A wonderful sad song……….
“నేనొక ప్రేమపిపాసిని నీవొక ఆశ్రమ వాసివి” ఈ సూపర్ హిట్ పాట… 1978లో విడుదలైన “ఇంద్రధనుస్సు” చిత్రం లోనిది. ఈ అద్భుత విషాద గీతాన్ని “మనసు కవి”గా పేరొందిన ఆచార్య ఆత్రేయ రాశారు. ఆయనకు కూడా బాగా ఇష్టమైన పాటల్లో ఇదొకటి.
గాయకుడు బాలుని కలసినప్పుడల్లా ఈ పాట ఆత్రేయ పాడించుకునే వారు.బాలూనే ఈ విషయం ఒక సందర్భం లో చెప్పారు. ఆత్రేయ ఒక విఫల ప్రేమికుడి వేదనను, తాత్విక చింతనను ఈ పాట లో వివరించారు. కె.వి. మహదేవన్ స్వరకల్పనలో, గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతానికి అప్పట్లో మంచి స్పందన లభించింది.
ఆరాటం వర్సెస్ వైరాగ్యం
“నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది”
విశ్లేషణ: ఇక్కడ కవి నాయకుడిని ‘ప్రేమ పిపాసి’ (ప్రేమ కోసం తపించే దాహం గలవాడు) గాను, నాయికను ‘ఆశ్రమ వాసి’ (సంసార మోహాలకు, లౌకిక బంధాలకు దూరంగా ఉండే సన్యాసిని లేదా నిశ్చల మనస్కురాలు) గాను పోల్చారు. ఒకరిది తీరని ప్రేమ దాహం, మరొకరిది చలించని కఠిన మనస్సు లేదా సామాజిక బంధాల నిశ్శబ్దం అనే పరస్పర విరుద్ధ భావాలను ఆత్రేయ చాలా సరళమైన పదాలతో లోతుగా పలికించారు.
2. మొదటి చరణం: నిరంతర నిరీక్షణ – విఫల ప్రయత్నం
“తలుపు మూసిన తలవాకిటిలో పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా”
విశ్లేషణ: ఆమె మనసు అనే తలుపులు మూసుకున్నా, ప్రియుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆ వాకిట్లోనే నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎంత పిలిచినా బదులు రాకపోవడంతో, అతని ఆశ నిరాశగా మారి విరక్తితో, అలసటతో వెనుతిరుగుతున్నాడని ప్రేమికుడి దైన్యాన్ని ఇక్కడ చూపించారు.
3. రెండవ చరణం: ఆరాధన – ఆత్మసమర్పణ
“పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను”
విశ్లేషణ: ఈ చరణంలో ప్రేమని ఒక ‘దైవిక పూజ’గా మార్చారు ఆత్రేయ. ఆమెను దేవతగా భావించి ప్రతిరోజూ పూజించడానికి పూలు తెచ్చానని, ప్రేమ అనే భిక్ష కోసం దోసిలి ఒగ్గానని అంటాడు. ఆమె నడిచే దారిలో తన ‘ఎడద’ను (హృదయాన్ని) తివాచీలా పరిచినా, ఆమె అటువైపు రాకపోవడం వల్ల ఆ హృదయం ఎందుకూ పనికిరాకుండా నలిగిపోయిందని ప్రేమికుడి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది.
4. మూడవ చరణం: మరణ వేదన – అమర ప్రేమ
“పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలునని
నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను”
విశ్లేషణ: కాలం గడుస్తున్న కొద్దీ గుండెల్లో విరహ వేదన (సెగ) ఎక్కువవుతోంది. కనీసం నా బాధ నీ చెవిన పడితే చాలని ఆశిస్తున్నాడు. ఎప్పటికైనా నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుని, నీ జ్ఞాపకాలలో నన్ను వెతుక్కునే రోజు వస్తుంది; కానీ, నువ్వు నన్ను ప్రేమించావని నాకు చెప్పేలోపే నేను చితిపై కాలి ‘నివురు’ (బూడిద) అయిపోతాను అంటూ విషాదకర ముగింపును పలికారు.
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తన గొంతులోని గంభీరతతో పాటు, భగ్నప్రేమికుడి ఆర్తిని, బాధను శ్రోతల గుండెలకు హత్తుకునేలా పాడారు. ముఖ్యంగా చివరి చరణం ఎమోషనల్ గ్రాఫ్‌ను పెంచుతుంది. మామ మహదేవన్ క్లాసికల్ టచ్‌తో అందించిన మెలోడీ ట్యూన్ ఈ నాటికీ శ్రోతలను ఆకట్టుకుంటూనే ఉంది.
ఈ పాట కేవలం ఒక సినిమా పాట మాత్రమే కాదు, ప్రేమలో ఓడిపోయిన మనసు పడే అంతర్మథనానికి ఒక అద్భుతమైన తాత్విక రూపం.ఈ పాట తెరకెక్కించిన తీరు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే హీరో కృష్ణ ఆహార్యం భగ్నప్రేమికుడి లా లేదనే విమర్శలు వినిపించాయి.

