ఎర్ర సీసా !

Sharing is Caring...

Su Sri Ram ………………………………..

Martyrs………………………………………….నా పేరు అమృత. ఆ రోజు నాకింకా గుర్తుంది. 1919 ఏప్రిల్ 13 వ తేదీ మర్నాడు. రోజు లాగే అన్న స్కూల్ కి ఉదయాన్నే వెళ్ళాడు. కానీ అతను స్కూల్ కి వెళ్ల లేదని మర్నాడు తెల్సింది. అతడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో అందరూ దిగాలు పడి ఉన్నారు. అన్న ముఖం వేలాడేసుని వచ్చాడు.

బోలెడు దుఖం తో అతను నిలువునా మునిగి ఉన్నాడు. అన్న కి చిన్నచెల్లెలు ని నేను. నేనంటే అన్న ఎంతో ప్రేమగా ఉండేవాడు.“అన్నా ఎందుకింత ఆలస్యం అయింది.? ఎక్కడి కెళ్ళావు ? ” అని నేను ఆందోళనగా అడిగాను. “ఏమి తెచ్చానో చూడు” చేతి లో జేబులోంచి తీసిన ఎర్ర సీసాని చూపించాడు.
అందులో మట్టి ఉంది. మట్టి రంగు ఎరుపుగా ఉంది. తడిగా ఉంది.

“ఏమిటిది?” నేను భయంగా అడిగాను.
“ఇందులో ఉన్నది 360 మంది భారతీయుల రక్తం తో తడిచిన మట్టి.  రౌలత్  చట్టానికి శాంతియుత నిరసన తెలపటం కోసం సమావేశమయిన వేలాది ప్రజల పై  నిన్న జనరల్ డయ్యర్ మర ఫిరంగులతో కాల్పులు జరిపాడు. ఎందరో చనిపోయారు. ఆ వీరుల రక్తం తో తడిచిన జలియన్ వాలా బాగ్ మట్టి ఈ సీసా లో ఉంది.” అన్నదుఖం తో ఒక్కోమాట చెప్పాడు.

అక్కడ ఏమి చూశాడో, ఏమి విన్నాడో తడబడుతూ చెప్పాడు.ఆరోజు అన్న ఆహారం ముట్టలేదు. తోటలో నుండి చాలా పూలు తెచ్చి ఆ సీసాని అలంకరించాడు. దానికి మోకరిల్లాడు. తనలో తానే ఏవేవే మాట్లాడుకున్నాడు. బహుశా మనసులోనే ఏవో స్థిరంగా నిశ్చయించుకుని ఉంటాడు.బలైపోయిన వారి రక్తం తో ఆయనకి సన్నిహిత సంబంధం ఏర్పడింది. అందుకే తను గూడా విప్లవ కారులకు నాయకుడై ఆత్మ బలిదానం చేశాడు.

మీ కింతకి మా అన్న పేరు చెప్పలేదు కదూ… ఆయన్ని మీరు ఎరుగుదురు . ఆయన పేరు భగత్ సింగ్.
—————–
1928 అక్టోబర్ 28న సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజ్‌పత్ రాయ్‌ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు. ఆ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

ఆ దారుణాన్ని కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్,సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. జై గోపాల్ సంకేతాలు ఇవ్వడంలో చేసిన పొరపాటు కారణంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు.

అప్పటికి  పోలీసుల కంటపడకుండా తప్పించుకున్నప్పటికీ తర్వాత దొరికిపోయాడు. 23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు , సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!