ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో మెగాస్టార్ మెప్పించారా ?

Sharing is Caring...

Crime Drama……

‘క్రిస్టోఫర్’ (Christopher) 2023 నాటి సినిమా ఇది.మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు  బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు.

కథేంటంటే?

క్రిస్టోఫర్ ఆంటోనీ (మమ్ముట్టి) అనే ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. సమాజంలో చట్టం తన పని తాను చేయడంలో విఫలమైనప్పుడు, ముఖ్యంగా మహిళలపై ఘోరమైన అత్యాచారాలు, అన్యాయాలు జరిగినప్పుడు.. క్రిస్టోఫర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరస్థులను ఎన్‌కౌంటర్  ద్వారా శిక్షిస్తుంటాడు.

ఈ ‘ట్రిగ్గర్-హ్యాపీ’ పోలీస్ విధానాల వల్ల ఆయనపై డిపార్ట్‌మెంట్ విచారణ మొదలవుతుంది. దానికి ఐపీఎస్ ఆఫీసర్ సులేఖ (అమలా పాల్) నేతృత్వం వహిస్తుంది. అసలు క్రిస్టోఫర్ ఇలా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మారడానికి వెనుక ఉన్న గతమేంటి? కార్పొరేట్ విలన్ సీతారామ్ త్రిమూర్తి (వినయ్ రాయ్)తో అతనికి వచ్చిన శత్రుత్వం ఏంటి? అనేదే మిగిలిన కథ.

సినిమా మొత్తాన్ని మమ్ముట్టి తన నటనతో, గంభీరమైన లుక్స్‌తో, స్వాగ్‌తో నడిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. చట్టం శిక్షించకపోతే హీరోనే శిక్షిస్తాడు అనే కథే ఇది. సినిమా చాలా చోట్ల ఊహకందేలా సాగుతుంది. కథ వేగంగా నడుస్తుంది. కొన్నిట్విస్టులు కూడా ఉన్నాయి. క్లయిమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది.

విలన్‌గా నటించిన వినయ్ రాయ్ పాత్రను మరింత బలంగా రాసుకోవాల్సింది. ఆయన పాత్ర అంతగా భయపెట్టలేకపోయింది.స్నేహ, అమలా పాల్, ఐశ్వర్య లక్ష్మి లాంటి ప్రతిభావంతులైన నటీమణులు ఉన్నప్పటికీ, వారి పాత్రలను కేవలం కథ ముందుకు సాగడానికి వాడే సాధనాలుగా  మాత్రమే చూపించారు. వారి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వలేదు.

సినిమా ప్రారంభంలో మమ్ముట్టి క్యారెక్టర్‌ను పరిచయం చేసే విధానం, ఆయన గంభీరమైన నడక,  స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను అలరిస్తుంది. ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన రూపాన్ని చాలా స్టైలిష్‌గా ఎలివేట్ చేశారు. 

క్రిస్టోఫర్ గత జీవితానికి సంబంధించిన కొన్నిఎమోషనల్ సన్నివేశాలు, ముఖ్యంగా స్నేహ (బీనా కారెక్టరు)తో సాగే సీన్లు , ఆయన లైఫ్‌లో జరిగిన ఒక పెద్ద ట్రాజెడీ సీన్ కథకు బలమైన కారణాన్ని ఇస్తాయి. ఆయన ఎందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తిగా మారాడో ఆ సీన్లు వివరిస్తాయి.

క్రిస్టోఫర్, విలన్ సీతారామ్ త్రిమూర్తి (వినయ్ రాయ్)ల మధ్య జరిగే మైండ్ గేమ్స్, ఆ పై వచ్చే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్  యాక్షన్ ప్రియులకు నచ్చుతాయి. పాత్రధారులంతా బాగా నటించారు.   

జస్టిన్ వర్గీస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ప్రతి యాక్షన్ సీన్‌ను బాగా ఎలివేట్ చేసింది. ఫైజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్‌గా ఉంది.సినిమాలో వచ్చే కొన్ని యాక్షన్ బ్లాక్‌లు, ముఖ్యంగా కొన్ని సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా డిజైన్ చేశారు.

మమ్ముట్టి నటన, పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్,మాస్ ఎలివేషన్స్ కోసం ఈ చిత్రాన్నిచూడవచ్చు.క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

ఈ సినిమా పోస్టర్లపై Biography of a vigilante cop అనే ట్యాగ్‌లైన్ వాడటం వల్ల, ఇది ఎవరిదైనా బయోపిక్ ఏమో అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ చిత్ర యూనిట్ వివరణ ప్రకారం—ఇది సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలపై తిరగబడే ఒక కల్పిత పోలీస్ ఆఫీసర్ కథ మాత్రమే.

ఈ కథ ఏ ఒక్కరి జీవిత చరిత్ర కాకపోయినప్పటికీ,దేశంలో గతంలో జరిగిన కొన్ని సంచలన అత్యాచార కేసులు, ఆ తర్వాత పోలీసులు చేసిన వివాదాస్పద ఎన్‌కౌంటర్ల ఆధారంగా ఈ స్క్రిప్ట్‌ను రాసుకున్నారు. 

సినిమా చూసిన తర్వాత వర్తమాన సమాజంలో క్రిస్టోఫర్ లాంటి పోలీస్ ఆఫీసర్స్ ప్రతి చోటా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఓటీటీ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ బాగుంది.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!