Great director ……………………
దర్శకుడు కె.విశ్వనాథ్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘శంకరాభరణం’. తెలుగు చలనచిత్ర చరిత్రలో కలకాలం నిలిచిపోయే క్లాసిక్ మూవీ ‘శంకరాభరణం’. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలు హవా సృష్టిస్తున్న రోజుల్లో సోమయాజులు అనే కొత్త నటుడు ప్రధాన పాత్రధారిగా కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ అందరితో శభాష్ అనిపించుకుంది.
ప్రేక్షకుల మన్ననలు పొందింది. సంగీతం నేపథ్యంగా సాగే ఈ సినిమా ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది. అప్పట్లో ఆ సినిమా ఒక ప్రయోగమే. తొలుత ఆసినిమా ను పంపిణీ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు రాలేదు. రిలీజ్ అయ్యాక నీరాజనాలు పట్టారు.
ఆ సినిమా అందుకొని రివార్డులు అవార్డులు లేవు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన సినిమా అది.ఆ సినిమాలో పాటలన్నీపెద్ద హిట్. ‘శంకరా.. నాదశరీరా’ పాటకైతే థియేటర్ లో జనాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. ‘దొరకునా ఇటువంటి సేవ’ అనే పాట వింటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇప్పటికి ఆ సినిమా స్థాయిలో మరే సినిమా రాలేదు.
‘శంకరాభరణం’ కంటే ముందు విశ్వనాథ్ 1976 లో ‘సిరి సిరి మువ్వ’ పేరిట నృత్య, సంగీత ప్రధాన చిత్రం తీశారు. ఇందులో జయప్రద హీరోయిన్.చంద్రమోహన్ హీరో. అది కూడా సూపర్ హిట్ మూవీయే. అందులో పాటలన్నీ సూపర్ హిట్. ‘జుమ్మంది నాదం .. సై అంది పాదం’ అనే గీతం .. … ‘రా దిగిరా .. దివినుంచి భువికి దిగిరా’ అనే పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఇప్పటికి ఆ పాటలు వినబడుతుంటాయి. మహాదేవన్ సంగీతం ఈ సినిమా విజయానికి దోహదపడింది.ఈ సినిమా నుంచే విశ్వనాథ్ సినిమా మేకింగ్ లో తన స్టైల్ మార్చుకున్నారు. సంగీతం, నాట్యానికి ప్రాధాన్యమిచ్చే కథలను ఎంచుకున్నారు. మొదట్లో కొన్ని కమర్షియల్ సినిమాలు తీసినప్పటికి ‘సిరిసిరిమువ్వ’ తర్వాత విశ్వనాథ్ తీసిన చిత్రాలన్నీ విలక్షణమైనవే.
సిరిసిరిమువ్వ , శంకరాభరణం సినిమాల తర్వాత … స …… అనే అక్షరం ఆయనకు సెంటిమెంట్ గా మారిపోయింది. తర్వాత వచ్చిన సినిమాలు .. స లేదా శ అక్షరంతోనే నిర్మితమైనాయి.
ఆ జాబితాలో శంకరాభరణం, శుభోదయం, సప్తపది, శుభలేఖ,సాగర సంగమం, స్వాతి ముత్యం, శ్రుతిలయలు,సిరివెన్నెల,సూత్రధారులు, స్వర్ణ కమలం, స్వయం కృషి, శుభసంకల్పం, స్వాతి కిరణం, స్వరాభిషేకం సినిమాలున్నాయి. ఈ సినిమాల్లో పాటలు అన్నీ సూపర్ హిట్.
వీటిలో ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. ఒకటి అరా సినిమాలు ఆడకపోయినా మిగిలినవన్నీ హిట్ సినిమాలే. అన్ని సంగీత ప్రాధాన్యత ఉన్న చిత్రాలే. తన సినిమాల్లో పాటలకు సంగీతానికి విశ్వనాధ్ ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు.
ఆయన భావాలకు తగ్గట్టుగా ఆరుద్ర, దేవులపల్లి,దాశరధి,సినారె, ఆత్రేయ, వేటూరి, సీతారామశాస్త్రి, తదితర రచయితలు అద్భుతమైన గీతాలు అందించారు.
అలాగే రాజేశ్వరరావు, మహదేవన్,రమేష్ నాయుడు , ఇళయరాజా తదితరులు నాలుగు కాలాలు నిలిచేలా నాణ్యమైన బాణీలు అందించారు. దర్శకుడిగా తనకు ఏం కావాలో, ఏ పదాలు పడాలో చెప్పి మరీ పాటలు రాయించుకునే వారు ఆయన.. సప్త పది, సాగర సంగమం లో కూడా అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి.
కమల్ హాసన్ బావి పైన నాట్యం చేస్తూ పాడే “నరుడి బ్రతుకు నటన.. ఈశ్వరుడి తలపు ఘటన” అనే పాట నభూతో నభవిష్యత్ అన్నరీతిలో సాగుతుంది. అలాగే ‘స్వాతి ముత్యం’ లో ‘సువ్వీ సువ్వీ’ పాట కూడా అద్భుతంగా ఉంటుంది.
ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పాటలున్నాయి.కథను బట్టి, సన్నివేశం,సందర్భాన్ని బట్టి మధుర గీతాలను రాయించుకోవడం ఒక ఎత్తైతే, వాటిని మరింత అద్భుతం గా తెరకెక్కించిన ఖ్యాతి విశ్వనాథ్ ది.