Suspense thriller …….
‘ఫారెస్ట్ గార్డ్’ (Forest Guard) అడవి నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికరమైన సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమా మలయాళంలో ‘మీషా’ (Meesha) పేరుతో 2025 లో విడుదలైంది. తెలుగులో పేరు మార్చారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం
మిథున్ (కథిర్ ) అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు.మిథున్ తన స్నేహితులు ఆనంద్, ఇమ్మాన్యుయేల్ లను అడవికి ఆహ్వానిస్తాడు. స్థానిక రాజకీయ నాయకుడు, ఒక స్నేహితుడు కలిసి మిథున్‌ను వేట కేసులో ఇరికించాలని ప్లాన్ చేస్తారు. అదేసమయంలో కృష్ణ( షైన్ టామ్ చాకో) బృందం జంతువుల వేట కోసం అదే అడవిలోకి ప్రవేశిస్తుంది. అడవిలో ఊహించని ప్రమాదాలు, మిత్రుల ద్వారా జరిగే కుట్రల నుండి ఎవరెవరు ? ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు అనేది మిగిలిన కథ.
ఫారెస్ట్ గార్డ్‌గా కథిర్ చాలా సహజమైన నటనను కనబరిచారు.అడవిలో డ్యూటీ చేసే సాధారణ యువకుడిగా, ఆ తర్వాత స్నేహితుల నమ్మకద్రోహం వల్ల ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు భయపడుతూనే ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడే పాత్రలో ఆయన పలికించిన హావభావాలు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి.
ఈ సినిమాకు అతిపెద్ద హైలైట్ షైన్ టామ్ చాకో అనే చెప్పాలి. ఆయన తన విలక్షణమైన విలనిజం, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌తో స్క్రీన్‌పై మెప్పించారు. తుపాకీ గుండు తగిలి గాయపడిన సన్నివేశం లో బాగా చేశారు.
హీరో స్నేహితుడిగా నటించిన హకీమ్ షాజహాన్ (ఆనంద్ పాత్ర) నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఇమ్మాన్యుయేల్ గా సుధి కొప్పా తమ పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు.. పొలిటికల్ లీడర్ రఘు గా చేసిన నటుడు కూడా బాగా నటించాడు.
సినిమా రన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా మొదటి అరగంట లో కథ ముందుకు కదలదు. షైన్ టామ్ చాకో టీమ్ వేట మొదలైనప్పటి నుంచి కథ మలుపులు తిరుగుతూ సాగుతుంది. రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాల్లా ఇందులో వేగవంతమైన చేజింగ్ సీన్లు, భారీ ఫైట్లు లేదా ఉత్కంఠ రేపే మైండ్ గేమ్స్ ఉండవు. ఇది కేవలం లొకేషన్ చుట్టూ తిరిగే ఒక సాధారణ సర్వైవల్ డ్రామా.
సినిమా ప్రారంభంలో దట్టమైన అడవిని పరిచయం చేసే విజువల్స్ చాలా సహజంగా ఉండి ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తాయి.కథలోకి జంతువులను వేటాడే స్మగ్లర్ల బృందం ప్రవేశించినప్పుడు వచ్చే సన్నివేశాలు సినిమాకు అసలైన సస్పెన్స్ మూడ్‌ను తెచ్చిపెడతాయి.
సినిమా ముగింపులో హీరో.. ఒంటరిగా ఆ దట్టమైన అడవిలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలను బాగా చిత్రీకరించారు.ఇది కమర్షియల్ సినిమా కాదు.హీరోయిన్లు ,పాటలు ,డాన్సులు లేవు. సినిమా నెమ్మదిగా సాగినా ఏం జరగబోతుందా అన్న ఉత్కంఠ చివరి వరకు కొనసాగుతుంది.
ఆనంద్,మిథున్ మనసు విప్పి మాట్లాడుకునే సీన్స్ బాగుంటాయి. లోకల్ పాలిటిక్స్, ఫ్రెండ్షిప్ వాల్యూస్ చుట్టూ అల్లుకున్న కథను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడిపారు డైరెక్టర్ జోసెఫ్.పోలీసులు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలవొగ్గి కేసులను ఎలా తారుమారు చేస్తారో కూడా చూపారు.
ఈ చిత్రానికి సురేష్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అడవి నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఆయన విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కేరళలోని దట్టమైన లోకేషన్లను కెమెరాలో చాలా సహజంగా, అందంగా, అద్భుతంగా క్యాప్చర్ చేశారు.రాత్రి వేళల్లో, చీకటి అడవిలో వచ్చే సీన్లను చాలా సహజమైన వాతావరణాన్ని ప్రతిబింబించేలా చిత్రీకరించారు.
ఈ సినిమాకు సూరజ్ ఎస్. కురుప్ సంగీతాన్ని అందించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌కు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. అనవసరమైన లౌడ్ మ్యూజిక్ కాకుండా, కథకు ఎక్కడ ఎంత అవసరమో అంతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కొన్ని సీన్లలో కేవలం నిశ్శబ్దాన్ని వాడుకుంటూ టెన్షన్ బిల్డ్ చేసిన విధానం బాగుంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ సినిమాలో ఆహా లో చూడవచ్చు.

