కాంగ్రెస్ పార్టీ లో వ్యవస్థాగతంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్, లోక సభలో పార్టీ నేతగా రాహుల్ గాంధీని సోనియా నియమించ నున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి వదిలిన తర్వాత పార్టీ నాయకత్వం మరొకరిని ఆ పదవిలోకి తీసుకోలేదు. పార్టీ సీనియర్లు ఎప్పటినుంచో సలహాలు ఇస్తున్నారు. ఎట్టకేలకు సోనియా గాంధీ వ్యవస్థాగత మార్పులు తేబోతున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ పట్ల ఆమె మొగ్గు చూపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్ సమర్థుడని సోనియా భావిస్తున్నారు. ఇందిరా కాలం నుంచి ఆయన గాంధీ కుటుంబానికి విధేయుడు. పార్టీలో అందరితో ఆయనకు పరిచయాలున్నాయి. ఇతర పార్టీలను సమన్వయం చేసుకుని పోగల సామర్థ్యం ఉంది. సీనియర్లు కూడా కమల్ అంటే వ్యతిరేకించరు. అందరిని కలుపుకుపోతారు. 2002 లో ఆయనను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సోనియానే నియమించారు.
అప్పట్లో సోనియా గాంధీ కి రాజకీయాల పట్ల పూర్తి స్థాయి అవగాహన లేదు. ఆ సమయంలో ఆమెకు సలహాలు ఇచ్చిన నేతల్లో కమల్ ఒకరు. నాటి టీమ్ సహాయంతోనే తదుపరి లోకసభ ఎన్నికలలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బిజెపిని పార్టీ ఓడించగలిగింది. ఇక డిసెంబర్ 2017 నుండి 2019 జూలై వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్‌కు కమల్ నాథ్ అంటే ఇష్టమే అని అంటారు.
మధ్యప్రదేశ్ లోని చింద్వారా లోక్ సభ స్థానం నుంచి ఆయన 9 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. నాథ్ తన జీవితంలో ఎక్కువ భాగం దేశ రాజధానిలోనే గడిపారు. 2018 లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా నియమితులయ్యారు.అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నడిపించడానికి సొంత రాష్ట్రానికి వెళ్లారు.. 22 మంది ఎమ్మెల్యేలతో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు తర్వాత ప్రభుత్వాన్ని కాపాడడంలో కమలనాథ్ విఫలమైనారు. ఈ క్రమంలో 2020 మార్చి 20 న సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న నేతగా కమల్ నాథ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని సులభంగా నడిపించగలరని సోనియా రాహుల్ గాంధీలు నమ్ముతున్నారు. 99 శాతం ఆయన నియామకం ఖరారు అయినట్టే.
ఇక ప్రస్తుతం లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత గా అధీర్ రంజన్ ఉన్నారు. ఆ స్థానంలో రాహుల్ ని నియమించాలని సోనియా ఆలోచన. ఇందుకు రాహుల్ కూడా ప్రాధమికంగా అంగీకరించారని అంటున్నారు. ఒకవేళ మళ్ళీ మనసు మార్చుకుని కాదు కూడదంటే ఈ పదవి కోసం శశిథరూర్, మనీష్ తివారి, ఉత్తమకుమార్ రెడ్డి తదితరుల పేర్లను సోనియా పరిశీలిస్తున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.
———-KNM