సిద్ధు మార్క్ కామెడీ,యాక్షన్ మూవీ !!

Sharing is Caring...

Action-comedy entertainer …………

‘జాక్’ (Jack)….. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన టాలీవుడ్ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్.  ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2025 నాటిది. ప్రస్తుతం ఈ సినిమా Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే ?

పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా (RAW) ఏజెంట్ అవ్వాలని కలలు కనే ఒక మామూలు యువకుడు. అతని ప్రవర్తన అర్థం కాక, అతని తండ్రి ప్రసాద్ (నరేష్) కొడుకుపై నిఘా పెట్టడానికి అఫ్షానా (వైష్ణవి చైతన్య) అనే ప్రైవేట్ డిటెక్టివ్‌ను హైర్ చేస్తాడు.

హైదరాబాద్‌లో జరగబోయే టెర్రరిస్ట్ బాంబు పేలుళ్లను అడ్డుకునే ప్రయత్నంలో జాక్ అనుకోకుండా సీనియర్ రా ఏజెంట్ మనోజ్ (ప్రకాష్ రాజ్)నే కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత అసలు టెర్రరిస్టులను పట్టుకోవడానికి జాక్ నేపాల్ వెళ్లాడు? అక్కడ ఏం జరిగిందనేదే మిగతా కథ. 

ఎప్పటిలాగే సిద్ధు జొన్నలగడ్డ తన మార్క్ కామెడీ టైమింగ్, వన్-లైనర్స్,  ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కొన్ని కామెడీ సీన్స్, ఆయన స్టైలిష్ లుక్ ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమా ప్రారంభంలో సిద్ధు జొన్నలగడ్డ తను పెద్ద రా ఏజెంట్ అయిపోవాలని కలలు కంటూ, ఇంట్లోవాళ్లతో, స్నేహితులతో చేసే అతి, చెప్పే డైలాగులు చాలా హిలేరియస్‌గా ఉంటాయి.

సిద్ధు తన పాత సినిమాల (‘డీజే టిల్లు’) మేనరిజమ్స్‌ను గుర్తుచేస్తూ చేసే కామెడీ టైమింగ్ ఇక్కడ బాగా వర్కవుట్ అయింది.సిద్ధు , అతని తండ్రి పాత్ర చేసిన నరేష్ మధ్య వచ్చే సీన్స్ సినిమా ప్రథమార్ధంలో పెద్ద హైలైట్. కొడుకు ప్రవర్తన నచ్చక, వాడు ఏం చేస్తున్నాడో కనిపెట్టడానికి నరేష్ పడే తాపత్రయం, వారిద్దరి మధ్య వచ్చే క్రేజీ డైలాగ్ డెలివరీ నవ్వులు పూయిస్తుంది.

హీరోయిన్ వైష్ణవి చైతన్య తనని తాను ఒక పెద్ద ప్రైవేట్ డిటెక్టివ్‌గా ఊహించుకుంటూ, సిద్ధుపై నిఘా పెట్టే క్రమంలో చేసే తప్పులు, పడే పాట్లు చాలా ఫన్నీగా ఉంటాయి. సాంప్రదాయ డిటెక్టివ్ లుక్‌లో ఆమె చేసే కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి.
సినిమా కథ మలుపు తిరిగే క్రమంలో, విలన్లను కాకుండా పొరపాటున సీనియర్ రా ఏజెంట్ మనోజ్ (ప్రకాష్ రాజ్)ను సిద్ధు కిడ్నాప్ చేసే సీన్. 

ఆ తర్వాత వచ్చే కన్‌ఫ్యూజన్ డ్రామా సెకండ్ హాఫ్‌లో నవ్వులు తెప్పిస్తుంది. ఒక సీరియస్ అధికారిని పట్టుకుని సిద్ధు చేసే కామిక్ అరాచకం  బాగా పేలింది. ద్వితీయార్ధంలో లాజిక్ లేకపోయినా, నేపాల్ బ్యాక్‌డ్రాప్‌లో టెర్రరిస్టులను పట్టుకోవడానికి సిద్ధు వేసే ప్లాన్స్, అక్కడ చేసే కామెడీ ఛేజింగ్‌లు కేవలం టైంపాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలుస్తాయి. క్లయిమాక్స్ లో ట్రైన్ లో ఫైట్స్ సినిమాకు హైలైట్.నటీ నటులంతా బాగా నటించారు.    

కథలో స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ అంతగా వర్కవుట్ అవ్వకపోయినా, సిద్ధు జొన్నలగడ్డ వన్-మ్యాన్ షోగా నడిపించిన ఈ క్రేజీ కామెడీ సీన్స్ వల్లే సినిమా టైంపాస్ వాచ్‌గా నిలిచింది. సీరియస్ టెర్రరిజం/స్పై బ్యాక్‌డ్రాప్‌కు కామెడీని జోడించడం సినిమాకు కొంత మైనస్‌ అని చెప్పుకోవాలి. కథలో ఎక్కడా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ లేకపోవడం వల్ల కథనం సాగదీసినట్లు బోర్ కొడుతుంది.

దేశ భద్రతకు సంబంధించిన రా ఏజెన్సీని, అందులోని అధికారులను మరీ ఇన్-కాంపిటెంట్‌గా చూపించడం కన్విన్సింగ్‌గా లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజయ్ కె. చక్రవర్తి కెమెరా వర్క్ రిచ్‌గా ఉండి, విజువల్స్ ఆకట్టుకుంటాయి. శ్యామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కొన్ని యాక్షన్ సీన్లను ఎలివేట్ చేసింది.  ‘జాక్’ సినిమా ఒక రొటీన్ స్పై డ్రామా. సిద్ధు మార్క్ కామెడీ కోసం ఓసారి చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!