psychological drama ……..
తూర్పు పడమర’ (1976) వినూత్న కథాంశంతో వచ్చిన చిత్రం. దర్శకుడు కె. బాలచందర్ తమిళంలో తీసిన ‘అపూర్వ రాగంగళ్’ (1975) చిత్రానికి ఇది అధికారిక రీమేక్. తెలుగులో దీనిని దర్శకరత్న దాసరి నారాయణరావు అద్భుతమైన ఎమోషనల్ డ్రామాగా మలిచారు.ఈ సినిమా కథ బేతాళ కథల్లోని ఒక జవాబు లేని ప్రశ్నలాంటిది..
జగన్నాథం (కైకాల సత్యనారాయణ) ఒక ధనవంతుడు, అతని కొడుకు సూర్యం (నరసింహరాజు) ఒక తిరుగుబాటుదారుడు (రెబెల్). తండ్రితో గొడవపడి ఇల్లు వదిలి వచ్చేస్తాడు. గాయని రంజని (శ్రీవిద్య)కు కళ్యాణి (మాధవి) అనే కూతురు ఉంటుంది. వారి మధ్య కూడా సంబంధాలు ఉండవు.
అనుకోని పరిస్థితుల్లో గాయపడిన సూర్యంను రంజని కాపాడి ఆశ్రయం ఇస్తుంది. వయసులో తనకంటే చాలా పెద్దదైన రంజనిని చూసి సూర్యం ఆమెతో ప్రేమలో పడతాడు. మరోవైపు, రంజని కూతురైన కళ్యాణి.. సూర్యం తండ్రి అయిన జగన్నాథం (వయసులో చాలా పెద్దవాడు) ఆదరణను చూసి అతనితో ప్రేమలో పడుతుంది.
ఒకరి తండ్రి మరొకరికి ప్రియుడు, ఒకరి తల్లి మరొకరికి ప్రియురాలు అయ్యే ఈ విచిత్ర బంధాల చిక్కుముడిని సమాజం ఎలా చూసింది? ఆ పాత్రలు ఎలాంటి మానసిక వేదనను అనుభవించాయి? చివరికి వారి నిర్ణయం ఏమైంది? అనేదే ఈ సినిమా కథ.
తమిళంలో రంజని పాత్ర చేసిన శ్రీవిద్య తెలుగులోనూ అదే పాత్రలో నటించారు. ఆమె పలికించిన హావభావాలు, గంభీరత సినిమాకు ప్రాణం. నరసింహరాజు, మాధవి, కైకాల సత్యనారాయణ తమ కెరీర్ లోనే అత్యుత్తమమైన, బ్యాలెన్స్‌డ్ నటనను కనబరిచారు.
ఇలాంటి ఒక సున్నితమైన, ఇబ్బందికరమైన పాయింట్‌ను ఎక్కడా అశ్లీలత లేకుండా, కేవలం పాత్రల మానసిక ఘర్షణగా చూపించడంలో దాసరి వంద శాతం విజయం సాధించారు.సినిమాలో మాధవి వేసే భేతాళ ప్రశ్న ఆసక్తికరంగా ఉంటుంది. ‘మా నాన్న గారు ఎవరికి మామగారో వారి కోడలి నాన్నగారు నా కొడుక్కి మామ గారు” మాధవి చాలా హుషారుగా నటించింది.
ఇదే ఆమె మొదటి సినిమా కూడా. తమిళంలో ఆ పాత్రను జయసుధ చేశారు. సూర్యం పాత్రను కమల్ హాసన్ చేశారు.నగేష్ పాత్ర ద్వారా కొంత కామెడీ అందించారు. సినిమాలో రచయిత సినారె,నటుడు మురళీ మోహన్ కూడా కనిపిస్తారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.మోహన్ బాబు పాత్ర చిన్నదే అయినా బాగానే చేశారు.
రమేష్ నాయుడు సంగీతం ఈ సినిమాకు అతిపెద్ద అసెట్. శివరంజని నవరాగిణి’, ‘తూర్పు పడమర ఎదురెదురూ’, ‘స్వరములు ఏడైనా’ వంటి పాటలు సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. అన్నిపాటలను సినారె అద్భుతంగా రాశారు. ఇపుడు కూడా అక్కడక్కడా అవి వినిపిస్తుంటాయి.
ఎవరు ఎవరో తెలియనప్పుడు కలిగిన ప్రేమ, బంధుత్వాలు తెలిసాక ఎలా త్యాగంగా మారిందో చూపించిన విధానం, సినిమా ముగింపు ప్రేక్షకుడి మనసును బరువెక్కిస్తుంది.ఇది ఒక క్లాస్, సైకలాజికల్ డ్రామా. కాబట్టి కమర్షియల్ హంగులు,యాక్షన్ ఆశించే సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా కాస్త హెవీగా అనిపిస్తుంది.
తండ్రీకొడుకులు అటు తల్లికూతుళ్లను ప్రేమించడం అనే కాన్సెప్ట్ అప్పట్లోనే కాదు, ఇప్పటికీ కొంతమంది సాంప్రదాయ ప్రేక్షకులకు అపసవ్యంగా, అంగీకరించలేనిదిగా అనిపించవచ్చు.
తూర్పు పడమర’ అనేది కేవలం కాలక్షేపం కోసం చూసే సినిమా కాదు.. బంధాల డెఫినేషన్స్‌ని, మానవ మనస్తత్వాలను ప్రశ్నించే ఒక గొప్ప ప్రయోగం. “కొన్ని బంధాలు ఎప్పటికీ కలవవు అంతే.. వాటిని కలపాలనే మొండితనం కష్టాలకే దారి తీస్తుంది” అని చెప్పిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అపురూప చిత్రం. కుటుంబం తో కలసి చూడవచ్చు. సినిమా యూట్యూబ్ లో ఉంది ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

