Great director……….
దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) 1977లో వచ్చిన ’16 వాయతినిలే’ (16 Vayathinile) – (తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’) అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్.
అప్పటివరకు స్టూడియో సెట్లలో, గ్లామర్ ప్రపంచంలో సాగుతున్న సినిమాను, మొదటిసారిగా పూర్తిగా పల్లెటూరి వాతావరణంలోకి, అవుట్‌డోర్ లోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదే.
భారతీరాజా తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన ఒక పల్లెటూరు లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు కళలపై, ముఖ్యంగా నాటకాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. గ్రామంలో పండుగల సమయంలో తానే స్వయంగా నాటకాలు రాసి, నటిస్తూ ఉండేవారు. ఆ నమ్మకంతోనే సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చెన్నై (మద్రాస్) నగరానికి చేరుకున్నారు.
సినిమా రంగంలోకి రావడం ఆయన అనుకున్నంత సులువు కాలేదు. అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగారు. తిండికి, గది అద్దెకు డబ్బులు లేక ఇబ్బందులు పడ్డారు. బతుకుదెరువు కోసం కొంతకాలం ఒక పెట్రోల్ బంక్‌లో అటెండెంట్‌గా కూడా పనిచేశారు.
అయినప్పటికీ తన సినిమా కలలను మాత్రం ఆయన వదులుకోలేదు. రేడియో నాటకాలు, చిన్న చిన్న సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రయత్నాలు కొనసాగించారు..కొన్నాళ్ళు హెల్త్ ఇనెస్పెక్టర్ గా కూడా చేశారు.
1967లో కన్నడ దిగ్గజ దర్శకుడు పుట్టణ్ణ కనగల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరే అవకాశం లభించింది. ఆయన్ను భారతీరాజా తన గురువుగా భావిస్తారు. ఆ తర్వాత పి. పుల్లయ్య, కృష్ణన్ నాయర్ వంటి ప్రముఖ దర్శకుల వద్ద పని చేస్తూ సినిమా మేకింగ్ లోని మెళకువలను, స్క్రిప్ట్ రాయడాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు.
దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, 1977లో ’16 వాయతినిలే’ సినిమాతో దర్శకుడిగా మారారు.అప్పటివరకు ఉన్న సినిమాల పద్ధతిని మార్చి, మేకప్ లేని పల్లెటూరి పాత్రలు, సహజమైన సంభాషణలతో సినిమాను రూపొందించారు.
ఈ సినిమాలో కమల్ హాసన్ (చప్పానిగా), శ్రీదేవి (మయిల్ పాత్రలో),రజనీకాంత్ (పరట్టై అనే విలన్ పాత్రలో) నటించారు. ఇళయరాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.
ఆ తర్వాత ఈ సినిమాను తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’ (చంద్రమోహన్, శ్రీదేవి, మోహన్ బాబు) గా రీమేక్ చేశారు.. ఆ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.. మొదటి సినిమా విజయంతో భారతీరాజా వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఆ తర్వాత ‘ఎర్ర గులాబీలు’, ‘సీతాకోకచిలుక’, ‘ముదల్ మరియాదై’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించారు.
భారతీరాజా తన చిత్రాలలో ఎక్కువగా ప్రేమ, గ్రామీణ జీవనం,బలమైన సామాజిక అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు.ఆయన సినిమాల్లో పల్లెటూరు కేవలం ఒక లొకేషన్ కాదు, అది కథలో ఒక పాత్రలా ఉంటుంది.పల్లెటూరి మనుషుల అమాయకత్వం, వారి ఆచారాలు, పండుగలు, జీవన శైలిని అత్యంత వాస్తవికంగా చూపించేవారు.
సమాజంలోని దురాచారాలను, మూఢనమ్మకాలను ప్రశ్నించే కథలను ఆయన ధైర్యంగా ఎంచుకున్నారు..కుల వివక్ష, అంటరానితనం వంటి సున్నితమైన అంశాలపై బలమైన సినిమాలు తీశారు.కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ తీసిన ‘వేదం పుదిదు’, ఆడశిశు భ్రూణహత్యల (Female Infanticide) నేపథ్యంతో వచ్చిన ‘కరుత్తమ్మ’ చిత్రాలు సమాజంలో పెద్ద చర్చకు దారితీశాయి.
ఆయన సినిమాల్లో ప్రేమ చాలా పవిత్రంగా, అదే సమయంలో సమాజంతో పోరాడే శక్తితో కనిపిస్తుంది.కులాలు, మతాల సరిహద్దులను బద్దలు కొట్టే ప్రేమకథలకు ఆయన కథల్లో ప్రాధాన్యత ఎక్కువ.
తమిళ చిత్రసీమ ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఆయనను ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శకత్వ శిఖరం) అని పిలుచుకుంటుంది. ఆయన కెరీర్‌లో మొత్తం 6 జాతీయ చలనచిత్ర అవార్డులను సొంతం చేసుకున్నారు.
భారతీరాజా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దేశీయంగా ఎన్నో అత్యున్నత అవార్డులను అందుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో ఆయనను సత్కరించింది.

