Drug mafia …………………….
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 2022లో వచ్చిన మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ ఈ ‘విక్రమ్ హిట్ లిస్ట్ మూవీ. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు.
డ్రగ్ మాఫియా దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నది. పోలీసులు వాళ్ళతో ఎలా చేతులు కలుపుతున్నారు ?ఈ క్రమంలో నిజాయితీ గల పోలీస్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అన్న అంశాల ఆధారంగా ఈ సినిమా కథ అల్లుకున్నారు. కథ కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. నిడివి తగ్గిస్తే బాగుండేది. లోకేష్ కనకరాజన్ కథను తెరకెక్కించిన విధానం బాగుంది.
ఏజెంట్ విక్రమ్’ (1986) కు ఈ సినిమా పొడిగింపు ..ఆ సినిమాలోని కమల్ పాత్రను పొడిగించారు. ఈ సినిమా కేవలం పాత విక్రమ్‌కు మాత్రమే కాదు, కార్తీ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఖైదీ’ కి కూడా పొడిగింపు. ‘ఖైదీ’ సినిమాలో డ్రగ్స్ పట్టుకున్న పోలీసు ఆఫీసర్ బెజోయ్ (నరేన్) పాత్ర, ఆ సినిమాలో మాయమైన డ్రగ్ కంటైనర్ కథే ఈ ‘విక్రమ్: హిట్ లిస్ట్’ లో ప్రధాన పాయింట్‌గా మారుతుంది.
కమల్ హాసన్ తన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ యాక్షన్ సీన్లతో విశ్వరూపం చూపించారు. ఫస్టాఫ్‌ను ఫహాద్ ఫాజిల్ తన అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ నటనతో నడిపిస్తే, క్రూరమైన విలన్‌గా విజయ్ సేతుపతి నటన మైండ్ బ్లాక్ చేస్తుంది.
కథలో సస్పెన్సు బాగా మైంటైన్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యాక్షన్ డోస్ కొంచెం ఎక్కువైంది. కథలో బోలెడు ట్విస్టులు పెట్టారు. ముసుగు మనుష్యులు ఎవరనేది సస్పెన్స్ లో పెట్టి కథ నడిపారు. కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథలో కమల్, ఫహద్ ఫాజిల్ పాత్రలకే ప్రాధాన్యత ఎక్కువ.
ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ బాగుంది.ఆ పాత్రలో ఫాజిల్ ఒదిగిపోయాడు. పాత్ర పరంగా భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించాడు. పిల్లవాడి గుండె నొక్కి బతికించే సీన్,పెళ్ళికి లేటుగా వెళ్లి ప్రియురాలికి సంజాయిషీ ఇవ్వలేకపోయిన సీన్ లో ఫాజిల్ నటన ఆకట్టుకుంటుంది.
డ్రగ్ మాఫియా డాన్ గా విజయ్ సేతుపతి ఆకట్టుకుంటాడు. విజయ్ ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు నచ్చుతాయి. క్లైమాక్స్ లో కమల్ -సేతుపతి మధ్య ఫైట్స్ బాగా తీశారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ బాగుంది.
సెకండాఫ్‌లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు చాలా సుదీర్ఘంగా సాగడం వల్ల సినిమా రన్‌టైమ్ (దాదాపు 3 గంటలు) కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది.ఇన్వెస్టిగేటివ్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
సినిమాలో గాయత్రి శంకర్ పాత్రకు తప్ప మిగిలిన లేడీ క్యారెక్టర్స్ కు అంత ప్రాధాన్యం లేదు.తన గత చిత్రాల మాదిరిగానే నైట్ ఎఫెక్ట్స్ లోనే సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ముగింపులో రోలెక్స్‌గా సూర్య ఎంట్రీ అభిమానులను అలరిస్తుంది. సూర్య విభిన్నంగా నటించి అందరిని మెప్పించాడు. తెరపై ఉన్నది కొద్ది క్షణాలే అయినా.. తన సత్తా ఏమిటో చాటాడు. ఇక కథలో ప్రత్యేకంగా హీరోయిన్లు ఎవరూ లేరు. డ్యూయెట్స్ కూడా లేవు.
అనిరుధ్ నేపధ్యసంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. డ్రగ్ మాఫియా నేపధ్యం లో చాలా సినిమాలే వచ్చాయి. ఈ కథను కొంత డిఫరెంట్ గా తీశారు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. దాదాపు ₹130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా ₹403.50 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లను సాధించి అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది
ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

