Naivedyam …..
పులిహోర గురించి అందరికి తెలుసు. మలిహోర గురించి అందరికి తెలియదు.చాలామంది ఎపుడు చూసి కూడా ఉండరు.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజూ దాదాపు 50 రకాలకు పైగా నైవేద్యాలను సమర్పిస్తారు. వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిర్దేశించిన నిబంధనలను అనుసరించే నేటికీ ఈ ప్రసాద నివేదనలు జరుగుతాయి. వాటిలో ఈ మలిహోర ఒకటి.
మలిహోర అంటే మిరియాల పొడి, నెయ్యి తాలింపుతో చేసే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయ అన్నం వంటకం (Pepper Rice). తిరుమల తిరుపతి దేవస్థానంలో, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలలో స్వామివారికి సమర్పించే అత్యంత శ్రేష్టమైన, పవిత్రమైన నైవేద్యాలలో ఇది ఒకటి.
మనం సాధారణంగా తినే పులిహోర, ఆవాహోర లాగే ఇది కూడా ఒక రకమైన అన్న ప్రసాదం, కానీ దీని రుచి, తయారీ విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆవపిండితో చేసేదాన్ని ‘ఆవాహోర’, కొబ్బరితో చేసేదాన్ని ‘కొబ్బరోర’ అన్నట్లుగా.. మిరియాల (మరిచం) పొడిని ప్రధాన పదార్థంగా ఉపయోగించి చేసే ఈ అన్నాన్ని “మలిహోర” అని పిలుస్తారు.
ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండుకుని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకుంటారు.నల్ల మిరియాలను దోరగా వేయించి, మెత్తటి పొడిగా చేసుకుని చల్లారిన అన్నంలో తగినంత ఉప్పుతో పాటు కలుపుతారు.
ఈ వంటకానికి నూనె వాడరు. కేవలం ఘుమఘుమలాడే శుద్ధమైన నెయ్యిని మాత్రమే తాలింపుకు ఉపయోగిస్తారు.వేడి నెయ్యిలో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు లేదా పల్లీలు, కరివేపాకు వేసి బాగా వేయించి అన్నంలో కలుపుతారు. అంతే ..మలిహోర సిద్ధం అయినట్టే.
ఇది కేవలం దేవుడి ప్రసాదం మాత్రమే కాదు, పూర్వ కాలంలో మన పెద్దలు దీనిని ఒక గొప్ప ఆరోగ్యకరమైన ఆహారంగా భావించేవారు.ఇళ్లలో కూడా తయారు చేసుకునే వారు. మిరియాలు, నెయ్యి కలయిక వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.వర్షాకాలం, చలికాలంలో ఈ మిరియాల అన్నం తినడం వల్ల గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇక స్వామి వారికి రోజూ మూడు పూటలా (త్రికాల నైవేద్యం) గంటలు మ్రోగిస్తూ అన్నప్రసాదాలను సమర్పిస్తారు. వీటిని మొదటి గంట (బాలభోగం), రెండవ గంట (రాజభోగం), మూడవ గంట (శయనభోగం) అని పిలుస్తారు.
ఈ ప్రసాదాలను వాటి స్వభావాన్ని బట్టి ప్రధానంగా 4 రకాలుగా విభజించవచ్చు
1. అన్న ప్రసాదాలు (బియ్యంతో చేసేవి)
ముద్గాన్నం అనగా కట్టె పొంగలి ఇందులో కూడా నెయ్యి , మిరియాలు వాడతారు. తింత్రిణీఫల రసాన్నం అంటే చింతపండు పులిహోర. గుడ అన్నం / చక్కెర పొంగలి బెల్లం, నెయ్యితో చేసేది.దధ్యోజనం అనగా కమ్మని పెరుగన్నం. మారీచ్యాన్నం (మలిహోర) అనగా మిరియాల అన్నం. కదంబం అనగా కూరగాయలు, పులుసుతో చేసిన శాకాన్నం. మాత్రాన్నం అనగా అన్నం, గడ్డ పెరుగు, శొంఠి, వెన్న మిశ్రమంతో చేసేది.
2. పిండి వంటలు బెల్లం లేదా చక్కెర తో తయారు చేస్తారు.
చిన్న లడ్డు, కళ్యాణం లడ్డు, ఆస్థాన లడ్డు. అప్పం & పాయసం ఇవి సాంప్రదాయ పిండి వంటకాలు. జిలేబీ & మనోహరం వీటిని బియ్యం పిండి, పెసరపప్పు, బెల్లం, మిరియాలతో చేసే లడ్డు. పోళీలు (బొబ్బట్లు) & సుఖియం (బూరెలు) ఇవి ప్రత్యేక వంటకాలు. అమృతకలశం .. బియ్యం పిండి, బెల్లం, నెయ్యి, మిరియాల మిశ్రమం.
3. పణ్యారములు (ఉప్పు, పప్పులతో కూడినవి)
శ్రీవారి వడ… మిరియాలతో చేసే గట్టి వడ…. దోశె & నెయ్యిదోశె.. స్వామి వారికి ప్రీతికరమైనవి…..తేనెతోళీలు.. పెద్ద జంతికలు లేదా మురుకులు……సుండలు… పచ్చి శనగపప్పు, కొబ్బరితో చేసిన గుగ్గిళ్ళు.
4. అపక్వ ప్రసాదాలు (వండకుండా సమర్పించేవి)
నవనీతం… తాజా వెన్న (సుప్రభాత సేవలో సమర్పిస్తారు)….గోక్షీరం…. పచ్చి ఆవు పాలు….కొలువు ప్రసాదం… నల్ల నువ్వులు, బెల్లం, శొంఠి మిశ్రమం (ఉదయం దర్బార్‌లో సమర్పిస్తారు).
పంచకజ్జాయం…. జీడిపప్పు, గసగసాలు,ఎండుకొబ్బరి తురుము, చక్కెర, యాలకుల పొడి కలిపిన మిశ్రమం.
వారంలో ఒక్కో రోజు ప్రత్యేక నైవేద్యం
సాధారణ రోజులతో పాటు గురువారం జరిగే ‘తిరుప్పావడ సేవ’లో సుమారు 420 కేజీల బియ్యంతో పెద్ద పులిహోర రాశిని (కొండలా) చేసి స్వామి వారి ఎదుట నైవేద్యంగా పెడతారు. ఆ రోజున చాటంత పెద్ద జిలేబీలు, మురుకులు కూడా సమర్పిస్తారు.

