Suspense mystery thriller……….
‘అపరాధి’ (Aparadhi ) ఫహద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్,దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ( ఒరిజినల్ మలయాళ చిత్రం Irul) కేవలం మూడు ప్రధాన పాత్రలతో, ఒకే రాత్రిలో జరిగే కథ ఇది. ఆహా (Aha) OTT లో తెలుగు వెర్షన్లో అందుబాటులో ఉంది.
కథ ఏమిటంటే ?
నవలలు రాసే అలెక్స్ (సౌబిన్ షాహిర్), అతని గర్ల్‌ఫ్రెండ్ అర్చన (దర్శన రాజేంద్రన్) వీకెండ్ ట్రిప్‌కు బయలుదేరుతారు. దారిలో వారి కారు చెడిపోవడంతో, వర్షం నుంచి తలదాచుకోవడానికి అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద భవనంలోకి వెళ్తారు. ఆ ఇంట్లో ఉన్ని (ఫహద్ ఫాజిల్) అనే వింత వ్యక్తి పరిచయమవుతాడు.
అయితే, కొద్దిసేపటికే ఆ ఇంటి బేస్మెంట్లో ఒక స్త్రీ శవం ఉందని వారికి తెలుస్తుంది. ఆ హత్య చేసింది ఎవరు? ఇంట్లో ఉన్న ఆ ముగ్గురిలో హంతకుడు ఎవరు? అనేదే మిగిలిన కథ.
ఫహద్ ఫాజిల్ తన నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించారు. సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఆ పాత భవనం, వర్షం, లైట్లు పోవడం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులలో మంచి భయాన్ని, ఉత్కంఠను కలిగిస్తాయి. సినిమా రన్-టైమ్ చాలా తక్కువ (దాదాపు 1 గంట 30 నిమిషాలు) ఉండటం పెద్ద ప్లస్.
సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి సినిమా అంతా ఒకే గదిలో సాగుతూ, కేవలం డైలాగులపైనే ఆధారపడటంతో కొంత బోర్ కొడుతుంది. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ కొన్ని సీన్లలో లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ముగింపు అందరికీ నచ్చకపోవచ్చు.
అలెక్స్, అర్చనలు వర్షంలో చిక్కుకుని ఆ పాత భవనంలోకి వెళ్ళినప్పుడు, ఫహద్ ఫాజిల్ పాత్ర హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చే సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతను మాట్లాడే తీరు, ప్రవర్తన మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఒక రకమైన అనుమానాన్ని కలిగిస్తుంది.
ఫహద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్ ఒకరినొకరు అనుమానించుకుంటూ మాట్లాడే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.సినిమాలో కొన్ని సీన్లలో ఫహద్ ఫాజిల్ కేవలం తన కళ్ళ కదలికలతో, వింత సైకో నవ్వుతో పండించిన హావభావాలు ఆకట్టుకుంటాయి
అలెక్స్ రాసిన క్రైమ్ నవలలోని ‘డార్క్ నైట్ కిల్లర్’ అనే సైకో హంతకుడి నిజ జీవిత ప్రవర్తనను, ఉన్ని ప్రవర్తనను పోల్చి చూస్తూ అర్చన (దర్శన) ఉన్నినే హంతకుడని నమ్ముతుంది. అలెక్స్ తన పుస్తకాలలో రాసిన హత్యలన్నీ కల్పితాలు కావు, అవన్నీ అలెక్స్ స్వయంగా చేసిన నిజమైన హత్యలే అని, ఆ కిల్లర్ అలెక్సే అని ఉన్ని చెప్తాడు.
ఇద్దరి మాటల్లో ఏది నమ్మాలో తెలియక, తీవ్రమైన గందరగోళం, భయాందోళనల మధ్య అర్చన తనను తాను కాపాడుకోవడానికి చేతిలో ఉన్న తుపాకీతో అలెక్స్‌ను కాల్చి చంపేస్తుంది. డైరెక్టర్ ఈ సినిమాను ఒక పజిల్ లాగా ముగించారు. ఒక కోణంలో చూస్తే రచయిత అలెక్స్ నిజంగానే సైకో కిల్లర్ కావచ్చు, అందుకే ఉన్ని పగ తీర్చుకోవడానికి వచ్చాడు. మరో కోణంలో చూస్తే, ఉన్నినే అసలైన సైకో హంతకుడు కావచ్చు, అలెక్స్-అర్చనలను ట్రాప్ చేసి, వారి మధ్య నమ్మకాన్ని దెబ్బతీసి, అర్చన చేతే అలెక్స్‌ను చంపించి ఉండవచ్చు.
సినిమా చివరి వరకు అసలు హంతకుడు ఎవరో స్పష్టంగా చూపించకుండా, ప్రేక్షకుడి ఊహకే వదిలేయడం ఈ సినిమా ప్రత్యేకత. అపరాధి’ సినిమాకు మ్యూజిక్, కెమెరా పనితనం పెద్ద బలాలు. సినిమా అంతా ఒకే ఒక ఇంట్లో, కేవలం ముగ్గురు పాత్రల మధ్యే సాగినా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ఉత్కంఠను కలిగించడంలో ఈ రెండు విభాగాలు కీలక పాత్ర పోషించాయి.
ఈ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేసిన జోమోన్ టి. జాన్ విజువల్స్ పరంగా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. శ్రీరాజ్ సహజన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం.’అపరాధి’ ఒక స్లో-బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్. భారీ యాక్షన్ సీన్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించకుండా… కేవలం సస్పెన్స్ ఫహద్ ఫాజిల్ నటన కోసం ఈ సినిమాను ఆహా ఓటీటీలో ఒకసారి సరదాగా చూడొచ్చు.

