Mohammed Rafee…..
బి. నర్సింగ్ రావు తెలంగాణకు చెందిన అత్యంత విశిష్టమైన, బహుముఖ ప్రజ్ఞాశాలి సాంస్కృతిక వ్యక్తిత్వాలలో ఒకరు. సినీ దర్శకుడు, రచయిత, చిత్రకారుడు, ఛాయాగ్రాహకుడు, రంగస్థల కళాకారుడు, సంగీతకారుడు, సాంస్కృతిక దస్తావేజీకర్తగా ఆయన సాగించిన సుదీర్ఘ సృజనాత్మక ప్రయాణం తెలంగాణ కళా, సాంస్కృతిక వారసత్వాన్ని విశేషంగా సుసంపన్నం చేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతోంది.
ఆయన రంగుల కల (1983) ది కార్నివాల్ (డాక్యుమెంటరీ, 1984) ది సిటీ (డాక్యుమెంటరీ, 1985) మా ఊరు (డాక్యుమెంటరీ, 1987) దాసి (1988) మట్టి మనుషులు (1990) హరివిల్లు (2003) చిత్రాలను డైరెక్ట్ చేశారు. మా భూమి ,దాసి, హరివిల్లు చిత్రాలకు స్క్రీన్ ప్లే సమకూర్చారు. మా భూమి, హరివిల్లు చిత్రాలకు సంగీతం అందించారు. మా భూమి ,దాసి చిత్రాలను స్వయంగా నిర్మించారు. మా భూమి,రంగుల కల చిత్రాల్లో నటించారు.
అద్భుతమైన మైలురాయి చిత్రాల ద్వారా తెలంగాణ భూదృశ్యాలు, మాండలికాలు, జానపద సంప్రదాయాలు, సామాజిక వాస్తవాలు, సామాన్య ప్రజల జీవన చిత్రణను జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక వేదికలకు పరిచయం చేశారు.
వివిధ కళారూపాలను సమన్వయపరిచిన ఆయన సృజనాత్మక కృషి తెలంగాణ అమూల్యమైన సాంస్కృతిక జ్ఞాపకాలను భద్రపరచడమే కాకుండా, భారతీయ కళలు, సినిమా విస్తృత ప్రస్థానంలో తెలంగాణకు విశిష్టమైన కళాత్మక గుర్తింపును సుస్థిరం చేసింది.అందుకే ఆయన *“తెలంగాణ పునరుజ్జీవన ప్రతిభామూర్తి” (Telangana’s Renaissance Man)*గా సముచిత గౌరవాన్ని పొందారు.
‘దాసి’ సినిమా కోసం మరికొందరితో కలసి దర్శకుడు నర్సింగ్ రావు చాలా రీసెర్చ్ వర్క్ చేశారు.తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనలో వాళ్లకి సహాయకులుగా జాగిర్దార్లు ఉండేవాళ్లు. వారి కింద ఊరికో దొర పెత్తనం. ఆ దొరల దయాదాక్షిణ్యాల మీదే ప్రజల బతుకులు సాగేవి. దొరగారికి పెళ్లయితే, వధువు వెంట తోడులాగ ఓ దాసీ వస్తుంది. ఇంటిపని, వంట పని, చివరకు ఒంటి పని కూడా చేయాల్సిందే.. అడిగినవారికి అడిగిందల్లా ఇవ్వడమే దాసీ పని.
24 X 7 పనే .ఈ దాసీ వ్యవస్థ ఎలా ఉందొ తెలుసుకుని స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. అంత వరకు బాగానే సాగింది .. అయితే దాసీ పాత్రకు ఎవర్ని సెలెక్ట్ చేసుకోవాలో అర్ధంకాక మల్లగుల్లాలు పడ్డారు. చాలామంది నటీమణులను పేర్లు అనుకున్నారు. సరిగ్గా అదేసమయంలో బాలూ మహేంద్ర డెరైక్ట్ చేసిన తమిళ సినిమా ‘వీడు’లో నటించిన ‘అర్చన’కు ఉత్తమ నటి అవార్డు ప్రకటించారు.
ఆమె ఫొటో చూడగానే ‘దాసి’ పాత్రకు తాను నూరు శాతం ఫిట్ అవుతుందని నర్సింగ్ రావు భావించారు. వెంటనే కూపీ లాగారు. సంప్రదించారు. అర్చనకు ఇలాంటి పాత్రలంటే మక్కువ ఎక్కువ. ఆమె ఒకే అంది. షూటింగ్ కి సిద్ధమయ్యారు. నల్గొండ జిల్లాలో చింతపల్లి అనే ఊళ్లో ఓ గడీ ఉంది. గడీ అంటే దొర నివాస భవనం అన్నమాట.
సినిమా అంతా అక్కడే షూటింగ్ చేశారు .అప్పట్లో పదకొండున్నర లక్షలుఅయింది . ‘దాసి’ ని పక్కాగా ముస్తాబు చేసి విడుదల చేశారు. జాతీయ అవార్డులు గెలుచుకుంది.మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ కి చెందిన నరసింగరావు తీసిన సినిమాలు తక్కువే ప్రత్యేక గుర్తింపు పొందాయి.

