‘శివఖోరి’ ప్రత్యేకత ఏమిటంటే ?

Sharing is Caring...

Cave Temple……………

శివఖోరి ( శివఖోడి అని కూడా పిలుస్తారు). ఇది జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లా, రాన్సూ గ్రామంలో ఉన్న శివుని పవిత్ర గుహాలయం. ప్రజలు ఇక్కడికి ఏడాది పొడవునా వస్తుంటారు.

ఈ శివ ఖోరి  ప్రత్యేకత ఏమంటే ఈ గుహ లోపల సుమారు 4 అడుగుల ఎత్తున్న స్వయంభూ శివలింగం కొలువై ఉంది. ఈ లింగంపై గుహ పైకప్పు (సీలింగ్) నుండి నిరంతరం పాల వంటి తెల్లటి నీటి చుక్కలు సహజ సిద్ధంగా పడుతూ ఉంటాయి. దీనిని భక్తులు ‘దూద్ గంగ’ అని పిలుస్తారు. ఈ పవిత్ర జలం నేరుగా గంగా నది నుండి జాలువారుతుందని భక్తుల నమ్మకం.

స్థల పురాణం ప్రకారం, భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి, తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మమైపోయేలా వరం పొందుతాడు. వరం పొందగానే ఆ శివుడి పైనే ప్రయోగించబోతాడు. ఆ సమయంలో శివుడు తన త్రిశూలంతో ఒక కొండను చీల్చి, ఈ గుహను సృష్టించి పార్వతీ దేవి, నంది సమేతంగా ఇందులో దాక్కున్నాడని చెబుతారు. ఆ తర్వాత విష్ణుమూర్తి మోహినీ అవతారంలో వచ్చి ఆ రాక్షసుడిని అంతం చేస్తాడు.

ఈ గుహ గోడలపై, పైకప్పుపై సహజంగా ఏర్పడిన రాతి ఆకృతులు ఉన్నాయి.. ఇవి వినాయకుడు, పార్వతీ దేవి, కార్తికేయుడు, నంది, శేషనాగు వంటి అనేక మంది దేవతా మూర్తుల రూపాలను పోలి ఉంటాయి అందుకే ఈ గుహను “దేవతల నిలయం” అని కూడా పిలుస్తారు.

రాన్సూ (బేస్ క్యాంప్) నుండి  గుహను చేరుకోవడానికి సురక్షితమైన కొండ మార్గంలో నడవాల్సి ఉంటుంది. ఈ మార్గం సుమారు 3–4 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో చాలా చోట్ల రేలింగ్‌లు (చేతి పట్టులు) విశ్రాంతి స్థలాలు ఉన్నాయి.వృద్ధులు,నడవలేని వారు అధికారిక కౌంటర్ల నుండి గుర్రాలు (పోనీ),పల్లకి లేదా పిట్టూ (మనుషులు మోసే వసతి) సేవలను ఉపయోగించుకోవచ్చు. గుహ లోపలికి ఫోన్లు,  కెమెరాలకు అనుమతి ఇవ్వరు. కాబట్టి దర్శనానికి వెళ్లే ముందు వాటిని క్లోక్ రూమ్‌లో ఉంచాలి.

మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా శివఖోరిలో మూడు రోజుల పాటు పెద్ద మేళా (జాతర) జరుగుతుంది. ఈ రోజుల్లో భక్తులు ప్రార్థనలు చేయడానికి, భజనలు పాడటానికి, దర్శనం చేసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ “మేళా” సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి ప్రారంభంలో జరుగుతుంది. ఈ “మేళా” సజావుగా సాగడానికి ఆలయ బోర్డు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది.

శివఖోరి యాత్రకు వెళ్ళడానికి అత్యంత అనుకూలమైన సమయం సెప్టెంబర్ నుండి మార్చి వరకు. ఈ నెలల్లో జమ్మూ కాశ్మీర్‌లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, చల్లగా ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల 3-4 కిలోమీటర్ల కొండ మార్గంలో నడవడం ఎంతో సులభంగా ఉంటుంది.

ఏప్రిల్ నుండి జూన్ వరకు  కాస్త ఎండ తీవ్రత ఉంటుంది. మధ్యాహ్నం వేళల్లో నడవడం కొంచెం అలసటగా అనిపిస్తుంది. జూలై నుండి ఆగస్టు వరకు ఈ కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  వర్షాకాలంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.     

వైష్ణో దేవి (కత్రా) యాత్రతో పాటు శివఖోరిని కూడా సందర్శించడం చాలా సులభం. చాలా మంది ప్రజలు కత్రా + శివఖోరి ట్రిప్‌ను ప్లాన్ చేసుకుంటారు. మీరు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే కత్రా నుండి రాన్సూకు దూరం సుమారు 80 కిలోమీటర్లు ఉంటుంది.

అలాగే జమ్మూ నుండి రాన్సూకు దూరం కత్రా మీదుగా దాదాపు 129 కిలోమీటర్లు లేదా అఖ్నూర్-భంబ్లా మార్గం ద్వారా దాదాపు 112 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణానికి పట్టే అసలు సమయం ట్రాఫిక్,  మీరు ఎంచుకునే మార్గంపై ఆధారపడి ఉంటుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!