Different stories about Padma sambhava …………………………
బౌద్ధ గురువు అయిన పద్మసంభవ గురించి పలు కథనాలు ప్రచారం లో ఉన్నాయి. ఈయన 8 వ శతాబ్దం నాటి వాడు. టిబెట్ ప్రాంతంలో పద్మసంభవ ను రెండో బుద్ధుడిగా భావిస్తారు. ఈయన టిబెట్ కు యుక్త వయసులో చేరుకున్నాడని , ఒరిస్సాలోని జిరంగా వద్ద పుట్టి పెరిగాడని చరిత్రకారులు చెబుతున్నారు.
పద్మసంభవుడు అనగా పద్మం నుంచి జన్మించినవాడు అని అర్థం. ఒరిస్సాలోని ధన కోషా సరస్సులో తేలి యాడుతున్న కమలం వికసించగా అందులో పద్మసంభవుడు ఎనిమిదేళ్ళ పిల్ల వాడిగా అవతరించాడని అంటారు.
పద్మసంభవుడి ప్రత్యేకతను గుర్తించిన స్థానిక రాజు ఓసియానా, తనకు పిల్లలు లేని కారణంగా తన రాజ్యాన్ని పద్మసంభవుడికి ఇవ్వాలనుకున్నాడు. అయితే పద్మసంభవుడు ఒరిస్సా ను విడిచిపెట్టి టిబెట్ కు వెళ్లాడని అంటారు. అక్కడి రాజు త్రిసాంగ్ డెట్సన్ పద్మ సంభవుడిని చేరదీశారు.
అలాగే ఆయన ఉత్తర పాకిస్తాన్ లోని ఉద్దియానా కు చెందినవారని అక్కడ నుంచి టిబెట్ వచ్చారని కూడా మరో కథనం ప్రచారంలో ఉంది. నేపాల్ కు చెందిన శాంత రక్షిత అనే భౌద్ధగురువు ద్వారా టిబెట్ రాజుకి పరిచయం అయ్యారని ..మంత్ర తంత్ర విద్యల్లో పద్మ సంభవుడు ఆరితేరిన వారని అనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
టిబెట్ చేరాక పద్మ సంభవుడు స్థానిక పండితులతో కలసి బౌద్ధ మత ప్రచారం చేపట్టారు. తాంత్రిక బౌద్ధాన్ని టిబెట్ కు పరిచయం చేసింది, అక్కడ మొట్టమొదటి బౌద్ధారామాన్ని నెలకొల్పింది పద్మసంభవుడే. మహాయానం లోని వజ్రయాన శాఖను స్థాపించారని … ఒడిశా లో బౌద్ధం వ్యాప్తికి కూడా కృషి చేశారని అంటారు.
నియింగ్మా భౌద్ధ పాఠశాల… అక్కడి విద్యార్థులు పద్మసంభవుడిని “రెండవ బుద్ధుడు”గా పూజిస్తారు.అలాగే నేపాల్, భూటాన్, ఇండియాలోని హిమాలయ ప్రాంతాల్లో టిబెటన్ బౌద్ధమతం అనుకూలురు ఆయనను “రెండవ బుద్ధుడు”గా గౌరవించారు నియింగ్మా పాఠశాల పద్మసంభవుడిని వారి సంప్రదాయానికి స్థాపకుడిగా చెబుతున్నది.
కాగా 1959 లో టిబెట్ పై చైనా దాడి దరిమిలా 14 వ దలైలామా తో సహా 85,000 మంది టిబెటన్లు ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు. అపుడు వచ్చిన వారు అలాగే స్థిరపడిపోయారు. ఆ తర్వాత దలైలామా సహకారంతో ఒరిస్సాలోని గజపతి జిల్లా జిరంగ లో పద్మసంభవ మహా విహార్ ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు.
ఈ ఆలయాన్ని 2010లో దలైలామా ప్రారంభించారు.ఈ ఆలయంలో 21 అడుగుల భారీ బుద్ధ విగ్రహం ఉంది. ఇక్కడ నిత్య ప్రార్థనలతోపాటు బౌద్ధ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఒకేసారి 200 మంది ప్రార్థనలు చేసుకోవడానికి వీలున్న ఈ ఆలయం బౌద్ధ తత్వ విద్యకు ప్రధాన కేంద్రంగా ఉంది.
2019 లో ఈ మహావిహార్ ఆలయ సమీపంలోని సరస్సు మధ్యలో 19 అడుగుల ఎత్తులో ఉన్న గురు పద్మసంభవ విగ్రహాన్ని ప్రతిష్టించారు.ఇక్కడ నిర్మించిన బౌద్ధ మఠం దక్షిణాదిలో అతి పెద్దది. ఐదు అంతస్థుల మఠంలో భారీ ధ్యాన మందిరం,ఇతర చిన్న దేవాలయాలు, భౌద్ధ సన్యాసుల కోసం వసతి గృహాలు ఉన్నాయి.
———– KNMURTHY