అక్కడ ఎన్నికల ప్రచారంపై నిషేధం !

Sharing is Caring...

No rallies, meetings………………………….

ఆ గ్రామంలో 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం జరగడం లేదు. అక్కడ ప్రచారం నిషేధం..అలాగని ఓటెయ్యకపోతే ఒప్పుకోరు. జరిమానా విధిస్తారు. గుజరాత్ మొత్తం ఎన్నికల ప్రచారం జరుగుతున్నా అక్కడ మాత్రం ఆ సందడే లేదు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలు లేవు.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడాల్లేమీ ఉండవు.

ఆ గ్రామం రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతం కాదు. రాజ్ కోట్ కి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాజ్ సమాధియాలా (Raj Samadhiyala) గ్రామం . ఆ గ్రామంలోకి రాజకీయ పార్టీల నేతలు వెళ్లేందుకు ఆ ఊరి పెద్దలు అనుమతించరు. పార్టీ నాయకులు తమ ఊర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) నిషేధం విధించింది.

ఇది ఈ నాటిది కాదు. గత నాలుగు దశాబ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ గ్రామంలో ప్రచారం చేస్తే తమ ప్రాంతానికి హాని జరుగుతుందని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే రాజకీయ పార్టీలను ఎన్నికల ప్రచారానికి అనుమతించరట.

“మా గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టకుండా 1983 నుంచి నిషేధం అమల్లో ఉంది. మా విశ్వాసాల గురించి రాజకీయ పార్టీలకూ తెలుసు. అందుకే ఇక్కడ కొచ్చి ఏ రాజకీయ పార్టీ ప్రచారం చేపట్టదు” అని గ్రామ సర్పంచ్ అంటున్నారు. అభ్యర్థుల ప్రచారం మాత్రమే కాదు.. ఇళ్లు, వీధుల్లో రాజకీయ పార్టీల బ్యానర్లు అంటించడం, కరపత్రాలు పంచడం కూడా నిషేధమే.

అయితే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఈ గ్రామం ముందుంటుంది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ రూపొందించిన నిబంధనలను గ్రామస్థులు తప్పనిసరిగా పాటించాల్సిందే. అందులో భాగంగానే.. ఓటు వేయకపోతే రూ. 51 జరిమానా విధిస్తారు. దీంతో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా గ్రామంలో దాదాపు 100 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఒకవేళ, తప్పనిసరి పరిస్థితులో  ఓటు వేయకలేకపోతే.. వారు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

1700 మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామంలో 995 మంది ఓటర్లు ఉన్నారు. ప్రచారం లేకపోవడంతో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ గ్రామంలో వైఫై, సీసీటీవీ కెమెరాల వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. కేవలం ఓటెయ్యకపోతే మాత్రమే  కాదు .. చెత్త బయట విసిరేసినా ఇక్కడి ప్రజలు జరిమానాలు చెల్లించాల్సిందే.. ఈ గ్రామాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ మధ్య ఇలాంటి నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!