చూడదగిన స్ఫూర్తిదాయక ఎమోషనల్ డ్రామా !!

Sharing is Caring...

Emotional drama ……

‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara – 2026) కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఒక స్ఫూర్తిదాయక ఎమోషనల్ డ్రామా. దుల్కర్ సల్మాన్, కొత్త నటి సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పవన్ సాది నేని దర్శకత్వం వహించారు.

గుణ్ణం గంగరాజు కథ/స్క్రీన్‌ప్లే తో, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 20, 2026న థియేటర్లలో విడుదలైంది.

కథ ఏమిటంటే ?

కనీస వసతులు లేని ఒక మారుమూల గ్రామానికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి) చిన్నతనం నుంచే వ్యోమగామి (Astronaut) కావాలని, అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంటుంది. కానీ తండ్రి ఆమె కలలకు అడ్డుపడి, చిన్న వయసులోనే కృష్ణ (దుల్కర్ సల్మాన్) అనే మధ్యతరగతి టాక్సీ డ్రైవర్‌తో వివాహం జరిపిస్తాడు.

ఇష్టం లేని పెళ్లితో చదువు ఆగిపోయిన కల్పన కలను, భర్త కృష్ణ తన జీవిత లక్ష్యంగా మార్చుకుంటాడు. ఈ క్రమంలోనే  అవమానాలు, కష్టాలను దాటుకుని కల్పన తన కలను ఎలా నెరవేర్చుకుంది అన్నదే ఈ సినిమా కథ.

తొలి సినిమా అయినప్పటికీ కల్పన పాత్రలో సాత్విక వీరవల్లి జీవించింది. ఒక పల్లెటూరి అమ్మాయి వ్యోమగామి కావాలనే కలను సాకారం చేసుకునే క్రమంలో పడే ఆవేదన, అమాయకత్వం, పట్టుదలను అద్భుతంగా పండించింది.

భార్య కల కోసం తపించే భర్తగా దుల్కర్ సల్మాన్ మరోసారి తన సహజ నటనతో  మెప్పించారు. సొంత ఆనందాలను త్యాగం చేసి, నిరంతరం అండగా నిలిచే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఎంతో హుందాగా, నిస్వార్థమైన ప్రేమను చూపే భర్తగా హృదయాన్ని హత్తుకునే నటన కనబరిచారు. దుల్కర్ కెరీర్ లో ఆయనకు ఇదొక మంచి పాత్ర.  

సెకండాఫ్‌లో కల్పన కలలకు రెక్కలు తొడిగే రోహిణి పాత్రలో శ్రుతి హాసన్ హుషారుగా, పరిణతితో నటించింది. మురళీ శర్మ, గౌతమ్ మీనన్,ఇతరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.కల్పన బాల్యం & ప్లానిటోరియం ఎపిసోడ్ బాగుంటుంది. చిన్నారి కల్పన అంతరిక్షం వైపు ఆకర్షితురాలయ్యే ఆరంభ సన్నివేశం ఎంతో సహజంగా, ఆకట్టుకునేలా ఉంది.

ఇష్టం లేకుండా పెళ్లయిన కల్పన కలను అర్థం చేసుకుని, “నీ కలలు ఆకాశంలో ఉంటే, నాకు ఈ భూమితో పని ఏంటి” అంటూ భార్యకు అండగా నిలిచే కృష్ణ (దుల్కర్ సల్మాన్) పాత్ర తాలూకు భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల మనసును హత్తుకుంటాయి.

రెండో భాగంలో కల్పన ప్రతిభను గుర్తించిన రోహిణి (శ్రుతి హాసన్) పాత్ర ప్రవేశం, ముఖ్యంగా కల్పన కోసం ఆమె వెతికే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. తక్కువ ఖర్చుతో కాలేజీలో కల్పన చేసిన రాకెట్ ప్రయోగం విఫలమై సస్పెండ్ అయినప్పుడు, ఆమె పడే ఆవేదన, భర్త కృష్ణ ఆమెకు ధైర్యం చెప్పే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్‌గా సాగుతాయి.

చివరలో తండ్రితో కూతురు మాట్లాడే సన్నివేశం, తన భార్య ఆశయం కోసం ఆమెకు దూరంగా ఉంటూ కృష్ణ పడే తపన, కల్పన అంతరిక్షంలో అడుగుపెట్టి అనుభూతి చెందే చివరి 20 నిమిషాల సన్నివేశాలు కళ్లు చెమర్చేలా ఉంటాయి.దర్శకుడు వాటిని మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు.  

ఎటువంటి అశ్లీలత, అనవసరపు హింస లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమ, పరస్పర గౌరవాన్ని చూపించిన తీరు బాగుంది.సినిమా  నిడివి (2 గంటల 40 నిమిషాలు) కాస్త ఎక్కువగా ఉండటం, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం వల్ల అక్కడక్కడా వేగం తగ్గినట్లు అనిపిస్తుంది.

క్లైమాక్స్‌లో రాకెట్, అంతరిక్ష సన్నివేశాలలో గ్రాఫిక్స్ (VFX) నాణ్యత ఓ మాదిరిగా ఉంది. క్లయిమాక్స్ ను ఉత్కంఠ భరితంగా చిత్రీకరించారు.

జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూరి అందాలను, గుజరాత్‌లోని గ్రామీణ వాతావరణాన్ని సుజిత్ సారంగ్ తన కెమెరాలో అత్యంత సహజంగా చిత్రీకరించారు . 

భారీ యాక్షన్, మసాలా అంశాలు లేకుండా మనసును తాకే భావోద్వేగాలు, మంచి నటన, స్ఫూర్తిదాయక కథలను ఇష్టపడే వారికి ‘ఆకాశంలో ఒక తార’ తప్పకుండా నచ్చుతుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!