Flaws in the legal system……….
‘సిస్టమ్’ (System) సినిమా ఒక పవర్‌ఫుల్ లీగల్ డ్రామా..ప్రముఖ దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. సమాజంలోని అట్టడుగు వర్గాల ఆవేదనను, లీగల్ సిస్టమ్‌లోని లోపాలను ఈ సినిమా ఎండగట్టింది.
కథాంశం
రవి రాజ్‌వంశ్ (అశుతోష్ గోవారికర్) దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఎప్పుడూ ఓడిపోని ఒక టాప్ డిఫెన్స్ లాయర్. ఆయన కూతురు నేహా రాజ్‌వంశ్ (సోనాక్షి సిన్హా) తన తండ్రి నీడ నుండి బయటపడి, సొంతంగా లాయర్‌గా తన సత్తా నిరూపించుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చేరుతుంది.
కానీ, ఆమె వరుసగా కేసులు ఓడిపోతూ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ సమయంలో కోర్టులో పని చేసే ఒక సాధారణ స్టెనోగ్రాఫర్ శారికా రావత్ (జ్యోతిక) నేహాకు పరిచయమవుతుంది. లీగల్ సిస్టమ్‌లోని లోపాలను క్షుణ్ణంగా తెలిసిన శారిక, నేహాకు వెనుక ఉండి లీగల్ టిప్స్, ఆధారాలు ఇస్తూ కేసులు గెలవడానికి సహాయం చేస్తుంది.
ఈ క్రమంలో ఒక హై-ప్రొఫైల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మర్డర్ కేస్ వీరి ముందుకు వస్తుంది. ఈ కేసును విచారించే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడతాయి, అలాగే నేహా తన సొంత తండ్రితోనే కోర్టులో తలపడాల్సి వస్తుంది. అధికారం, క్లాస్ పాలిటిక్స్ చుట్టూ తిరిగే ఈ వ్యవస్థను ఈ ఇద్దరు మహిళలు ఎలా ఢీకొన్నారు అనేదే కథ.
ఈ సినిమాకు ప్రధాన బలం జ్యోతిక, సోనాక్షి సిన్హాల పర్ఫార్మెన్స్.ముఖ్యంగా స్టెనోగ్రాఫర్ శారిక పాత్రలో జ్యోతిక చాలా హుందాగా, లోతైన ఎమోషన్స్‌తో వన్-మెన్ షో చేసింది. సోనాక్షి సిన్హా కూడా ఒక ప్రివిలేజ్డ్ క్లాస్ నుండి వచ్చి సమాజంలోని వాస్తవాలను తెలుసుకునే యువ లాయర్‌గా చక్కని నటన కనబరిచింది.
ఒక వైపు సోనాక్షి సిన్హా ఉండే విలాసవంతమైన బంగ్లా, మరోవైపు జ్యోతిక ఉండే ఇరుకైన మధ్యతరగతి ఇల్లు.. ఈ రెండింటి ద్వారా సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య ఉన్న అసమానతలను దర్శకురాలు చాలా ప్రతిభావంతంగా చూపించారు. ఒక సీనియర్ పవర్‌ఫుల్ లాయర్‌గా అశుతోష్ గోవారికర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా హుందాగా, గంభీరంగా ఉంది.
సోనాక్షి కోర్టులో ఒక క్లిష్టమైన కేసును వాదిస్తున్నప్పుడు, జ్యోతిక తన స్టెనోగ్రాఫర్ సీట్లో కూర్చుని.. టైప్ చేస్తూనే చాకచక్యంగా సోనాక్షికి సైగలు ద్వారా చిన్నచిన్న హింట్స్ ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.అవతలి లాయర్ అడిగే ప్రశ్నలకు సోనాక్షి ఎలా కౌంటర్ ఇవ్వాలో జ్యోతిక వెనుక నుండి నడిపించే విధానం బాగుంది.
ఇంట్లో ఎంతో ప్రేమగా ఉండే తండ్రి, కోర్టు గదిలోకి రాగానే ఒక పదునైన లాయర్‌గా మారి కూతురిని ఎలా ఇరుకున పెడతాడు? దానిని సోనాక్షి, జ్యోతిక సహాయంతో ఎలా ఎదురుదెబ్బ తీస్తుంది? అనే కోర్టురూమ్ డ్రామా సీన్స్ చాలా పవర్‌ఫుల్‌గా సాగుతాయి.
“న్యాయ వ్యవస్థ పుస్తకాల్లో ఉన్న రూల్స్ ప్రకారం నడవదు.. అందులోని లూప్‌హోల్స్ (లోపాలు) పట్టుకుంటేనే నడుస్తుంది” వంటి డైలాగులు బాగున్నాయి. ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతాన్ని ప్రముఖ బాలీవుడ్ కంపోజర్స్ అందించారు.కోర్ట్‌రూమ్ డ్రామా ప్రధానంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పైనే సాగుతుంది.
ఈ చిత్రానికి రంగరాజన్ రామభద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన కోర్ట్‌రూమ్ సన్నివేశాలను, ముంబై నగర నేపధ్యాన్ని తన కెమెరాతో చాలా సహజంగా, ఇంటెన్స్‌గా చూపించారు. దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ కథపై బాగానే కసరత్తు చేశారు.ప్రధాన పాత్రలను ఆసక్తికరంగా మలిచారు. అందరి నుంచి మంచి నటనను రాబట్టారు.
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి సెంటిమెంట్ డోస్ ఎక్కువై కథనం నెమ్మదిస్తుంది. కోర్టురూమ్ డ్రామాలో థ్రిల్, సస్పెన్స్ ఆశించే ప్రేక్షకులకు కొన్ని సీన్లు చాలా రొటీన్‌గా, ముందే ఊహించే విధంగా అనిపిస్తాయి. ల్యాగ్ సీన్స్ కొంచెం ఓపికను పరీక్షిస్తాయి.ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

