ఎన్టీఆర్ మాటలకు విశ్వనాథ వారి స్పందన ఏమిటంటే ?

Sharing is Caring...

Bhandaru Srinivas Rao ………………………  Bhagavad Gita record release program

అమర గాయకుడు ఘంట‌సాల పాడిన భ‌గ‌వ‌ద్గీత రికార్డు విడుద‌ల కార్య‌క్ర‌మం 
ఘంట‌సాల క‌న్నుమూశాక బెజ‌వాడ‌లో జ‌రిగింది.. ఆ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ , విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారూ పాల్గొన్నారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్ర‌ద‌ర్ ఘంట‌సాల‌, మాస్టారు విశ్వ‌నాథ ఉండ‌డం వ‌ల్లే మేమింత‌టి వార‌మ‌య్యాము” అన్నారు.

ఆ త‌ర్వాత మైకందుకున్న విశ్వ‌నాథ …. “నా శిష్యుడ‌నని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వ‌ల్ల‌నే ఇంత వాడినైతిన‌ని చెప్పినారు .ఆ ఇంత ఎంతో నాకు తెలియ‌దు. ఆ ఇంత‌లో నాకు మ‌రొక‌రు అన‌గా ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర్రావుతో వాటా పెట్టినారు .మరి వారి వాటా ఎంతయో తెలిపారు కారు .

అంతియే కాక… నాకు తెలియ‌ని విష‌య‌ము మ‌రొక‌టి క‌ల‌దు..అది ఏమన … అస‌లు వారెంతైనారో … కూడా నాకు తెలియ‌దు. ఆ తెలియ‌ని అంత‌లో .. ఇంత అన‌నెంతో నాకు అంత‌కంటే తెలియ‌దు. ఆ ఇంత‌లో నేను చేసినాన‌ని ఆయ‌న చెప్పుచున్న‌దెంతో తెలియ‌దు. అది అట్లుండ‌నిండు.  

ఇక నాకు ఈ గ్రామ‌ఫోను ప్లేటంటూ ఒక‌టిచ్చినారు. దీనిని ఆడించు యంత్ర‌ము మా ఇంట లేదు. పోనీ దీనిని ఏ ప‌చ్చ‌డి జాడీ మీదో మూత‌గా వాడుకొమ్మ‌ని మా ఆవిడ‌కు ఇవ్వ‌వ‌చ్చున‌నుకొంటిని … అట్ల‌నుకొన‌గా దీనికి మ‌ధ్య‌లో రంధ్ర‌ము క‌ల‌దు. ఇది ఒక పెను ఇబ్బంది. అది జాడీ మీద మూత‌గా వాడిన‌ప్పుడు ఈ రంధ్ర‌ములోంచీ ఏవైనా లోనికి ప్ర‌వేశించి ప‌చ్చ‌డి పాడు అగును.

ఏడాది పొడుగూతా వాడుకోవాల్సి ఉన్న ఊర‌గాయ పాడుకావ‌డానికి నేను కార‌ణ‌భూతుడ్న‌వ‌డం చేత ఆవిడ మ‌న‌సులోనైనా… నా అమాయ‌క‌త్వ‌మునూ … తెలివిలేని త‌న‌మును గురించి అనుకునే అవ‌కాశ‌మూ క‌ల‌దు. ఏ విధ‌ముగా చూసిన‌నూ ఇది నాకు శ్రేయ‌స్క‌ర‌ము అయితే కాదు…

ఇదియునూ అట్లుండ‌నిమ్ము .. “అని ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత మీద‌కు సాగిపోయార‌ట విశ్వ‌నాథ వారు.ఈ ఉప‌న్యాస‌ము ముగించే స‌రికి హెచ్ఎమ్వీ వారు ఓ రికార్టుప్లేయ‌రును తెచ్చి విశ్వ‌నాథ వారికి స‌మ‌ర్పించుకున్నార‌ట.. ఆయ‌నే అన్న‌ట్టు అది వేరు విష‌య‌ము…

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!