ఇదొక యాక్షన్ స్పై థ్రిల్లర్ !!

Sharing is Caring...

Terrorism background……..

FIR”  హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ  ఇంటెన్సివ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమా ఇది . మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో మాస్ మహారాజా రవితేజ సమర్పణలో 2022 లో విడుదల చేశారు.  ‘రాక్షసన్’ వంటి సూపర్ హిట్ తర్వాత విష్ణు విశాల్ నుండి వచ్చిన మరో వైవిధ్యమైన గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది.  

 కథాంశం  ఏమిటంటే ?

టెర్రరిజం నేపథ్యంలో కథ నడుస్తుంది.  ఇర్ఫాన్ అహ్మద్ (విష్ణు విశాల్) ఒక కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. పెద్ద కంపెనీలలో ఉద్యోగం రాక, ఒక చిన్న కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు ..ఈ క్రమంలోనే  కొలంబో, హైదరాబాద్ నగరాల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయి.

దేశంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్  ‘అబు బక్కర్ అబ్దుల్లా’ చెన్నైలోనే ఉన్నాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కి సమాచారం అందుతుంది ..కొన్ని అనుమానాస్పద పరిస్థితుల వల్ల ఇర్ఫాన్‌ను NIA అధికారులు ఆ టెర్రరిస్ట్‌గా భావించి అరెస్ట్ చేస్తారు. సమాజం,మీడియా అతన్ని దేశద్రోహిగా ముద్ర వేస్తాయి.

ఇర్ఫాన్ తాను నిర్దోషినని ఎలా నిరూపించుకున్నాడు? అసలు ఆ అబు బక్కర్ ఎవరు? అనేదే మిగిలిన కథ.  
కథలో కొన్ని ఊహించని ట్విస్టులు కూడా పెట్టారు. 

ఇర్ఫాన్ పాత్రలో విష్ణు విశాల్ మంచి నటనను కనబరిచారు. ఒక మధ్యతరగతి యువకుడిగా,తీవ్రవాది అనే నింద పడినప్పుడు పడే వేదనను చాలా ఇంటెన్సివ్‌గా పండించారు. ఇర్ఫాన్ తల్లి గా మాలా పార్వతి బాగా చేశారు. లాయర్ ప్రార్థన గా మంజిమా మోహన్, NIA అధికారిణి అనిషా ఖురేషిగా రైజా విల్సన్ తమ నటనతో ఆకట్టుకుంటారు.

NIA సలహా దారుగా గౌతమ్ వాసుదేవ్ మీనన్, కింది స్థాయి అధికారి గుణశేఖర్ గా ప్రవీణ్ ముత్తురంగన్ వారి పరిథి మేరకు బాగానే చేశారు. సినిమా మొదటి భాగం ఎక్కడా బోర్ కొట్టకుండా వేగంగా సాగిపోతుంది. ఏజెన్సీల ఆపరేషన్లు, ఇన్వెస్టిగేషన్ సీన్లు  గ్రిప్పింగ్‌గా ఉంటాయి. విష్ణు విశాల్ ను NIA అధికారులు విచారించే సన్నివేశాలు ,అతగాడు తప్పించుకుని పారిపోయే సీన్లు బాగా వచ్చాయి. 

ద్వితీయార్థంలో వచ్చే కొన్ని సీన్లు, లవ్ ట్రాక్ కథలో వేగాన్ని తగ్గించాయి.తల్లి ఆసుపత్రిలో ఉన్నపుడు హీరో వెళ్లే సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. మదర్ సెంటిమెంట్ ను బాగానే పండించారు.కొన్ని చోట్ల సన్నివేశాలకు లింక్ ఉండదు.అక్కడక్కడ లాజికల్ లోపాలున్నాయి. 

క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నప్పటికీ,అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. ప్రీ-క్లైమాక్స్,క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. క్లైమాక్స్ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. “FIR” సినిమాకు ప్రధాన బలాలలో అరుల్ విన్సెంట్ కెమెరా వర్క్, అశ్వత్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (సంగీతం) ముఖ్యమైనవి. ఒక ఇంటెన్సివ్ స్పై థ్రిల్లర్ కథకు కావలసిన గంభీరమైన మూడ్‌ను క్రియేట్ చేయడంలో ఈ రెండు విభాగాలు అద్భుతంగా పనిచేశాయి. 

ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు అనే పాయింట్‌ను గతంలో ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘విశ్వరూపం’ లాంటి సినిమాల్లో ఆల్రెడీ చూసేయడం వల్ల కథలో కొత్తదనం తక్కువ అనిపించవచ్చు. టెర్రరిజం అనే ఒక సున్నితమైన సామాజిక అంశాన్ని చర్చిస్తూనే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే మంచి టాట్ థ్రిల్లర్. 

 మైండ్ గేమ్స్, రా ఏజెంట్స్, సస్పెన్స్ సినిమాలను ఇష్టపడేవారైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో,YOU TUBE లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని అస్సలు మిస్ అవ్వకండి . 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!