Inappropriate comments……..
ప్రధాన స్రవంతి మీడియా సంస్థగా సన్ టీవీ (Sun TV) నటి సుకన్య విషయం లో అలా వ్యవహరించి ఉండకూడదు. ప్రజాదరణ, టీఆర్పీ రేటింగుల కోసం, ఆమె అభిప్రాయం తీసుకోకుండా, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఏవో అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని యథాతథంగా ప్రసారం చేసి కేసులో ఇరుక్కుంది.
ఎడిటింగ్ చేసే పూర్తి హక్కులు, సాంకేతిక వనరులు ఉన్నప్పటికీ అలా చేయకుండా నటి సుకన్య వ్యక్తిత్వాన్ని, ఆమె పరువును రోడ్డుకీడ్చేలా ఆ అనుచిత వ్యాఖ్యలను తొలగించకుండా టెలికాస్ట్ చేయడం మీడియా నైతికతకే ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని కోర్టు వ్యాఖ్యానించింది.
దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తుది తీర్పు ఇది.. రేటింగ్స్ ముసుగులో వ్యక్తుల గౌరవంతో ఆడుకునే ఏ ఛానల్‌కైనా చట్టం ముందు బాధ్యత తప్పదని నిరూపించింది. నటి సుకన్య కు ₹10.01 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తుది తీర్పు వెలువరించడంతో ఈ వివాదం ముగిసింది.
ఏప్రిల్ 17, 1996 న సన్ టీవీలో ‘నెరుక్కు నెర్’ అనే కార్యక్రమంలో వీరప్పన్ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఈ ఇంటర్వ్యూను ‘నక్కీరన్’ పత్రిక ఎడిటర్ ఆర్.ఆర్. గోపాల్ రికార్డ్ చేశారు..ఆ ఇంటర్వ్యూలో వీరప్పన్ నటి సుకన్య గురించి ఎలాంటి ఆధారాలు లేని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
వీరప్పన్ ఇంటర్వ్యూ ప్రసారమైన తర్వాత, నటి సుకన్య మొదట ₹10.01 లక్షల నష్టపరిహారం కోరుతూ మద్రాస్ హైకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. అయితే, తదుపరి కాలంలో నిబంధనల మార్పుల వల్ల (Pecuniary Jurisdiction) ఈ కేసు 2011లో చెన్నైలోని సిటీ సివిల్ కోర్టుకు బదిలీ అయింది.
2015లో చెన్నై సిటీ సివిల్ కోర్టు కేసును విచారించి, నటి సుకన్యకు అనుకూలంగా తీర్పునిస్తూ ఆమెకు ₹10.01 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. సివిల్ కోర్టు ఇచ్చిన ఆ తీర్పును సవాలు చేస్తూ, తాము ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తూ సన్ టీవీ యాజమాన్యం 2015లోనే మద్రాస్ హైకోర్టులో అప్పీల్ (Appeal Suit) దాఖలు చేసింది.
సన్ టీవీ దాఖలు చేసిన ఆ అప్పీల్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. కుమారేష్ బాబు, సన్ టీవీ వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. సివిల్ కోర్టు ఇచ్చిన పాత ఆర్డర్‌ను సమర్థిస్తూ, సన్ టీవీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేశారు.
సన్ టీవీకి ఆ ఇంటర్వ్యూను ఎడిట్ చేసే, మార్చే లేదా వివాదాస్పద భాగాలను తొలగించే పూర్తి హక్కులు ఉన్నాయి. అయినప్పటికీ, రేటింగ్స్ కోసం ఆ నిందాపూర్వక వ్యాఖ్యలను తొలగించకుండా అలాగే ప్రసారం చేశారు. ఈ క్రమంలోనే నటి సుకన్య కోర్టును ఆశ్రయించారు.

