Why Gandhi changd dress code ?
టంగుటూరి ప్రకాశం పంతులు ఇంగ్లాండ్ లో బారిస్టర్ కోర్సు చదివే సమయంలో తొలి సారి లండన్ లో గాంధీజీ ని కలుసుకున్నారు.అప్పుడు గాంధీజీ ఫుల్ సూట్ ..బూట్ తో ఉన్నారని ప్రకాశం గారు తన స్వీయ చరిత్ర లో వ్రాసారు.
అలాగే తరువాత నాలుగు అయిదు సంవత్సరాలకు బారిస్టర్ కోర్సు చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళిన హిందుత్వ సిద్ధాంత కర్త, విప్లవ స్వరాజ్య ఉద్యమ వీరుడు వినాయక్ దామోదర్ సావర్కర్ గాంధీజీని తొలిసారి కలిసినప్పుడు కూడా మహాత్మా గాంధీ సూట్ బూట్ లోనే ఉన్నారట.
ఇదే విషయం Six Golden Pages in Indian History పుస్తకం లో సావర్కర్ వ్రాసారు.కానీ గాంధీజీ ఇండియా వచ్చిన తరువాత సూట్ బూట్ పూర్తి గా వదిలి పంచె, చొక్కా గుజరాతీ తల పాగా ను ధరించడం మొదలు పెట్టారు.
ఆ తరువాత కొంత కాలానికి ఆయన భారత దేశ ప్రజలు కడుపు నిండా తిండి, శరీరం దాచుకోవడానికి బట్ట లేకుండా నివసిస్తున్నారనే విషయాలు గమనించారు. ఒకసారి రైలు ప్రయాణంలో ప్రజలకు ఖద్దరు ధరించమని కూడా సూచించారు. ఖద్దరు ఖరీదు ఎక్కువని తమవల్ల కాదని వారు తేల్చి చెప్పారు.
ఇవన్నీ గమనించి పేద ప్రజలకు దగ్గర కావాలంటే తాను కొల్లాయి కడితే మంచిదని గాంధీ అప్పట్లో భావించారు. వెనువెంటనే తన నిర్ణయం అమలు పరిచారు. గాంధీ వేషధారణ చూసి అనుచరులు ఆశ్చర్యపోయారు.
సరిగ్గా సెప్టెంబర్ 2024 కి గాంధీజీ కొల్లాయిలోకి మారి నూట నాలుగేళ్లు అవుతుంది.కవి బసవరాజు అప్పారావు “కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ ” అంటూ ఒకపాట కూడా రాశారు.తెలుగు నాట అప్పట్లో ఈ పాట ప్రతిఒక్కరి నోటా నానింది. 1938 లో తీసిన ‘మాలపిల్ల’ సినిమాలో గాయకుడు సూరిబాబు ఈ పాట పాడారు. విదీశీ వస్త్ర బహిష్కరణ ద్వారా ఆ దుస్తుల అమ్మకాలను సగానికి పడిపోయేలా చేసి బ్రిటిష్ వారి పై ఆర్థికపరమైన దెబ్బకొట్టారు గాంధీ.
గాంధీ కొల్లాయి కట్టకపోయినా పేదలకు దగ్గర కావచ్చు అనే అభిప్రాయం కూడా అప్పట్లో కొందరు వ్యక్తం చేయకపోలేదు.ఇక తర్వాత తరం నాయకుల్లో చాలామంది సింపుల్ వేష ధారణతోనే ప్రజలకు దగ్గరయ్యారు. గాంధీని అనుసరించలేదు .పేద ప్రజల ఆశా జ్యోతులు గా వెలిగిన నెహ్రూ, ఇందిరా లు కూడా గాంధీని ఫాలో కాలేదు.
ఇక యం జీ రామచంద్రన్, యన్. టీ రామారావు, జయలలిత పేదల అభిమానం చూరగొన్నవారే.వీళ్ళెవరూ వేష ధారణ మార్చలేదు. మొదట చాలా సామాన్యులు అయిన వీరు తర్వాత కాలంలో బాగా డబ్బు గడించిన వారే.అంతెందుకు రాజస్థాన్ బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే గ్వాలియర్ మహారాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి.
పెళ్లి తరువాత ఆమె జోద్పూర్ మహా రాణి అయింది.అమెకు ఇప్పుడు గూడా రాజస్థాన్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ముఖ్య మంత్రి గా చేసేటప్పు డు పార్టీ లో అసమ్మతి వర్గం ఆమె గర్విష్టి,అహంకారి, పార్టీ లో అందరినీ కూడ గట్టుకొని పోయే స్వభావం కాదని ఆమెను మార్చమని నరేంద్ర మోడీ, అమిత్ షా లపై ఒత్తిడి తెచ్చినా ఆమెను మార్చలేదంటే ప్రజలలో అమె పట్టు ఏమిటో తెలుస్తుంది.
బీద ప్రజల తో మమేకం కావాలంటే మనం వాళ్ళ లాగా ఉండాల్సిన పని ఏముంది. మరి గాంధీ అంత మేధావి అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అనిపిస్తోంది.అమెరికా, ఇంగ్లాండ్ లలో అయితే అలా ఉండటం కుదరదని ఒక సందర్భంగా సుబ్రమణ్య స్వామి అన్నారు.
ఆ రోజుల లో బ్రిటిష్ ప్రధాని చర్చిల్ గాంధీజీ ని Half Naked Bania అని పరిహసించాడు.అప్పుడు దేశం లో ఆగ్రహం పెల్లుబికింది.అన్ని భాషలలో పాటలు పద్యాలు వచ్చాయి. మన తెలుగు లో ఆ సమయం లోపుట్టుకొచ్చింది ” కోమటి అయితే నేమి మా గాంధీ కొల్లాయి గట్టి తేనేమి” అనే పాట. ఆ నాడు తెలుగు నాట మార్మోగింది.
————– Raghava Rao Karavadi