అలా అవుట్ డోర్ షూటింగ్ చేయడం ఆయనకే సాధ్యమా ?

Sharing is Caring...

Monotonous shooting …………

సూపర్‌స్టార్ కృష్ణ నటించి, నిర్మించిన  ట్రెండ్ సెట్టర్ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’ (1974). తెలుగు చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రంగా, నభూతో నభవిష్యతి అన్న చందంగా రూపొందింది.ఎక్కడైతే సీతారామరాజు విప్లవ భేరి మ్రోగించారో ఆ ప్రదేశం లోనే ఈ సినిమా షూటింగ్ జరగడం విశేషం. సినిమా యూనిట్ మొత్తాన్ని తరలించి ఏకబిగిన షూటింగ్ జరిపించారు.

సినిమా యథార్థత (Realism) కోసం అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన చింతపల్లి, లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, కృష్ణదేవిపేట, అన్నవరం, పోశనపాడు, బలిమెల వంటి దట్టమైన మన్యపు అడవుల్లో.. అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య షూటింగ్ చేశారు.

ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన వసతులు ఉండేవి కావు. మంచినీళ్ల కోసం కూడా చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. కార్లు, బస్సులు, మినీ ట్రక్కులు, భారీ క్రేన్లను అతికష్టం మీద అడవుల్లోకి తీసుకెళ్లారు. చింతపల్లి, నర్సీపట్నం పరిసరాల్లోని ప్రభుత్వ ‘ఇన్‌స్పెక్షన్ బంగ్లా’ లను ముందుగానే బుక్ చేశారు.

ప్రధాన నటీనటులైన విజయనిర్మల, జగ్గయ్య, గుమ్మడి వంటి వారికి ఇక్కడే వసతి కల్పించారు. అలాగే చింతపల్లిలో 12 డీలక్స్ కాటేజీలు కట్టించారు.వందలాది మంది షూటింగ్ సిబ్బంది, ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టుల కోసం అడవులకు సమీపంలో మైదాన ప్రాంతాలలో పెద్ద ఎత్తున తాత్కాలిక టెంట్లు (Tents) వేసి మిలిటరీ క్యాంప్ తరహాలో వసతి ఏర్పాటు చేశారు.మద్రాస్ నుంచి ప్రత్యేక వంట మాస్టర్లను పిలిపించి అడవిలోనే వంటలు చేయించారు.

భారీగా రేషన్ సామాగ్రిని మన్యానికి తరలించారు. షూటింగ్ స్పాట్ ఎక్కడ ఉంటే.. అక్కడికే వాహనాల్లో వేడివేడి ఆహారాన్ని పంపించేలా కదలే వంటశాల వ్యవస్థను నడిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి కొరత ఎక్కువగా ఉండటం వల్ల, లోయలు, కొండల కింద ఉన్న గ్రామాల నుండి రోజూ ట్రాక్టర్లు, మినీ ట్యాంకర్ల ద్వారా స్పాట్‌కు స్వచ్ఛమైన మంచినీటిని రవాణా చేసేవారు.

కొన్ని అత్యవసర పరిస్థితుల్లో, విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా స్థానిక గిరిజన  నాయకులు, గ్రామ పెద్దల ఇళ్లను ఉపయోగించుకున్నారు. ఈ సినిమాను సినిమాస్కోప్‌లో తీయడానికి కెమెరామెన్ వి.ఎస్.ఆర్. స్వామి కేవలం రెండు లెన్స్‌లతో (ఒకటి క్లోజప్స్, మరొకటి లాంగ్ షాట్స్ కోసం) మొత్తం సినిమాను మేనేజ్ చేశారు. ఇందుకోసం ‘పాకీజా’ సినిమాకు వాడిన ప్రత్యేక అరిఫ్లెక్స్, మిచెల్ కెమెరాలను ముంబై నుంచి తెప్పించారు.

అడవుల్లో చలికాలంలో నిర్విరామంగా షూటింగ్ సాగింది. నటీనటులు, యూనిట్ సభ్యులు అంకిత భావంతో పని చేశారు. గంటం దొరగా నటించిన గుమ్మడి ఒక ఇంటర్వ్యూ లో చెప్పినదాని ప్రకారం.. చాలా వరకు సీన్లు ‘సింగిల్ టేక్’ లోనే ఓకే అయిపోయేవి.

అల్లూరి గెటప్‌లోకి మారడం, ఆ ఆహార్యం దెబ్బతినకుండా చూసుకోవడం కోసం హీరో కృష్ణ ఏకబిగిన 30 రోజుల పాటు నాన్‌స్టాప్ కాల్షీట్ ఇచ్చి సింగిల్ షెడ్యూల్‌లో మన్యం అడవుల షూటింగ్‌ను పూర్తి చేశారు. సినిమా షూటింగ్ మూడో వంతు పూర్తయిన తర్వాత అసలు దర్శకుడు వి. రామచంద్రరావు హఠాత్తుగా మరణించారు.

ఆ క్లిష్ట సమయంలో సినిమా ఆగిపోకుండా హీరో కృష్ణ స్వయంగా మెగాఫోన్ పట్టి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. యాక్షన్, వార్ సీన్లను కె.ఎస్.ఆర్. దాస్‌కు అప్పగించి అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేశారు.
డైలాగ్ రైటర్ త్రిపురనేని మహారథి షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఒకే పూట భోజనం చేస్తూ, చన్నీటి స్నానంతో ధ్యానం చేసి ఏరోజుకారోజు డైలాగులు రాసేవారు.

సినిమా క్లైమాక్స్ డైలాగుల కోసం ఒకరోజు ఆయన అడవిలోకి ఒంటరిగా వెళ్లిపోయి, సాయంత్రానికి అద్భుతమైన సంభాషణలతో తిరిగి వచ్చారు. ఆ సమయంలో అల్లూరే తనను ఆవహించి రాయించాడని ఆయన ఒక ఇంటర్వ్యూ లో వివరించారు.క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో 400 మంది పోలీసులు అవసరం కావడంతో నాటి సీఎం జలగం వెంకటరావుతో మాట్లాడి పోలీస్ ఫోర్స్ ను పిలిపించారు కృష్ణ

మొత్తంగా మన్యంలో దాదాపు 38 రోజుల పాటు అవుట్‌డోర్ షూటింగ్, 15 రోజుల మద్రాస్ ఇండోర్ షూటింగ్‌తో ఈ దృశ్య కావ్యం పూర్తయి, తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది.

సౌకర్యాలు ఏమాత్రం లేని ఆ రోజుల్లో, హీరో కృష్ణ కేవలం ఒక నిర్మాతగానే కాకుండా స్వయంగా అన్నీ దగ్గరుండి చూసుకుంటూ, యూనిట్ సభ్యులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూటింగ్ పూర్తి చేసుకుని మద్రాస్ చేరుకున్నారు
 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!