ఇదొక పోలీస్ ప్రొసీజరల్ డ్రామా !

Sharing is Caring...

Different kind of movie…. 

‘సెల్యూట్’ (Salute) 2022 నాటి సినిమా. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో వచ్చిన ఒక విలక్షణమైన ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా. సాధారణంగా మనం చూసే కమర్షియల్ మాస్ పోలీస్ సినిమాల్లా కాకుండా, వ్యవస్థలోని లోపాలను, రాజకీయ ఒత్తిళ్లను ఎండగడుతూ చాలా ప్రాక్టికల్‌గా, రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లోనూ Sony LIV  లో  స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ ఏమిటంటే ?

అరవింద్ కరుణాకరన్ (దుల్కర్ సల్మాన్) ఒక యంగ్ సబ్-ఇన్‌స్పెక్టర్. తన అన్నయ్య, డివైఎస్పీ అయిన అజిత్ కరుణాకరన్ (మనోజ్ కె. జయన్) అంటే పంచప్రాణాలు . ఒక ఊరిలో జరిగిన మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు, ఎన్నికల సమయం కావడంతో రాజకీయ నాయకుల నుండి పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక, అరవింద్ అన్నయ్య నేతృత్వంలోని పోలీస్ టీమ్… ఒక అమాయకుడిని తప్పుడు సాక్ష్యాలతో హంతకుడిగా ఇరికిస్తుంది. 

ఇది తట్టుకోలేక, తన అంతరాత్మ ప్రబోధంతో అరవింద్ లాంగ్ లీవ్ పెట్టి బయటకు వచ్చేస్తాడు కొన్నేళ్ల తర్వాత, ఆ నిజమైన హంతకుడిని పట్టుకోవడానికి అరవింద్ స్వయంగా విచారణ మొదలుపెడతాడు.ఈ ప్రయాణంలో అతనికి తన సొంత అన్నయ్య నుండి, పోలీస్ వ్యవస్థ నుండి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? చివరకు హంతకుడిని పట్టుకున్నాడా లేదా? అనేదే మిగతా సినిమా.

లాఠీ ఝుళిపించే పోలీస్ కాకుండా, నిస్సహాయతను, అంతర్మథనాన్ని అనుభవించే ఒక సాధారణ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా దుల్కర్ బాగా నటించారు. ఆయన కళ్ళల్లో కనిపించే గిల్ట్ ఫీలింగ్ సినిమాకు హైలైట్.ఇతర నటీ నటులు అందరూ బాగా నటించారు. 
బాబీ-సంజయ్ లు రాసిన ఈ కథ పోలీసుల అంతర్గత రాజకీయాలను, తప్పుడు ఇన్వెస్టిగేషన్లు ఎలా జరుగుతాయో చాలా సహజంగా చూపిస్తుంది. 

దుల్కర్, మనోజ్ కె. జయన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఒక వైపు వృత్తిపరమైన విభేదాలు,మరోవైపు కుటుంబ బంధాల మధ్య నలిగిపోయే డ్రామాను చక్కగా పండించాయి. తప్పుడు కేసు విషయంలో అన్నదమ్ముల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ … ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ, డైరెక్ట్‌గా గొడవ పడకుండా… కేవలం చూపులతో, బాడీ లాంగ్వేజ్‌తో వృత్తిపరమైన విభేదాలను, ఈగోలను ప్రదర్శించే ఆ నిశ్శబ్ద సన్నివేశాలు దర్శకుడు చాలా పవర్‌ఫుల్‌గా తెరకెక్కించారు.

సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది.కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్లు, మాస్ డైలాగులు ఆశించే వారికి ఈ సినిమా బోర్ అనిపిస్తుంది. బాలీవుడ్ నటి డయానా పెంటీ  పాత్రకు కథలో ఎలాంటి ప్రాధాన్యత లేదు  కేవలం ఒక లివ్-ఇన్ పార్ట్‌నర్‌గా మాత్రమే ఆమె కనిపిస్తుంది తప్ప, కథలో ఆమె పాత్ర ఏమీ చేయదు. 

సాధారణ సినిమాల్లో విలన్ ఎవరో ముందే తెలుస్తుంది, కానీ ఇందులో హంతకుడి పేరు  మాత్రమే తెలుస్తుంది తప్ప అతడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కేవలం కొన్ని పాత అడ్రస్సులు, ఫోన్ నంబర్ల ఆధారంగా కేరళలోని వివిధ ప్రాంతాల్లో దుల్కర్ సల్మాన్ ఒంటరిగా చేసే ఇన్వెస్టిగేషన్, చేజింగ్ సీన్లు ప్రేక్షకులలో “అసలు హంతకుడు దొరుకుతాడా లేదా?” అనే క్యూరియాసిటీని పెంచుతాయి. 

సాధారణ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లలో వచ్చే  షాకింగ్ ట్విస్టులు ఇందులో ఉండవు. క్లైమాక్స్ అందరికీ నచ్చకపోవచ్చు, కొందరికి కాస్త అసంతృప్తిని మిగుల్చుతుంది.సినిమా నిడివి తగ్గిస్తే బాగుండేది.   

‘సెల్యూట్’  మామూలు యాక్షన్ మసాలా పోలీస్ సినిమా కాదు..ఇది ఒక పక్కా పోలీస్ ప్రొసీజరల్ క్లాస్ థ్రిల్లర్ .. నెమ్మదిగా సాగే ఇన్వెస్టిగేషన్ మిస్టరీలను, వాస్తవికతకు దగ్గరగా ఉండే సినిమాలను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది.

సినిమాలోని నిశ్శబ్దాన్ని, ఉత్కంఠను బిజీఎమ్ (BGM) తో ఎలివేట్ చేయడంలో జేక్స్ బిజోయ్ విజయం సాధించారు, దర్శకుడు రోషన్ ఆండ్రూస్ ఆలోచనలకు తగ్గట్లుగా, అస్లాం పురయిల్ ఈ సినిమాను అత్యంత సహజమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. ఆసక్తి గలవారు ఈ సినిమా ను చూడవచ్చు.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!