Action thriller……..
‘బఘీర’… ఇది 2024 నాటి సినిమా. కన్నడ స్టార్ హీరో శ్రీమురళి కథానాయకుడిగా,’కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కథ తో రూపొందిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై డాక్టర్ సూరి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ప్రస్తుతం Netflix లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటంటే..
వేదాంత్ (శ్రీమురళి) చిన్నప్పటి నుంచే సమాజంలోని అన్యాయాలను ఎదిరించాలనే లక్ష్యంతో పెరిగి, ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. మంగళూరు నగరానికి పోస్టింగ్ వచ్చిన వేదాంత్‌కు, అక్కడి వ్యవస్థ మొత్తం అవినీతి మయమైందని, స్థానిక గ్యాంగ్‌స్టర్ పూజారి, రానా (గరుడ రామ్) చేతుల్లో రౌడీ రాజ్యం నడుస్తోందని అర్థమవుతుంది.
ఒక వైపు చట్టానికి కట్టుబడి ఏమీ చేయలేని పోలీస్ యూనిఫామ్ పరిమితులు.. మరోవైపు కళ్ల ముందే జరుగుతున్న అన్యాయాలు. ఈ క్రమంలో వేదాంత్ రాత్రి వేళల్లో ముసుగు ధరించి ‘బఘీర’ అనే ఒక స్వదేశీ సూపర్ హీరో (Vigilante) రూపంలో నేరగాళ్లను వేటాడటం ప్రారంభిస్తాడు. సిటీలో అరాచకాలు చేస్తున్న రౌడీలను బఘీర ఎలా మట్టుబెట్టాడు? ఈ ముసుగు వీరుణ్ణి పట్టుకోవడానికి సీబీఐ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) ఎలాంటి వ్యూహాలు పన్నాడు? అనేదే మిగతా కథ.
శ్రీమురళి తన బాడీ లాంగ్వేజ్, అద్భుతమైన ఫిజిక్‌తో పోలీస్ ఆఫీసర్‌గా, ముసుగు వేసుకున్న సూపర్ హీరోగా చాలా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.ప్రశాంత్ నీల్ కథ అందించినప్పటికీ, స్క్రీన్‌ప్లే చాలా వరకు రొటీన్ కమర్షియల్ విజిలెంట్/సూపర్ హీరో టెంప్లేట్‌లోనే సాగుతుంది. తదుపరి ఏం జరుగుతుందో ప్రేక్షకులు సులభంగా ఊహించవచ్చు.
కన్నడ క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ నటన బాగున్నప్పటికీ, ఆమె పాత్ర పరిధి తక్కువ. హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ స్టోరీ, ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ఆకట్టుకుంటాయి.మొదటి భాగం ఆసక్తికరంగా,వేగంగా సాగినప్పటికీ.. సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి కథనం కొద్దిగా మందగించి, సాగదీసినట్లు అనిపిస్తుంది.
చట్టం చేతులు దాటి అరాచకాలు చేస్తున్న రౌడీలను వేటాడటానికి వేదాంత్ మొదటిసారి ముసుగు ధరించి, నల్లటి సూట్‌తో ‘బఘీర’గా ఎంట్రీ ఇచ్చే యాక్షన్ బ్లాక్ సినిమాకే అతిపెద్ద హైలైట్. హాలీవుడ్ ‘ రేంజ్‌లో ఈ సీన్‌ను చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారు.
రేప్ కి గురైన బాధితురాలు పోలీస్ స్టేషన్ ముందేపెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. దర్శకుడు ఈ సీన్‌ను చాలా ఇంటెన్సివ్‌గా సమాజంలోని అవినీతి వ్యవస్థపై కోపం వచ్చేలా తెరకెక్కించారు.ఈ ఘటన తర్వాత ‘బఘీర’ వేట మొదలవుతుంది..టార్గెట్ చేసిన వారందరికి లేపేస్తుంటాడు.
ఇక్కడ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. బఘీర ఎవరో కనిపెట్టడానికి వచ్చే సిబిఐ ఆఫీసర్ ప్రకాష్ రాజ్, పోలీస్ ఆఫీసర్ శ్రీమురళి ల మధ్య సాగే సంభాషణలు సెకండ్ హాఫ్‌లో ఆసక్తిని కలిగిస్తాయి. క్లైమాక్స్‌లో విలన్ల సామ్రాజ్యంలోకి బఘీర ఒంటరిగా వెళ్లి చేసే యాక్షన్ సీక్వెన్స్ హై-ఎండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. సినిమాలో హింస ఎక్కువే అని చెప్పుకోవాలి.పాత్రధారులంతా బాగా నటించారు.
చేతన్ డి సౌజా నేతృత్వంలో డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్, స్టంట్స్ అద్భుతంగా ఉన్నాయి.‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. మొదటి భాగంలో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్, మాస్ ఎలిమెంట్స్ ప్రశాంత్ నీల్ శైలిని ప్రతిబింబిస్తూ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటాయి.
ఈ సినిమాకు కెమెరా బాధ్యతలను ఏజే శెట్టి నిర్వహించారు. సినిమా కథ ఎక్కువ భాగం రాత్రి వేళల్లోనే సాగుతుంది. చీకటి నేపథ్యం (Dark Theme), వర్షం, నగరంలోని నియాన్ లైట్లను ఉపయోగించి ఆయన సృష్టించిన విజువల్స్ బాగున్నాయి.బఘీర మొదటి వేట, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో కెమెరా కదలికలు చాలా వేగంగా, అద్భుతంగా ఉంటాయి.
‘బఘీర’ సినిమా కథ రొటీన్‌గా ఉన్నప్పటికీ, ఏజే శెట్టి అద్భుతమైన కెమెరా వర్క్ , విజువల్స్, అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బలాన్ని ఇచ్చాయి. బాక్సాఫీస్ పరంగా ‘బఘీర’ సినిమా యావరేజ్ విజయంగా నిలిచింది.

