జీతు జోసెఫ్ మార్క్ క్రైమ్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

A movie worth watching ………

‘వలతు వశతే కల్లన్’ (Valathu Vashathe Kallan) మలయాళ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2026 ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం  airtelxstream play లో తెలుగు వెర్షన్ లో ఉంది.

కథాంశం 
నగరంలో ఒక యువతి అదృశ్యం కావడంతో కథ ప్రారంభమవుతుంది. అవినీతి నేపథ్యం,నేరపూరిత గతం ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆంటోనీ  (బిజు మీనన్) ఈ కేస్ ఇన్వెస్టిగేషన్‌ను చేతుల్లోకి తీసుకుంటాడు. విచారణ క్రమంలో శామ్యూల్ జోసెఫ్ (జోజు జార్జ్) అనే వ్యక్తి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బయటకు వస్తాయి. ఒక చీకటి రాత్రి పోలీస్ స్టేషన్ నేపథ్యంలో ఆంటోనీ , శామ్యూల్ జోసెఫ్ మధ్య జరిగే ఒక రకమైన సైకలాజికల్ మైండ్ గేమ్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. 

బిజు మీనన్, జోజు జార్జ్ ఇద్దరూ అద్భుతమైన నటన కనబరిచారు. పోలీస్ స్టేషన్ లోపల ఒక నాటకం తరహాలో సాగే ఈ కథలో ఇద్దరి ఫిజికాలిటీ, ప్రెజెన్స్ సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి. ముఖ్యంగా ఒత్తిడిలో నలిగిపోయే పోలీస్ పాత్రలో బిజు మీనన్ అదరగొట్టాడు.

సినిమా ప్రథమార్ధం చాలా ఆసక్తికరమైన కథనంతో, బలమైన ఎమోషన్స్,ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ వరకు కథ ఏ వైపు వెళ్తుందో ఊహించడం కష్టం.సెకండ్ హాఫ్‌లో కొన్నిచోట్ల కథనం నెమ్మదించి కల్పిత మలుపుల వైపు వెళ్లడం వల్ల ప్లాట్ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. 

ప్రధాన పాత్రలపై పెట్టిన శ్రద్ధ మిగిలిన క్యారెక్టర్స్ పై పెట్టలేదు, వారి పాత్రలు చాలా సాధారణంగా రాసుకున్నారు.  క్లైమాక్స్ ట్విస్ట్ కోసం కొన్ని లాజిక్ లేని సీన్స్ కూడా పెట్టారు. సినిమాలో సస్పెన్స్, ఎమోషన్స్ , మైండ్ గేమ్‌లతో కూడిన కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.దర్శకుడు జీతు జోసెఫ్ తన మార్కు డ్రామాను ఈ సీన్లలో బాగా చూపించారు. 

సినిమా ప్రారంభంలోనే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆంటోనీ  క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా, కాస్త నెగెటివ్ షేడ్స్‌తో చూపిస్తారు. ఒక లైంగిక దాడికి గురైన బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే, ఆమెను కేసు పెట్టకుండా భయపెట్టి వెనక్కి పంపించే సీన్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది ఆఫీసర్ క్రూరత్వాన్ని చూపిస్తూ కథలోకి మనల్ని లాక్కెళుతుంది. 

యువతి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా ఎథికల్ హ్యాకర్ శామ్యూల్ (జోజు జార్జ్), ఇన్‌స్పెక్టర్ ఆంటోనీల మధ్య పోలీస్ స్టేషన్‌లో జరిగే సంభాషణలు సినిమాకే పెద్ద హైలైట్. ఒకే రాత్రి బ్యాక్‌డ్రాప్‌లో, కేవలం మాటలతో ఇద్దరు నటులు ఒకరినొకరు క్రాస్-చెక్ చేసుకునే ఈ సీన్స్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి.  

శామ్యూల్ తన హ్యాకింగ్ నైపుణ్యాలతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా, సిస్టమ్‌ను మేనేజ్ చేసే సీన్లు టెక్నికల్ పరంగా చాలా బాగుంటాయి. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి అతను వేసే ప్లాన్స్ థ్రిల్ కలిగిస్తాయి.

సినిమా సెకండ్ హాఫ్‌లో,ఎప్పుడూ కఠినంగా ఉండే ఇన్‌స్పెక్టర్ ఆంటోనీ తన  కొడుకు చేసిన తప్పుల గురించిన నిజాలు బయటపడినప్పుడు పూర్తిగా మానసికంగా కుంగిపోతాడు. ఒక తండ్రిగా, బాధ్యతాయుతమైన ఆఫీసర్‌గా ఆయన పడే వేదన, బిజు మీనన్ నటన ఈ సీన్‌ను సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్‌గా నిలబెట్టాయి. 

మలయాళ భాషలో ‘వలతు వశతే కల్లన్’ అంటే తెలుగులో “కుడి వైపు ఉన్న దొంగ” (The Thief on the Right) అని అర్థం. ఈ టైటిల్ వెనుక ఒక బైబిల్ నేపథ్యం,  లోతైన అంతరార్థం ఉన్నాయి.

ఈ చిత్రానికి సతీష్ కురుప్ (Satheesh Kurup) కెమెరామెన్‌గా పనిచేశారు. సినిమా అంతా నైట్ ఎఫెక్ట్ లో సాగుతుంది. సతీష్ కురుప్ పోలీస్ స్టేషన్ లోపల ఉండే డార్క్ ఇంటీరియర్ సీన్స్, షాడోస్, క్లోజప్ షాట్లను చాలా బాగా క్యాప్చర్ చేశారు.

విష్ణు శ్యామ్ BGM సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. కథలో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు, సస్పెన్స్ పెరిగే లూప్‌లలో ఆర్కెస్ట్రా మ్యూజిక్‌తో థ్రిల్‌ను బాగా పెంచారు. స్క్రిప్ట్ పరంగా అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సినిమా చూడదగినదే.    

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!