A contemporary story…….
‘భద్రకాళి’ తమిళ చిత్రం ‘శక్తి తిరుమగన్’ కు అనువాదంగా వచ్చిన తెలుగు సినిమా. ఇదొక మైండ్ గేమ్ పొలిటికల్ థ్రిల్లర్. వైవిధ్య చిత్రాల హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అరువి (Aruvi) ఫేమ్ అరుణ్ ప్రభు పురుషోత్తమన్ దర్శకత్వం వహించారు.
కథ ఏమిటంటే ?
అనాథ అయిన కిట్టూ (విజయ్ ఆంటోనీ) సెక్రటేరియట్ కేంద్రంగా పనిచేసే ఒక అత్యంత తెలివైన, పవర్ బ్రోకర్.. ఎంతటి అసాధ్యమైన పనులను అయినా తన మేధస్సుతో అనుకూలంగా మార్చగల సమర్థుడు. అటు రాజకీయాలు, ఇటు పోలీసు వ్యవస్థను తన గుప్పెట్లో ఉంచుకునే అభ్యంకర్ శంకర్ (సునీల్ కృపాలనీ) అనే పెద్ద పవర్‌హౌస్‌తో కిట్టూకు వైరం మొదలవుతుంది.
తన సామ్రాజ్యానికి అడ్డుగా వస్తున్న కిట్టూపై అభ్యంకర్ వందకు పైగా అక్రమ కేసులు పెట్టి, అతని 6,236 కోట్ల రూపాయల రహస్య ఆస్తిని సీజ్ చేయించి జైలులో పెట్టిస్తాడు. కిట్టూ ఆ జైలు నుండి ఎలా బయటపడి ప్రజల పక్షాన నిలిచాడనేదే మిగిలిన కథ.
కథ అంతా విజయ్ ఆంటోనీ చుట్టూనే నడుస్తుంది . ఇదొక వన్-మ్యాన్ షో. ఒక సెటిల్‌మెంట్ బ్రోకర్‌గా, మైండ్ గేమ్‌లు ఆడే వ్యూహకర్తగా విజయ్ ఆంటోనీ తన మార్క్ ఇంటెన్స్ నటనతో సినిమాను ముందుండి నడిపించారు.
రాజకీయ వ్యవస్థ వెనుక ఉండే చీకటి లాబీయింగ్, పైరవీల కోణాన్ని ఎంచుకోవడం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని పొలిటికల్ మైండ్ గేమ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.హీరో బ్రోకర్ గా చేస్తున్నప్పటికీ ఎంతోమందికి మంచి చేస్తూ, అతని టార్గెట్ ఏంటో చెప్పకుండా కథను ఆసక్తికరంగా నడిపించారు.
సినిమా ప్రథమార్ధం వేగంగా నడుస్తుంది. ద్వితీయార్ధం లో కథనం కొంత స్లో అవుతుంది. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ సినిమా తన ఒరిజినల్ మైండ్ గేమ్ శైలిని పక్కన పెట్టి, రెగ్యులర్ రివెంజ్ డ్రామా, నాటకీయత వైపు మారిపోతుంది. సుదీర్ఘమైన క్లైమాక్స్ ఎపిసోడ్ కొంచెం సాగతీత గా అనిపిస్తుంది.
కథానాయికగా నటించిన తృప్తి రవీందర్‌కు ఈ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. హీరో భార్యగా ఆమె భావోద్వేగాలను చక్కగా పండించింది.కిట్టూ ఆస్తులను, లాబీయింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి వచ్చే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్‌గా కిరణ్ తన నటనతో ఆకట్టుకున్నారు. హీరో , ఈ ఆఫీసర్ మధ్య వచ్చే సీన్లు కథను రేసీగా మారుస్తాయి.
పోలీస్ వ్యవస్థను రాజకీయనేతలు ఎలా వాడుకుంటారో ఆ పాత్ర ద్వారా చూపించారు .మారుతి పాత్రలో నటించిన సెల్ మురుగన్ బాగా చేశారు .సినిమాలో అభ్యంకర్ శంకర్ పాత్రలో సునీల్ కృపాలనీ రెగ్యులర్ మాస్ విలన్లలా కాకుండా, కేవలం తన తెలివితేటలతో అటు రాజకీయ వ్యవస్థను, ఇటు పోలీసు శాఖను తన గుప్పెట్లో పెట్టుకునే ఒక స్టైలిష్ కార్పొరేట్ బాస్‌గా కనిపించారు.
పెద్దగా అరుపులు, కేకలు లేకుండా సైలెంట్‌గా ఉంటూనే శత్రువును పాతాళానికి తొక్కేసే ఒక పవర్‌హౌస్ మైండ్ సెట్‌ను ఆయన తన బాడీ లాంగ్వేజ్‌తో చాలా హుందాగా ప్రదర్శించారు.ఇతర పాత్రధారులు కూడా బాగానే చేశారు.
దర్శకుడు అరుణ్ ప్రభు కేవలం రివెంజ్ డ్రామాగానే కాకుండా, ఈ సినిమా ద్వారా సమాజంలోని కొన్ని కీలక అంశాలను ప్రశ్నించారు.దేశంలోని సంపద అంతా కేవలం కొంతమంది బడా పారిశ్రామికవేత్తల చేతుల్లోనే ఎందుకు ఉండిపోతోంది?సామాన్యుడు ఎప్పటికీ పేదవాడిగానే మిగిలిపోవడానికి, కార్పొరేట్ శక్తులు దేశ సంపదను దోచుకుని విదేశాల్లో ఎలా స్థిరపడుతున్నాయనే పాయింట్లను అర్ధవంతంగా చూపించారు.
ఈ చిత్రానికి హీరో విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలో పాటలు చాలా సాదాసీదాగా, కొంత డల్‌గా అనిపించినప్పటికీ, థ్రిల్లర్ మూడ్‌ను నిలబెట్టే BGM మాత్రం సీన్లను బాగా ఎలివేట్ చేసింది.
షెల్లీ కాలిస్ట్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ , ఫ్రేమింగ్ సినిమాటిక్‌గా బాగున్నాయి. రాజకీయ గూడుపుఠాణీలను, సెక్రటేరియట్ వాతావరణాన్ని కలర్‌ఫుల్‌గా క్యాప్చర్ చేశారు.సెకండాఫ్‌లోని కొన్ని సాగతీత సీన్లను, సుదీర్ఘమైన క్లైమాక్స్ ఎపిసోడ్‌ను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఈ సినిమా అమెజాన్,జియో హాట్ స్టార్ లలో తెలుగు వెర్షన్ తో స్ట్రీమింగ్ అవుతోంది.
.

