ఇదొక హారర్, మిస్టరీ థ్రిల్లర్ !!

Sharing is Caring...

 A diverse thriller….

‘ఆది శంబాల’ (Shambhala: A Mystical World) ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఒక వైవిధ్యభరితమైన సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ aha లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ  ఏమిటంటే ? 
1980ల కాలంలో ‘శంబాల’ అనే గ్రామంలో ఆకాశం నుండి ఒక ఉల్క పడుతుంది. ఆ తర్వాత ఆ ఊరిలో వరుసగా వింత హత్యలు, విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. గ్రామస్తులు దీనిని ‘బండ భూతం’ శాపంగా భావిస్తూ మూఢనమ్మకాలతో భయపడుతుంటారు.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన సైంటిస్ట్/కేంద్ర ప్రభుత్వ అధికారి విక్రమ్ (ఆది సాయికుమార్) ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఎలా ఛేదించాడు? దేవి (అర్చన అయ్యర్) అతనికి ఎలా సహాయం చేసింది? అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.

చాలారోజుల తర్వాత ఆదికి ఇది ఒక మంచి వైవిధ్యభరితమైన పాత్ర. సైన్స్‌ను మాత్రమే నమ్మే జియాలజిస్ట్ (కేంద్ర ప్రభుత్వ అధికారి) విక్రమ్ పాత్రలో ఆయన చాలా సిన్సియర్ అండ్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనవసరమైన హీరో ఎలివేషన్స్ లేకుండా, కథను నడిపించే ఒక పరిశోధకుడిగా డిగ్నిఫైడ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. తన కెరీర్‌లో ఇదొక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు.

ఈ సినిమాలో ఆదికి జోడీగా కమర్షియల్ హీరోయిన్ పాత్ర అంటూ ఏమీ లేదు. దేవిగా నటించిన అర్చన అయ్యర్ పాత్రకు కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. మిస్టికల్ ఎలిమెంట్స్‌తో ముడిపడి ఉన్న తన క్యారెక్టర్‌ను ఆమె చాలా సాఫ్ట్‌గా, డీసెంట్‌గా పండించారు.

విలేజ్ రైతు రాములు పాత్రలో రవివర్మ జీవించేశారు.కథ మలుపు తిరగడానికి కారణమయ్యే వింత పూనకం సీన్స్, భయాందోళనలకు గురిచేసే సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతంగా ఉండి, ప్రేక్షకులలో సస్పెన్స్ పెంచుతుంది. లక్ష్మణ్ మీసాల (కుంటి కృష్ణ) కథలో కీలకమైన పాత్ర ఇది. ఆపాత్రలో లక్ష్మణ్ అదరగొట్టేసాడు. వసంత పాత్రధారి కూడా బాగా చేసింది. ఇతర నటులంతా వారి పరిధి మేరకు చక్కగా నటించారు.ఆటిజం తో బాధపడే పాప గా బాలనటి బేబీ చైత్ర బాగా చేసింది. 

కథలో ఉల్క పడిన తర్వాత రైతు రాములు (రవివర్మ) ఆవు నుండి పాలుకు బదులుగా రక్తం రావడం, ఆ తర్వాత అతని ప్రవర్తనలో వచ్చే వింత మార్పులకు సంబంధించిన సీన్స్ ప్రేక్షకులలో తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తాయి.సినిమా ప్రారంభ దృశ్యాలు భయపెట్టేలా మొదలవుతాయి.  

డైలాగ్ కింగ్ సాయికుమార్ తన గంభీరమైన గొంతుతో చెప్పే శంబాల విలేజ్ బ్యాక్‌స్టోరీ, తాళపత్ర గ్రంథాల తాలూకు మిస్టరీ ఎలిమెంట్స్ వణుకు పుట్టించేలా పీక్స్‌లో ఉంటాయి. ఇంటర్వెల్ ముందు సీన్స్ సినిమాలో హైలైట్. వసంతను పొలాల్లోకి కిష్ణ లాక్కు వెళ్లే సీన్స్ అద్భుతంగా వచ్చాయి. రాత్రి వేళ చేజింగ్ సీన్స్ ఉత్కంఠను పెంచుతాయి.

ఈ చిత్ర ముగింపులో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. సైన్స్ అండ్ డివోషన్ ఎలిమెంట్స్ మిక్స్ అయి హై-వోల్టేజ్ యాక్షన్‌తో అలరిస్తుంది. ఊరి జనం వింతగా ప్రవర్తించే కొన్ని సీక్వెన్సెస్, ఆ విలేజ్ అట్మాస్ఫియర్,  ప్రతి హారర్ సీన్ ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా తీశారు. అయితే  మొదటి భాగంలో ఉన్న ఉత్కంఠ రెండో భాగంలో ఉండదు. కథ సాగదీసినట్టు అనిపిస్తుంది.  

గ్రామస్తుల వింత ప్రవర్తనకు చెప్పిన కారణాలు అంత కన్విన్సింగ్ గా అనిపించవు. ఆకాశం నుండి పడిన ఉల్క (Meteorite) వల్ల వచ్చే రేడియేషన్/వింత శక్తులు, ఆ ఊరి పురాతన చరిత్రకు (బండ భూతం శాపం) మధ్య లింక్ పెడుతూ దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది. 

అంత పెద్ద మిస్టరీకి, గ్రామస్తుల భయానక ప్రవర్తనకు ముగింపు ఇచ్చే సన్నివేశాలు త్వరగా ముగించేసినట్లు గా అనిపిస్తుంది. హీరో చేసే కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ సీన్స్ 1980ల నాటి కాలానికి సింక్ అయినా, డ్రామా కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది.ఈ లోపాలను పట్టించుకోకుండా చూస్తే సినిమా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది.  

ఈ చిత్రానికి ప్రవీణ్ కె. బంగార్రి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.కథ 1980ల కాలంలో సాగుతుంది. ఆ పీరియడ్ లుక్‌ను, ‘శంబాల’ అనే ఒక మారుమూల గ్రామాన్ని తన కెమెరా ఫ్రేమ్స్‌తో ప్రవీణ్ చాలా సహజంగా చూపించారు. హారర్, సస్పెన్స్ మూడ్‌ను ఎలివేట్ చేయడానికి ఉపయోగించిన డార్క్ అండ్ టోన్డ్ కలర్ ప్యాలెట్ బాగుంది.

ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే సీన్స్, అడవి నేపథ్యంలో సాగే సీన్స్, ఆకాశం నుండి ఉల్క పడే విజువల్స్ ప్రేక్షకుడికి మంచి థ్రిల్లింగ్ ఫీల్‌ను ఇస్తాయి.శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అతిపెద్ద హైలైట్. ఓటీటీలో చూసేటప్పుడు ప్రేక్షకులలో భయాన్ని ఉత్కంఠను పీక్స్‌కు తీసుకెళ్లారు.

ఒక కొత్త దర్శకుడిగా యుగంధర్ ముని ఎంచుకున్న పాయింట్, చెప్పిన కారణాలు లైన్ పరంగా చాలా బాగున్నాయి. స్క్రీన్‌ప్లేలో అక్కడక్కడా కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే జనాలకు ఈ మిస్టరీ మూవీ నచ్చుతుంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!