Banding with NTR …………….
పై ఫొటోలో క్లాప్ కొడుతున్నవ్యక్తి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఎన్టీఆర్ ను గుర్తు పట్టని వారే ఉండరు.అప్పట్లో పాండవ వనవాసం అనే సినిమాకు రాఘవేంద్రుడు సహాయదర్శకుడిగా పనిచేశారు.ఆ సినిమా షూటింగ్లో తీసినదే ఈ ఫోటో.
వీరిద్దరి కాంబినేషన్ లో1977 తర్వాత చాలా హిట్ సినిమాలు వచ్చాయి. ఫోటో షాపులో ఈ ఫొటోకు నగిషీలు చెక్కినట్టు అనిపిస్తుంది. అదెలా ఉన్నా రాఘవేంద్రరావు ఆ సినిమాకు పనిచేసిన మాట వాస్తవమే. అప్పటికే రాఘవేంద్రరావు తండ్రి కె ఎస్ ప్రకాశరావు పెద్ద దర్శకుడు.
ఆయనే స్వయంగా కమలాకర కామేశ్వరరావు తో మాట్లాడి సహాయ దర్శకుడిగా పనిచేయమని కుమారుడిని ఆయన దగ్గరకు పంపారు. ఆ సమయంలోనే రాఘవేంద్రరావు దర్శకత్వ శాఖలో కొన్నిమెళకువలు నేర్చుకున్నారు.
ఇక ఈ పాండవ వనవాసం సినిమా ను మాధవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ASR ఆంజనేయులు నిర్మించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు.ఇందులో ఎన్టీ రామారావు భీముడిగా, సావిత్రి ద్రౌపదిగా, ఎస్వీఆర్ దుర్యోధనుడిగా, కాంతారావు కృష్ణుడిగా నటించారు.
ఘంటసాల సంగీతం సమకూర్చారు. పాటలన్నీ బాగుంటాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది, ఎన్నో థియేటర్లలో 175 రోజులు ఆడింది. ఈ సినిమాలో ఒక పాటలో నర్తకిగా ప్రఖ్యాత నటి ‘హేమమాలిని’ నటించింది.
ఈ సినిమా నిర్మాత ఆంజనేయులు తర్వాత కాలంలో ‘కురుక్షేత్రం’ సినిమాను తీశారు. దానికి కూడా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ తీసిన ‘దానవీరశూరకర్ణ’ కు పోటీ గా కురుక్షేత్రాన్నితీశారు.
హీరో కృష్ణ ఈ సినిమా కు సహా భాగస్వామి గా వ్యవహరించారు. కురుక్షేత్రం లో శోభన్ బాబు కృష్ణుడు, కృష్ణ అర్జునుడిగా నటించారు. సాంకేతిక విలువలతో సినిమా భారీగా తీసినప్పటికి ‘కర్ణ ‘ముందు నిలబడలేకపోయింది.
ఇక రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా (1977) అడవి రాముడు సూపర్ డూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన వాటిలో వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ తదితర చిత్రాలు హిట్ అయ్యాయి. సింహబలుడు, తిరుగులేని మనిషి ఫ్లాప్ అయ్యాయి. తిరుగులేని మనిషి లో మెగాస్టార్ చిరు కూడా నటించారు.
రాఘవేంద్రరావు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఇప్పటికి 60 ఏళ్ళు పూర్తి అయ్యాయి.దర్శకుడిగా బాధ్యతలు చేపట్టి 50 ఏళ్ళు అవుతోంది.ఆయన మొదటి సినిమా ‘బాబు’ 1975 లో విడుదలైంది. తాను ఈ స్థాయికి ఎదగడానికి అన్నఎన్టీరామారావే కారణమని రాఘవేంద్రరావు ఎన్నోసార్లు ప్రకటించారు.
ఫోటో కర్టేసి .. భరద్వాజ రంగవజ్జుల