స్వయం కృషితో ఎదిగిన హీరో !!

Sharing is Caring...

 Distinctive acting………

మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణమైన నటనతో, ‘యూత్ ఐకాన్’గా ఎదిగిన షేన్ నిగమ్ (Shane Nigam) జీవిత ప్రయాణం సినిమా కథను తలపిస్తుంది. ఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు, వ్యక్తిగత విషాదాలను దాటుకుని ఆయన ఈరోజు స్టార్ హీరోగా నిలబడ్డారు

షేన్ నిగమ్ 1995 డిసెంబర్ 21న కేరళలోని కొచ్చిలో జన్మించారు. ఈయన తండ్రి కలాభవన్ అబి (Abi) మలయాళంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు. తండ్రిని చూస్తూ పెరగడం వల్ల షేన్‌కు చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఏర్పడింది.కొచ్చిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన షేన్, రాజగిరి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుండగానే సినిమాల్లోకి వచ్చారు. 

షేన్ నిగమ్ కెరీర్ బాలనటుడిగా బుల్లితెర (రియాలిటీ షోస్) ద్వారా ప్రారంభమైంది. 2010లో  ‘థాంతోన్ని’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన ‘నీలాకాశం పచ్చకడల్ చువన్న భూమి’ (2013), ‘అన్నాయుం రసూలుమ్’ వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 

2016లో వచ్చిన ‘కిస్మత్’ (Kismath) సినిమాతో షేన్ నిగమ్ మొదటిసారి సోలో హీరోగా మారారు. ఒక ముస్లిం యువకుడు, తనకంటే వయసులో పెద్దదైన హిందూ అమ్మాయిని ప్రేమించే ఈ రియలిస్టిక్ డ్రామాలో షేన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

2019లో వచ్చిన ‘కుంబళంగి నైట్స్’ (Kumbalangi Nights) సినిమా షేన్ నిగమ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఇందులో ‘బాబీ’ అనే కాస్త బాధ్యతారహితంగా ఉండే పక్కింటి అబ్బాయి పాత్రలో ఆయన జీవించేశారు. ఈ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలోనే ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచి, షేన్  ను  స్టార్‌ను చేసింది. అదే ఏడాది వచ్చిన ‘ఇష్క్’ (Ishq) చిత్రం కూడా ఆయన ఇమేజ్‌ను మరింత పెంచింది.

షేన్ కెరీర్ ఊపందుకుంటున్న సమయంలోనే 2017లో ఆయన తండ్రి అబి మరణించారు.  అది షేన్ కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేసింది.2019-2020 సమయంలో ‘వెయిల్’ సినిమా షూటింగ్ సందర్భంగా నిర్మాతలతో వచ్చిన విభేదాల కారణంగా కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ షేన్ నిగమ్‌పై  నిషేధం విధించింది. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ పాలిటిక్స్ వల్ల కెరీర్ ముగిసిపోతుందేమో అన్న పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నారు. 

ఎన్ని నిందలు, నిషేధాలు ఎదురైనా షేన్ తన టాలెంట్‌ను నమ్ముకున్నారే కానీ వెనకడుగు వేయలేదు.2022లో వచ్చిన హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘భూతకాలం’ లో మానసిక సమస్యలతో బాధపడే యువకుడిగా అద్భుత నటన కనబరిచి అందరి నోళ్లు మూయించారు.

పాత్ర చిన్నదైనా,పెద్దదైనా తనదైన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకు ఉంది.కుంబళంగి నైట్స్’ వంటి ఎమోషనల్ రోల్స్, ‘RDX’ వంటి ఊర మాస్ యాక్షన్ సీన్లు,  ‘దృఢం’ లోని ఇంటెన్స్ పోలీస్ పాత్రను  రక్తికట్టించగల ప్రతిభ ఆయన సొంతం.

డైలాగుల కంటే ఎక్కువగా తన కళ్లతోనే కంగారు, భయం, మానసిక వేదన వంటి తీవ్రమైన భావోద్వేగాలను పలికించడంలో ఆయన సిద్ధహస్తుడు.షేన్ నటన సహజంగా ఉంటుంది. అదే షేన్ కి ప్లస్ పాయింట్. 2023లో వచ్చిన పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ‘RDX’ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి సంచలన విజయం నమోదు చేసింది.

ఈ బ్లాక్‌బస్టర్‌తో షేన్ నిగమ్ తన సత్తా చాటుకుని పరిశ్రమలో నిలదొక్కుకున్నారు.ఇటీవల ఆయన నటించిన ‘దృఢం’ క్రైమ్ థ్రిల్లర్ జియో హాట్ స్టార్ (JioHotstar) లో మంచి వ్యూస్ సాధిస్తోంది. అంతేకాకుండా, ఆయన ఒక రేసింగ్ యాక్షన్ డ్రామా ‘బాల్టి’ (Balti) చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ  లోకి కూడా అడుగుపెడుతున్నారు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!