కామెడీ ఇష్టపడేవాళ్లు చూడొచ్చు !

Sharing is Caring...

కామెడీని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని కామెడీ డామినేట్ చేస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా చూడవచ్చు. హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 2012 లో విడుదలైన ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించలేదు.

ఇలాంటి కథా చిత్రాలు చాలానే వచ్చాయి. దీవానా మస్తానా సినిమాను పూర్తిగా దించారు.కొత్త దర్శకుడు నారాయణ కథను బాగానే తెరకెక్కించారు.అల్లరి నరేష్,శర్వానంద్,బ్రహ్మానందం, శ్రియ, అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే ..డాక్టర్ నందిని (శ్రియ) హైదరాబాద్‌లో నర్సింగ్‌హోమ్ నడుపుతుంటోంది. అవినాష్ (అల్లరి నరేష్) అమలాపురంలో చిన్నదొంగ. చంటి (అలీ) అతని సహాయకుడు. ఇద్దరూ లోకల్ ఇన్‌స్పెక్టర్ ని మోసం చేసి హైదరాబాద్‌కు వస్తారు. అక్కడ అవినాష్ నందినితో ప్రేమలో పడతాడు.

ఈ తరుణంలో, ఆనంద్ (శర్వానంద్) తనకున్న ఫోబియా ట్రీట్మెంట్ కోసం నర్సింగ్ హోమ్‌కి వస్తాడు. అతగాడు కూడా నందిని ప్రేమలో పడతాడు.నందిని కోసం అవినాష్ ఆనంద్ పోటీ పడతారు. మధ్యలో లోకల్ గూండా అకుభాయ్ (బ్రహ్మానందం) కూడా నందినితో ప్రేమలో పడతాడు. కథ అనేక మలుపులు తిరుగుతుంది. నందిని ఎవరిని చేసుకుంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

అల్లరి నరేష్ ఈ తరహా పాత్రలు బోలెడు చేసాడు. ఇందులో కూడా తన పాత్రకు న్యాయం చేసాడు. శర్వానంద్‌ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు. అలీ సపోర్టింగ్ క్యారెక్టర్ లో ఇమిడిపోయాడు. శ్రియ కు ఈ చిత్రంలో నటించడానికి పెద్ద స్కోప్ లేదు. కేవలం గ్లామర్ డాల్ గా చూపారు. నరేష్, శర్వానంద్, బ్రహ్మానందంలపై తీసిన సాంగ్స్ శ్రియను బాగా ఎక్సపోజ్ చేశారు. చాలా భాగం కథ అంతా శ్రియ చుట్టూనే నడుస్తుంది కానీ అందువల్ల సీన్లు అన్నీ ఒకేలా ఉన్నాయనిపిస్తుంది.

బ్రహ్మానందం, కోవై సరళ కామెడీ ఎపిసోడ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. బ్రహ్మానందం పాత్ర సినిమాలో ప్రధాన పాత్రే. బ్రహ్మానందాన్ని ప్రేమించే యువతిగా కోవై సరళ తన మార్క్ నటనను చూపింది.రొటీన్ కథాంశంతో అక్కడక్కడా కామెడీ తో సినిమా నడుస్తుంది. క్లయిమాక్స్ కొంత సాగదీసారు అనిపిస్తుంది.

సూర్య స్క్రీన్‌ప్లే.. డైలాగ్‌లుఆకట్టుకుంటాయి. కథ పై మరి కొంత కసరత్తు జరిగితే బాగుండేది. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. భీమ్స్ సంగీతం ఫర్వాలేదు. మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సెకండాఫ్‌లో హీరోలిద్దరి మధ్య జరిగిన పోరాట దృశ్యాలు పెద్దగా ఆకట్టుకోవు. క్లయిమాక్స్ దృశ్యాలు కూడా అంతే.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!