Special attention to characters…..
దర్శకుడు భారతీరాజా అప్పటివరకు ఉన్న కమర్షియల్ సినిమా సూత్రాలను పూర్తిగా తిరగరాశారు.సినిమాను స్టూడియోల కృత్రిమ సెట్ల నుండి బయటకు తెచ్చి, మట్టి వాసనలు, సహజత్వంతో నింపిన ప్రత్యేకమైన మేకింగ్ విధానం ఆయనది. ఆయన కథల్లో హీరోలు సర్వశక్తిమంతులు కాదు. శారీరక లోపాలు ఉన్నవారు లేదా చాలా అమాయకులు (ఉదాహరణకు ‘పదహారేళ్ళ వయసు’ లో చప్పాని పాత్ర).
సాంప్రదాయ సినిమాల్లో లాగా పాత్రలు కేవలం పూర్తిగా మంచివి లేదా పూర్తిగా చెడ్డవిగా ఉండవు. మనుషుల్లో ఉండే స్వార్థం, బలహీనతలను ఆ పాత్రల్లో సహజంగా చూపించేవారు. పాత్రల మధ్య సున్నితమైన భావోద్వేగాలను పండించేవారు. ప్రేమ, స్నేహం, బంధాల మధ్య ఉండే సున్నితమైన సంఘర్షణను కథగా మలిచేవారు.
సామాజిక స్పృహ కు ఆయన కథలు దర్పణం పట్టే విధంగా ఉండేవి. కథ వినోదాన్ని అందిస్తూనే సమాజంలోని కుల వివక్ష, దురాచారాలను ఖండించేవి. నిశ్శబ్దంగా పల్లెటూరి పచ్చని పొలాలు, చెరువులు, కొండలను తన కెమెరా కంటితో ఒక దృశ్య కావ్యంలా చూపించేవారు.
నటీనటులకు భారీ మేకప్‌లు లేకుండా, సాధారణ దుస్తులతో సహజంగా ఉండేలా చూసేవారు. హీరోయిన్లను సైతం గ్లామర్ బొమ్మల్లా కాకుండా పల్లెటూరి అమ్మాయిల్లా నల్లగా, సహజంగా చూపించారు.సంగీతాన్ని కథలో భాగం చేయడం ఆయన ప్రత్యేకత ..ఇళయరాజాతో ఆయనకు ఉన్న అనుబంధం అద్భుతమైనది. పాటలను కేవలం వినోదం కోసం కాకుండా, కథను ముందుకు నడిపించే సాధనంగా వాడుకున్నారు.
భారతీరాజా చిత్రాలలో హీరోయిన్ పాత్రలు కేవలం పాటలకే పరిమితం కాకుండా, చాలా స్వతంత్రంగా, ఆత్మగౌరవం ఉన్నవిగా ఉంటాయి. రాధిక, రాధ, రేవతి, విజయశాంతి వంటి ఎందరో నటీమణులకు వారి కెరీర్ లో గుర్తుండిపోయే బలమైన పాత్రలను ఇచ్చింది ఆయనే.
సరికొత్త ప్రతిభను వెలికితీయడంలో ఆయన దిట్ట. రాధిక, రాధ, రేవతి, కార్తీక్, విజయశాంతి వంటి ఎందరో స్టార్లను ఆయనే పరిశ్రమకు పరిచయం చేశారు.కేవలం పల్లెటూరి కథలే కాకుండా, నగర నేపథ్యంతో కూడిన వినూత్నమైన థ్రిల్లర్ కథలను కూడా ఆయన తెరకెక్కించారు.
కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘ఎర్ర గులాబీలు’ (సిగప్పు రోజాక్కల్) సినిమా భారతీయ చిత్రసీమలోనే ఒక క్లాసిక్ సైకో-థ్రిల్లర్‌గా నిలిచింది. అలాగే బాండ్ తరహా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’ కూడా ఆయన ప్రయోగమే.
భారతీరాజా కథల ప్రత్యేకత ఏమిటంటే, క్లిష్టమైన సామాజిక సమస్యలను కూడా అద్భుతమైన పాటలు, బలమైన భావోద్వేగాలతో (Emotions) ముడిపెట్టి సామాన్య ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా చెప్పడం.
షూటింగ్ స్పాట్‌లో భారతీరాజా చాలా కోపంగా, ఖచ్చితత్వంతో ఉండేవారు. ఆయనకు కావలసిన ఔట్‌పుట్ వచ్చే వరకు నటులను వదిలిపెట్టేవారు కాదు. కొంచెం తేడా వచ్చినా సెట్ లోనే గట్టిగా అరిచేవారని నటీనటులు చెబుతుంటారు. నటులు మేకప్ లేకుండా, చాలా సాధారణంగా, సహజంగా కనిపించాలని కోరుకునేవారు.
నటుల కంటే పాత్రలే ప్రేక్షకులకు కనిపించేలా వారితో మెలిగేవారు. భారతీరాజా కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, అద్భుతమైన నటుడు కూడా (ఆయన ‘యువ’, ‘తిరు’, ‘మహారాజ’ చిత్రాలలో నటించారు). ఒక సీన్ లో నటుడికి హావభావాలు రాకపోతే, ఆయనే స్వయంగా ఆ పాత్రలో లీనమై ఏడ్చి, నవ్వి లేదా కోపగించుకుని యాక్టింగ్ చేసి చూపించేవారు. నటులు దానిని కేవలం కాపీ చేస్తే సరిపోయేది.
గ్రామీణ పాత్రల యాస, నడవడిక, చూపులు ఎలా ఉండాలో నటులకు నూరిపోసేవారు. కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడిని సైతం ’16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) చిత్రంలో ‘చప్పాని’ అనే విలక్షణమైన పాత్ర కోసం పూర్తిగా మార్చేశారు…నటులు గ్లామర్ ను వదిలేసి, క్యారెక్టర్ లా మారేలా చేసేవారు.
ఉదాహరణకు, ఒక పల్లెటూరి అమ్మాయి పాత్ర ఉంటే, ఆ నటిని నిజంగానే ఎండలో తిరగడం, పొలం పనులు చేయడం వంటివి ప్రాక్టీస్ చేయించి ఆ పాత్రకు అవసరమైన సహజత్వాన్ని రాబట్టుకునేవారు..భారతీరాజా ఈ కఠినమైన శిక్షణ, సహజత్వ విధానమే ఆయన స్కూల్ నుండి వచ్చిన నటీనటులను ఇండస్ట్రీలో “నవరస నాయకులుగా”, అవార్డు విన్నర్లుగా మార్చింది.

