Medical thriller……..
మలయాళ దర్శకుడు మిధున్ మాన్యుల్ థామస్ తెరకెక్కించిన ‘అబ్రహం ఓజ్లర్’ (Abraham Ozler) ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో కనిపిస్తారు. అదికూడా నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో.
నటుడు జయరామ్ లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.భార్యాబిడ్డలను కోల్పోయి, తీవ్రమైన మానసిక వేదన అనుభవించే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జయరామ్ జీవించాడనే చెప్పాలి. ఆయన లుక్, నటన చాలా సహజంగా ఉంటాయి.
ఒక హాస్పిటల్‌లో ఐటీ ఉద్యోగి హత్యతో సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా జరిగే మెడికల్ మర్డర్స్ వెనుక ఉన్న కిల్లర్ ఎవరు? క్లూస్ ఎందుకు వదిలి వెళ్తున్నాడు? అనే విచారణ సీన్స్ ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతాయి.
దర్శకుడు మిధున్ మాన్యుల్ థామస్ మెడికల్ క్రైమ్ సీన్లను మలిచిన తీరు, క్లిష్టమైన ఇన్వెస్టిగేషన్ డీటెయిలింగ్ ఆకట్టుకుంటాయి. సాధారణ రివెంజ్ డ్రామాలా కాకుండా, హాస్పిటల్స్,మెడికల్ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పగ, ప్రతీకారాల చుట్టూ కథ తిరగడం వినూత్నంగా అనిపిస్తుంది.
మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహించకపోయినప్పటికీ, ఆయన కథ అందించిన ‘గరుడన్’, ‘ఫీనిక్స్’ చిత్రాల తర్వాత వరుసగా వచ్చిన మూడవ థ్రిల్లర్ చిత్రం ‘అబ్రహం ఓజ్లర్’. ‘ఫీనిక్స్’ సినిమాలో కూడా ఆయన ఫ్లాష్‌బ్యాక్ విధానాన్ని అత్యంత అద్భుతంగా ఉపయోగించారు.
ఈ సినిమా ఒక మెడికల్ థ్రిల్లర్ కావడం,అందులో వరుస హత్యలకు గల కారణాలను వెల్లడించే తీరు ప్రేక్షకులపై ‘ఫీనిక్స్’ సినిమా స్థాయి ప్రభావాన్ని చూపించకపోయినప్పటికీ, ఆ హత్యల వెనుక ఉన్న కారణానికి (వివరణకు) మాత్రం కథ పరంగా బలమైన సమర్థన లభించింది
సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్లు చాలా సుదీర్ఘంగా ఉండి బోర్ కొట్టిస్తాయి. ద్వితీయార్ధంలో కథపై మరింత కసరత్తు చేసి ఉండాల్సింది. క్లైమాక్స్, కిల్లర్ ఎవరో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాకు క్లైమాక్స్ అనేది గుండెకాయ లాంటిది. కానీ ఈ సినిమాలో ముగింపు చాలా సాధారణంగా, ఎలాంటి పెద్ద షాకింగ్ ఎలిమెంట్స్ లేకుండా ముగిసిపోతుంది.
మమ్ముట్టి పాత్ర ఎంట్రీ ఇచ్చేంతవరకు సినిమా బాగుంటుంది కానీ, ఆయన వచ్చిన తర్వాత హీరో జయరామ్ పాత్ర ఒక ప్రేక్షకుడిలా మారిపోతుంది. ఇతర సపోర్టింగ్ క్యారెక్టర్ల పాత్రలు చాలా బలహీనంగా, పెద్దగా రిజిస్టర్ అవ్వని విధంగా ఉంటాయి.
మిధున్ ముకుందన్ అందించిన నేపధ్య సంగీతం క్రైమ్ థ్రిల్లర్ మూడ్‌ను సరిగ్గా ఎలివేట్ చేసింది. కొన్ని సన్నివేశాలలో సస్పెన్స్‌ను పెంచడానికి BGM బాగా ఉపయోగపడింది. తేని ఈశ్వర్ అందించిన విజువల్స్ చాలా డార్క్ టోన్‌లో ఉంటూ, సినిమా ఇంటెన్సిటీని మరింత పెంచాయి.
కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదించినప్పటికీ, జయరామ్ నటన, గ్రిప్పింగ్ ఫస్ట్ హాఫ్, మమ్ముట్టి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఈ సినిమాను jio Hotstar ఓటీటీ వేదికపై తెలుగులో ఒకసారి చూడవచ్చు.

