Are they meeting again?…………………………………………….
ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ మళ్ళీ చేరబోతుందనే ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది. వచ్చే దసరా లేదా దీపావళి నాటికి బీజేపీ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరుతుందన్నది ఆ కథనం సారాంశం. దీంతో మళ్ళీ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇప్పటికే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయని ఆ వార్తా కథనంలో రాసుకొచ్చారు. పొత్తు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు పక్షం రోజుల క్రితం మాట్లాడారని ఆ కథనం చెబుతోంది. ఆ తర్వాత అమిత్ షాతో లోకేష్ పొత్తుల గురించి మాట్లాడారని ఆ కథనంలో వివరించారు.
ఏపీ సీఎం జగన్ తో విభేదించి టీడీపీతో జతకట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోందని ఆ కథనంలో రాసుకొచ్చారు. ఏపీలో టీడీపీ నిర్వహించిన తాజా సర్వేలో బీజేపీకి నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఉందని కూడా తేలిందట. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమ బలం పెరుగుతుందని బీజేపీ అంచనా వేస్తుందని ఆ కథనంలో రాయడం విశేషం.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి పెద్దగా ఫలితం లేకపోయినా.. పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుతుందని పోల్ సర్వేలు సూచిస్తున్నాయని ఆ కథనంలో రాశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహణ సమావేశం కోసం ఆ మధ్య బాబు ఢిల్లీకి వెళ్లారు. ఆ సందర్బంగా ప్రధాని మోడీని కలిశారు.
ఇద్దరు నేతలు కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత మోడీ, చంద్రబాబు కలుసుకోవడం ఇదే. అందుకే ఇద్దరు నేతల భేటీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం గా మారింది. ఆ సమయంలోనే పొత్తుల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‍లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ను కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో అమిత్ షా సమావేశాలు ఏపీలో రాజకీయ కాకను రాజేశాయి. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేస్తే తాము పొత్తు పెట్టుకుంటామని అమిత్ షా చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.
మోడీతో చంద్రబాబు భేటీ… అమిత్ షాతో జూనియర్ సమావేశంపై వైసీపీ కలవరానికి గురైందనే ప్రచారం జరిగింది. ఇప్పటికే బీజేపీకి టీడీపీ దగ్గరయ్యే అవకాశం ఉందంటూ ఏపీ రాజకీయాల్లో, అటు ఢిల్లీలో విస్తృత చర్చ సాగుతోంది.టీడీపీ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. తెలంగాణ విడిపోయిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ చేసింది.
పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ తో కలవాలని ఉబలాటపడుతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కాగా బీజేపీ, టీడీపీ పొత్తు పై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ స్పందించారు.టీడీపీ తో పొత్తు అంశం వార్తలకే పరిమితమని స్పష్టం చేశారు.
తెలంగాణ లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని .. ఆంద్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ తో కలసి పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ బలం పెరుగుతోందన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదని లక్ష్మణ్ తేల్చి చెప్పారు.
ఇక టీడీపీ అధినేత చంద్ర బాబు ఈ విషయం పై తాను ఇప్పుడేం స్పందించనని అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి పొత్తు పొడిచినా ఆశర్య పోనవసరం లేదు.