ఇదొక “శాపగ్రస్త ఆలయం”కథ !!

Sharing is Caring...

Folklore Horror Series ……….

“కౌరిబురి: ది కర్స్‌డ్ టెంపుల్” (Kauriburi: The Cursed Temple- 2026) ఇటీవలే విడుదలైన ఉత్కంఠభరితమైన మైథలాజికల్ ఫోక్‌లోర్ హారర్ వెబ్ సిరీస్ ఇది.సయంతన్ ఘోషల్ దర్శకత్వం వహించిన ఈ బెంగాలీ సిరీస్ Netflix లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.

కథాంశం 

అతీంద్రియ శక్తులు కలిగిన జ్యోతిష్కుడు భవతారణ్ (జీతు కమల్), తాను ఒకప్పుడు ప్రేమించిన యువతి మాధురి (సోలంకి రాయ్) ఒక  శాపం వల్ల ప్రమాదంలో పడిందని తెలుసుకుంటాడు. ఒక రహస్య ఆరాధక బృందం రక్తదాహంతో ఉన్న ఒక  దేవతకు ఆమెను బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ నిషిద్ధ పూజ జరగకముందే, భవతారణ్ ఆ దెయ్యాల అడవిలోకి ప్రవేశించి శతాబ్దాల నాటి భయానక రహస్యాలను ఎదుర్కొని తన ప్రియురాలిని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సిరీస్ కథ. 

జ్యోతిష్కుడు భవతారణ్‌కు తన అతీంద్రియ శక్తుల ద్వారా మాధురి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసే సన్నివేశం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఆ వింత పుష్పం నుండి తయారు చేసిన సింధూరాన్ని మాధురి పెట్టుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడం కథలోకి ప్రేక్షకులను లాగుతుంది.

భవతారణ్ ఆ దెయ్యాల అడవిలోకి అడుగు పెట్టె సన్నివేశాలు బాగుంటాయి. శివ అనే వ్యక్తి ఆ నరబలి సంప్రదాయాన్ని అడ్డుకున్నప్పుడు, అకస్మాత్తుగా వేలాది కాకులు (Crows) దాడి చేసే ఫ్లాష్‌బ్యాక్ సీన్ భయానకంగా ఉంటుంది. రక్తానికి ప్రతిస్పందించే రహస్యమైన ‘గోలోక్ పుష్పం’ వెనుక ఉన్న నిజాలు బయటపడే సన్నివేశాలు గ్రిప్పింగ్‌గా ఉంటాయి. ఆ పుష్పానికి ప్రాణాలు కాపాడే శక్తితో పాటు, అంతే ప్రమాదకరమైన విషాన్ని సృష్టించే శక్తి ఉందని భవతారణ్ కనుగొనే సీన్ బాగుంటుంది.

అమావాస్య గడియలు దగ్గరపడుతుండగా, శాపాన్ని విచ్ఛిన్నం చేయడానికి  భవతారణ్, మాధురి అడవిలో పడే కష్టాలు థ్రిల్ ఇస్తాయి. ఆ రహస్య ఆరాధక బృందం వీరిని చుట్టుముట్టే సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది. 250 ఏళ్ల నాటి శాపం వల్ల కుళ్లిపోతున్న శరీరంలో బందీ అయిన పరాగ్ పాత్ర, అతని గతం గురించిన సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. 5 వ ఎపిసోడ్‌లో హారర్ ఎలిమెంట్స్ పీక్స్‌లో ఉంటాయి.

క్లైమాక్స్‌లో అమావాస్య రాత్రి ఆలయ పూజారిణి నరబలికి సిద్ధమవ్వడం, తన గురువు నేర్పిన రక్షణ మంత్రాలతో భవతారణ్ ఆ దుష్ట శక్తిని ఎదుర్కొని ఆలయాన్ని ధ్వంసం చేసే ఫైనల్ ఫైట్ సిరీస్‌కే హైలైట్. ఈ వెబ్ సిరీస్‌లో  జీతు కమల్, పౌలీ దామ్, సోలంకి రాయ్, శాశ్వత ఛటర్జీ తదితర  నటీనటులంతా బాగా నటించారు.

వెబ్ సిరీస్ విజయంలో కెమెరా పనితనం , నేపథ్య సంగీతం ప్రధాన పాత్ర పోషించాయి. మైథలాజికల్ హారర్ జానర్‌కు కావలసిన భయానక, మిస్టరీ వాతావరణాన్ని సృష్టించడంలో ఇవి రెండూ బాగా తోడ్పడ్డాయి.ఈ సిరీస్ కి  సౌమిక్ హల్దార్, తుబన్ కెమెరా మెన్ గా పని చేశారు.

సిరీస్ కథంతా అస్సాంలోని దట్టమైన అడవులు, పురాతన ఆలయాలు,  పొగమంచు కమ్మిన కొండ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. కెమెరామెన్లు ఆ చీకటి అడవులను, రహస్య గుహలను అత్యంత సహజంగా, భయం కలిగించేలా బంధించారు. 
రాత్రి పూట జరిగే క్షుద్రపూజలు, దివిటీల వెలుతురులో కనిపించే ఆరాధక బృందం దృశ్యాలు ఆకట్టుకుంటాయి. కథలోని గంభీరతకు తగ్గట్లుగా డార్క్ గ్రీన్, బూడిద రంగు టోన్స్ ఉపయోగించడం వల్ల సిరీస్ ఆరంభం నుండి చివరి వరకు ఒక మిస్టరీ మూడ్ కొనసాగుతుంది. 

సంగీత దర్శకుడు నబరుణ్ బోస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్‌కు మంచి బలాన్నిచ్చింది. సాధారణ హారర్ సిరీస్‌లలో ఉండే కర్ణకఠోరమైన శబ్దాలు కాకుండా, సంస్కృత మంత్రాలు, జానపద వాద్యాల శబ్దాలను మిక్స్ చేసి సన్నివేశాల్లోని ఉత్కంఠను పెంచారు.మంత్రించిన కాకుల గుంపులు ఎగిరేటప్పుడు వచ్చే శబ్దాలు, గాలి హోరు, క్లైమాక్స్‌లో జరిగే తాంత్రిక పూజల సమయంలో వచ్చే డ్రమ్స్ సౌండ్స్ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. 

మొత్తం గా చెప్పాలంటే, కథలో లోపాలు,కొన్నిచోట్ల సాగదీత ఉన్నప్పటికీ, విజువల్‌గా ఈ సిరీస్ ప్రేక్షకులకు ఒక మంచి థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!