Action crime thriller ………
‘భలే తమ్ముడు’ 1969 నాటి సినిమా.. సుప్రసిద్ధ నటుడు నందమూరి తారక రామారావు (NTR) ద్విపాత్రాభినయం చేసిన క్లాసిక్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘. షమ్మీ కపూర్ నటించిన ప్రసిద్ధ హిందీ చిత్రం ‘చైనా టౌన్’ (1962) ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తర్వాత కాలంలో ‘చైనా టౌన్’ మూల కథ ఆధారం గా మార్పులు చేర్పులతో చాలా సినిమాలు వచ్చాయి.
బి.ఎ. సుబ్బారావు దర్శకత్వంలో, అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలయి 57 ఏళ్ళు అయింది.
కథ ఏమిటంటే ?
చిన్నప్పుడు తప్పిపోయిన కవల సోదరుల కథ. రామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ (ఎన్టీఆర్) ఇద్దరూ కవలలు. చిన్నతనంలోనే రామ్ ప్రసాద్‌ను ఒక నేరగాళ్ల ముఠా కిడ్నాప్ చేస్తుంది. ఆ ముఠాలోనే పెరుగుతూ అతను పెద్దయ్యాక ‘పాల్’ అనే పేరుతో ఒక గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. మరోవైపు శ్యామ్ ప్రసాద్ తన తల్లి వద్దే పెరుగుతూ ఒక క్లబ్ సింగర్‌గా ఎదుగుతాడు.
ఒకసారి పోలీస్ ఇన్స్పెక్టర్ శేఖర్.. గ్యాంగ్‌స్టర్ పాల్ పోలికలతో ఉన్న క్లబ్ సింగర్ శ్యామ్‌ను చూసి ఆశ్చర్యపోతాడు. నేరగాళ్ల ముఠా గుట్టు రట్టు చేయడానికి శ్యామ్‌ను ‘పాల్’ లాగా నటించి ఆ గ్యాంగ్‌లోకి ఇన్ఫార్మర్గా వెళ్లమని కోరతాడు. శ్యామ్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ ముఠాలోకి ఎలా వెళ్లాడు? విడిపోయిన సోదరులు ఇద్దరూ ఎలా కలుసుకున్నారు? ఈ క్రమంలో వారి తండ్రి హంతకుడైన ముఠా నాయకుడు ‘గన్’ (రాజనాల)ను ఎలా అంతమొందించారు? అనేదే మిగతా కథ.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం తో ప్రేక్షకులను అలరించారు. గ్యాంగ్‌స్టర్ ‘పాల్’ గా మాస్, రఫ్ లుక్‌లోనూ… క్లబ్ సింగర్ ‘శ్యామ్’ గా స్టైలిష్, క్లాస్ లుక్‌లోనూ ఎన్టీఆర్ అద్భుతమైన వైవిధ్యాన్ని కనబరిచారు. రెండు పాత్రల మధ్య ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్ వ్యత్యాసాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సినిమాలో ఎన్టీఆర్ స్మార్ట్ గా కనిపిస్తారు. చెవి కి రింగ్ ధరిస్తారు.
హీరోయిన్గా కె.ఆర్. విజయ తన నటనతో ఆకట్టుకోగా, విలన్‌గా రాజనాల క్రూరమైన నటనతో మెప్పించారు. రేలంగి కేఆర్ విజయ తండ్రి తనదైన శైలిలో నవ్విస్తారు. ఇతర నటీనటులంతా కూడా బాగా నటించారు.
క్లబ్ సింగర్ శ్యామ్, క్రిమినల్ అయిన పాల్ ప్లేస్‌లోకి సి.ఐ.డి అండర్‌కవర్ ఏజెంట్‌గా వెళ్లే సమయంలో భయం భయంగా గ్యాంగ్‌స్టర్ లాగా మేనేజ్ చేసే సీన్లు, బాడీ లాంగ్వేజ్ మార్చే సన్నివేశాలు బాగుంటాయి. పాల్ మేనరిజాన్ని అనుసరించే సీన్, స్మగ్లర్ల డెన్లోకి శ్యామ్ అడుగుపెట్టిన ప్రతిసారీ విలన్లకు అనుమానం రాకుండా తప్పించుకునే మైండ్ గేమ్ సీన్లు చాలా గ్రిప్పింగ్‌గా సాగుతాయి.
తప్పించుకుని వచ్చిన పాల్ శ్యామ్ పై చేయి చేసుకునే సన్నివేశాలు బాగుంటాయి. శ్యామ్ తన అన్న అయిన పాల్‌కు చిన్ననాటి విషయాలు, వారి తండ్రిని చంపింది విలన్ రాజనాల అనే నిజం గుర్తుచేసే ఎమోషనల్ సీన్ సినిమాకే హైలైట్. ఈ సీన్ తర్వాత ఇద్దరు సోదరులు ఒక్కటవుతారు.సినిమాలో కార్ చేజింగ్ సీన్స్ , ఎన్టీఆర్ మారువేషంలో విగ్రహం దొంగిలించే సీన్స్ ఆకట్టుకుంటాయి.
టి.వి. రాజు అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. ముఖ్యంగా బాలీవుడ్ లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ ఈ సినిమా ద్వారా తొలిసారిగా తెలుగులో పాటలు పాడారు. “ఎంతవారు కాని వేదాంతలైన కాని”, “నేడే ఈనాడే… “, “గోపాలబాల” వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.
హాలీవుడ్, బాలీవుడ్ శైలి క్రైమ్ డ్రామాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో,దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.సినిమాటోగ్రాఫర్ ఎస్ ఎస్ లాల్ కెమెరా పనితనం బాగుంటుంది. నాటి కాలపు సినిమాల తరహాలోనే ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 170 నిమిషాలు.. ఎక్కడా బోర్ కొట్టదు.
‘భలే తమ్ముడు’ తెలుగు చలనచిత్ర రంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన కవలల నేపథ్య క్రైమ్ డ్రామా. ఎన్టీఆర్ నటన, మరపురాని మహమ్మద్ రఫీ పాటల కోసం పాత తరం క్లాసిక్ సినిమాలను ఇష్టపడేవారు, నందమూరి అభిమానులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. ఈ పూర్తి సినిమాను యూట్యూబ్‌లో ఉచితంగా చూడవచ్చు.. ప్రింట్ కూడా బాగుంది.

