Survival thriller ………
‘సాయవనం’ (Saayavanam 2025 ) దట్టమైన అడవి నేపథ్యంలో సాగే తమిళ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. భర్త కనిపించకుండా పోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన ‘సీత’ అనే మహిళ తన ఆత్మగౌరవం, ఉనికి కోసం చేసిన పోరాట కథ.
అనిల్ కుమార్ దర్శకత్వంలో దేవనంద షాజిలాల్, సౌందరరాజా, సంతోష్ దామోదరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సాయవనం చిత్రం ప్రస్తుతం తెలుగులో ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
కథ ఏమిటంటే ?
డ్రైవర్ ముత్తు (సౌందరరాజా), తాను ప్రేమించిన సీత (దేవనంద షాజిలాల్)ను వివాహం చేసుకుని మేఘాలయలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే అర్పుతమ్మాళ్ అనే పెద్దావిడ వద్దకు తీసుకువెళ్తాడు.కొద్దీ రోజుల తర్వాత సొంతంగా లారీ కొనాలని వెళ్లిన ముత్తు, ఏకంగా మూడేళ్ల పాటు తిరిగి రాడు.
అతని ఆచూకీ తెలియకపోవడంతో సీత ఆ అటవీ ప్రాంతంలో ఒంటరిగా మిగిలిపోతుంది. భర్త కోసం ఎదురుచూస్తూ ఒంటరిగా ఉన్న సీతపై ఆ ప్రాంత ఫారెస్ట్ రేంజర్ కన్ను పడుతుంది. ఇదే సమయంలో, ముత్తుకోసం సురుళి (సంతోష్ దామోదరన్) వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు.
అర్పుతమ్మాళ్ నాటు వైద్యురాలు అని తెలుసుకున్న సురుళి, పాముచే కాటు వేయించుకుని క ఆమె ఇంట్లోనే ఆశ్రయం పొందుతాడు. అక్కడ సీతను చూసిన సురుళి కూడా ఆమెను లోబరుచుకోవాలని చూస్తాడు.
చుట్టూ ఉన్న మనుషుల వక్రబుద్ధి, నమ్మకద్రోహం, ఒంటరితనం మధ్య చిక్కుకున్న సీత, ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొంది? ఒక సాధారణ మహిళ ధైర్యవంతురాలిగా ఎలా మారింది అన్నదే మిగతా కథ.
సినిమా కథ మొత్తం సీత చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు ఆత్మలాంటి పాత్ర ఆమెదే. భర్త దూరమై ఒంటరితనంతో కుమిలిపోయే అమాయకపు భార్యగా , చుట్టూ ఉన్న మగాళ్ల మోసాలను గ్రహించి తన ఆత్మగౌరవం కోసం తిరగబడే ధైర్యవంతురాలిగా చక్కగా నటించారు.
క్లయిమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సీత భర్తగా సౌందరరాజా సహజంగా నటించారు.మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితుల్లో ఆయన హావభావాలు, ఆవేదన ఆకట్టుకుంటాయి. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంతోష్ దామోదరన్, స్వార్థపరుడైన ‘సురుళి’ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన నటన సినిమాకు హైలైట్.
జానకి జయరామన్ అర్పుతమ్మాళ్ గా నాటు వైద్యం చేసే వృద్ధురాలిగా, పరిస్థితులకు తలొగ్గే నిస్సహాయురాలిగా ఆమె నటన పాత్రకు తగ్గట్లుగా సహజంగా సాగింది. మాథ్యూ మాంప్రా ఫారెస్ట్ రేంజర్ గా బాగా చేశారు. ఇతర నటీనటులు కూడా పాత్రల పరిధిలో చక్కగా నటించారు.
సురుళి, నెమ్మదిగా సీత నమ్మకాన్ని గెలుచుకుంటూనే ఆమెను లోబరుచుకోవడానికి వేసే ఎత్తుగడలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. భర్త చనిపోయాడో, బతికే ఉన్నాడో తెలియని స్థితిలో ఉన్న సీత జీవితంలోకి మూడేళ్ల తర్వాత ముత్తు అకస్మాత్తుగా తిరిగి వచ్చే సన్నివేశం కథను మలుపు తిప్పుతుంది.
ముత్తు – సురుళి మధ్య ఘర్షణ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. చుట్టూ ఉన్న మగాళ్లందరూ తనను కేవలం ఒక వస్తువులా వాడుకోవాలని చూస్తున్నారని గ్రహించిన సీత, వారికి బుద్ధి చెప్పే ముగింపు సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. కథనం స్లో గా సాగుతుంది.
దర్శకుడు అనిల్ కుమార్ ‘సాయవనం’ చిత్రాన్ని కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా, సైకలాజికల్ సర్వైవల్ డ్రామా తరహాలో వాస్తవికతకు దగ్గరగా తెరకెక్కించారు.ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన సీనియర్ ఫిల్మ్ మేకర్ అనిల్ కుమార్ ఈ సినిమాలో తన దర్శకత్వ ప్రతిభను చూపించారు.
దట్టమైన అడవి నేపథ్యంలో ఒంటరిగా మిగిలిపోయిన ఒక మహిళ చుట్టూ అల్లుకున్న స్వార్థం, నమ్మకద్రోహాన్ని ఎలాంటి కృత్రిమత్వం లేకుండా చాలా సహజంగా తెరపై ఆవిష్కరించారు.
ముఖ్యంగా సీత (దేవనంద షాజిలాల్) పాత్రలోని అమాయకత్వం నుండి ధైర్యం వరకు సాగే మానసిక పరిణామాన్ని, నటీనటుల నుండి సహజమైన నటనను రాబట్టుకోవడంలో దర్శకుడు విజయం సాధించారు.
ఉత్కంఠ పూరిత వాతావరణాన్ని సృష్టించినప్పటికీ, ఆ ఉత్కంఠను సినిమా ఆద్యంతం ఒకే స్థాయిలో నిలబెట్టడంలో కథనం కాస్త నెమ్మదించింది. కొన్ని కీలక మలుపులు ఊహించదగ్గవిగా ఉన్నాయి.
ఎల్. రామచంద్రన్ మేఘాలయలోని దట్టమైన అడవులు, పొగమంచు, ప్రకృతి అందాలను చాలా సహజంగా, గంభీరంగా తెరపై చూపించారు. పాలీ వర్గీస్ పాటలకు సంగీతం అందించగా ఎల్.వి. ముత్తు గణేష్ నేపథ్య సంగీతం సమకూర్చారు. అడవి నిశ్శబ్దాన్ని, పాత్రల మధ్య సాగే మానసిక సంఘర్షణను ఎలివేట్ చేయడంలో BGM బాగా పనిచేసింది. సీరియస్ చిత్రాలు, సర్వైవల్ థ్రిల్లర్స్ చూసే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

