు ఒబామా కాస్త ఇబ్బంది పడుతూనే నవ్వుతూ, “లేదు, నేను నిజంగానే నా బిల్లులన్నీ సమయానికి కడుతున్నాననే అనుకుంటున్నాను”అన్నాడు. పక్కన ఉన్న భార్య కు విషయం అర్ధమైంది. మిషెల్ ఒబామా తనకు సొంత క్రెడిట్ కార్డు ఉండటంతో, వెంటనే ఆమె ఆ కార్డు ద్వారా బిల్లు చెల్లించారు.
ఆవిడ తన కార్డు తీసి ఇవ్వబట్టీ ప్రెసిడెంట్ ఒబామా గారి పరువు ఆ పూటకు నిలబడింది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నందున ఒబామా తన వ్యక్తిగత క్రెడిట్ కార్డును రోజువారీ అవసరాలకు చాలా అరుదుగా వాడేవారు. ఒక ఖరీదైన రెస్టారెంట్లో ఆ కార్డును స్వైప్ చేయడంతో, ఎవరో దొంగతనం చేసి వాడుతున్నారేమో (ఫ్రాడ్ అలర్ట్) అనే అనుమానంతో బ్యాంక్ సాఫ్ట్వేర్ ఆ లావాదేవీని నిలిపివేసింది.
తర్వాత నెలలో కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో (CFPB) లో డెబిట్/క్రెడిట్ కార్డుల భద్రతను పెంచే కొత్త నిబంధనలపై సంతకం చేస్తూ ఒబామా ఈ విషయాన్ని గుర్తుచేసుకుని, “చూశారా, ఇలాంటి సమస్యలు నాకు కూడా తప్పలేదు” అని నవ్వుతూ చెప్పారు.
మాటవరసకు ఈ విషయం స్వయంగా ఒబామా గారే వెల్లడించడంతో ఈ కధనం మీడియాలో హుషారుగా గింగిరాలు కొట్టింది.అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు భార్యతో కలిసి భోజనం చేయడానికి ఇతర సాధారణ పౌరుల మాదిరిగానే హోటల్ కు వెళ్ళారు. ఇది ఎవరికీ పట్టలేదు.
అలాగే బిల్లు కట్టడానికి క్రెడిట్ కార్డు ఇచ్చారు. బిల్లులు కట్టడం అలవాటులేని రాజకీయ నాయకులను కన్న కర్మ భూమి కాబట్టి, మన దేశంలో మీడియా కూడా ఆ విషయానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. మీడియా గగ్గోలు పెట్టినదల్లా ఒక్క విషయానికే. అదేమిటంటే అమెరికా ప్రెసిడెంటు క్రెడిట్ కార్డు కూడా క్లోనింగుకు గురయిందనే. దాన్ని గురించి ఒకటే ఊదర.
ఈ సంఘటన నుంచి మన రాజకీయ నాయకులు, మీడియా నేర్చుకోవాల్సింది ఎంతో వుంది అంటే అపార్ధం చేసుకోరు కదా!

