‘రీమేక్స్’ లో కూడా ఆయన సత్తా చాటుకున్నారా ?

Sharing is Caring...

Subramanyam Dogiparthi…………………………..

ఎన్టీఆర్ ,యస్ డి లాల్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ ఈ ‘నేరం నాది కాదు ఆకలిది’ సినిమా. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, రీమేక్స్ తోనూ ఎన్టీఆర్ ఘనవిజయాలు సాధించారు.  అలాంటి రీమేక్స్ లో ఇదొకటి.

హిందీలో సూపర్ హిట్టయిన ‘రోటీ’ సినిమా ఆధారంగా 1976 లో ఈ సినిమా వచ్చింది. వై వి రావు నిర్మాత . హిందీలో లీడ్ రోల్సుని రాజేష్ ఖన్నా-ముంతాజులు పోషించారు.  అవే  పాత్రలను తెలుగులో ఎన్టీఆర్ మంజుల చేశారు. రాజేష్ ఖన్నా కన్నాఎన్టీఆర్  బాగా నటించారు. ఎన్టీఆర్ కి మంచి క్యారెక్టర్ దొరికితే మనసు పెట్టి చేస్తారు. రాజేష్ ఖన్నా అభిమానులు నన్ను మన్నించాలి.

కధాంశం పగ , కక్ష , నేరాలు , పోలీసులు వంటి రొటీన్ అంశాలే అయినా టేకింగ్ , లోకేషన్స్ , ముఖ్యంగా సత్యం సంగీతం , పాటల్లోనో  లిరిక్స్ , గొల్లపూడి మారుతీరావు డైలాగులు ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు.

ఈ సినిమా పేరు చెప్పగానే చాలామందికి ముందు గుర్తు వచ్చేది సి నారాయణరెడ్డి వ్రాసిన ‘మనలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి’ అనే పాట . ప్రభ మీద జనం రాళ్లు వేస్తుంటే  ఎన్టీఆర్ అడ్డం వెళ్లి , ఆ అరాచకాన్ని ఆపటానికి పాడే పాట . చాలా బాగుంటుంది . బాల సుబ్రమణ్యం పాడారు. పాట చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంటుంది.

డైమండ్ రాణి అనే జయమాలిని మీద పాట తప్పించి , మిగిలిన పాటలన్నీ నారాయణరెడ్డే వ్రాసారు . అన్ని పాటల్లో మేల్ వాయిస్ బాలుదే . ‘ఓ హైదరాబాద్ బుల్ బుల్’ అనే ఖవాలీ పాట ప్రభ- ఎన్టీఆర్ లతో తీశారు. అది కూడా బాగుంటుంది.ఈ పాటలో కూడా NTR ఇంటెన్సుతో నటించారు . NTR-మంజుల కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయిందీ సినిమాలో . 

‘చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా’ అనే గ్రూప్ డాన్స్ చాలా అందంగా ఉంటుంది . మంజుల డాన్స్ బాగుంటుంది . ‘పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా’ అనే అల్లు రామలింగయ్యని అల్లరి పెట్టే పాటలో కూడా NTR-మంజుల జంట హుషారైన నటన బాగుంటుంది .

ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది గుడ్డి తల్లిదండ్రులయిన  గుమ్మడి-పండరీబాయిల కుమారుడు మురళీమోహన్ పాత్రకు పేరు శ్రవణ్ అని పెట్టడం . గొల్లపూడిని మెచ్చుకోవాల్సిందే . రామాయణంలో శ్రవణుడిని దశరధుడు పొరపాటున చంపుతాడు . ఈ సినిమాలో కూడా NTR పొరపాటున మురళీమోహన్ నదిలో పడటానికి కారణమయి , శ్రవణుని తల్లిదండ్రులను సేవిస్తాడు.రచయిత ఆలోచనకు జోహార్ .

కాంతారావు , గుమ్మడి , పండరీబాయి , త్యాగరాజు , గిరిబాబు , నూతన్ ప్రసాద్ , రాజబాబు , రమణమూర్తి , ప్రభాకరరెడ్డి ప్రభృతులు నటించారు . విశేషం ఏమిటంటే ఆరుద్ర జడ్జిగా ఓ అతిధి పాత్రలో తళుక్కుమంటారు . ఔట్ డోర్ షూటింగులో ఎక్కువ భాగం ఊటీలో తీయటం వలన లొకేషన్స్ ఆకర్షణీయంగా ఉంటాయి.

హిందీ సినిమా ట్రాజెడీ. రాజేష్ ఖన్నా-ముంతాజ్ చనిపోతారు . ఈ సినిమా నిర్మాతకు డబ్బులు వచ్చే ప్రాప్తం ఉండి , మన తెలుగు సినిమాను సుఖాంతం చేసారు . మన తెలుగు వాళ్ళు హీరో చనిపోవటాన్ని జీర్ణించుకోలేరు కదా ! హిందీ సినిమా హిట్ అయినప్పటికీ , దానికన్నా కూడా బాగుంటుంది మన తెలుగు సినిమా .

ఈ  సినిమాకు ముందు ఎన్టీఆర్ తో య‌స్.డి.లాల్ నిండు మ‌న‌సులు, భ‌లే మాస్ట‌ర్, నిప్పులాంటి మ‌నిషి, అన్న‌ద‌మ్ముల అనుబంధం వంటి సినిమాలు తీసి విజ‌యం సాధించారు. ఎన్టీఆర్  హీరోగా నటించిన య‌స్.డి.లాల్ సొంత సినిమా  ‘నేనే మొన‌గాణ్ణి’  మాత్రం ప్లాప్ అయింది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!