అలరించే సస్పెన్స్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Suspense thriller…….

‘జాన్ లూథర్’ (John Luther) 2022  నాటి సినిమా. జయసూర్య ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ‘ ప్రస్తుతం ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లలో  తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. అభినవ్ జోసెఫ్ ఈ సినిమా కు దర్శకత్వం వహించారు.

కథ ఏమిటంటే ?

దేవికులం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జాన్ లూథర్ (జయసూర్య) డ్యూటీ మైండెడ్, చురుకైన పోలీస్ ఆఫీసర్. ఒక రాత్రి వేళ మూన్నార్ ఘాట్ రోడ్డుపై వెళ్తున్న బస్సు పైకి ఒక గుర్తుతెలియని మృతదేహం వచ్చి పడుతుంది. ఈ విచిత్రమైన కేస్‌ను లూథర్ దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు.

అదే సమయంలో ఆ ప్రాంతంలో ప్రకాశన్ అనే ఉపాధ్యాయుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వరుసగా అదృశ్యమవుతారు. ఈ మిస్సింగ్ కేసులకు, బస్సుపై పడిన శవానికి ఏమైనా సంబంధం ఉందా? అని లూథర్ విచారిస్తుంటాడు.ఒక నిందితుడిని పట్టుకునే క్రమంలో జరిగిన ఘర్షణలో లూథర్ ప్రమాదానికి గురై… తన ఒక చెవి వినికిడి శక్తిని కోల్పోతాడు.

పై అధికారుల ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎదురైనప్పటికీ… సగం వినికిడి శక్తితోనే జాన్ లూథర్  మిస్సింగ్ కేసులకు కారణమైన సైకో కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడు? అనేదే మిగతా ఉత్కంఠభరితమైన కథ.

సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా జయసూర్య అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా ప్రమాదం తర్వాత ఒక చెవి వినిపించకుండా, ఆ శబ్దాల హెచ్చుతగ్గుల మధ్య ఆయన పలికించిన హావభావాలు, నిస్సహాయత సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సినిమా ప్రారంభం,ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా, వేగంగా సాగుతుంది.

వరుసగా జరిగే కిడ్నాప్‌లు, ఇన్వెస్టిగేషన్ సీన్లు ప్రేక్షకులలో అమితమైన కుతూహలాన్ని కలిగిస్తాయి.సెకండాఫ్ కొంచెం స్లో అవుతుంది. చివరి 20-30 నిమిషాలలో సినిమా కాస్త తడబడింది. కిల్లర్ హత్యలు చేయడానికి గల కారణం అంత బలంగా, నమ్మశక్యంగా అనిపించదు.

పాత సీరియల్ కిల్లర్ సినిమాల్లోని కొన్ని క్లిషే సీన్లు ఇందులోనూ కనిపిస్తాయి. హీరోయిన్ ఆత్మిక రాజన్, ఇతర మహిళా పాత్రలు కేవలం కథలో భాగంగా ఉన్నాయే తప్ప, వాటికి ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదు.

సినిమా మొదట్లోనే  బస్సుపైకి హఠాత్తుగా ఒక గుర్తుతెలియని మృతదేహం వచ్చి పడే సీన్ ప్రేక్షకులలో ఒక్కసారిగా తీవ్రమైన ఉత్కంఠను, క్యూరియాసిటీని కలిగిస్తుంది. చెవి వినికిడి శక్తి పూర్తిగా పోయిందని తెలిసే సీన్, ఆ సమయంలో జయసూర్య పండించిన నిస్సహాయత ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది.తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. 

ఒక చెవి తో మాత్రమే వింటూ, కేవలం ఒక వైపు నుండి వచ్చే శబ్దాల ఆధారంగా జాన్ లూథర్ క్లూస్ వెతికే సన్నివేశాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కథలో అక్కడక్కడా వచ్చే ట్విస్ట్స్ బాగుంటాయి.వరస కిడ్నాప్‌లకు కారణమైన వ్యక్తిని గుర్తించడానికి లూథర్ వేసే ప్లాన్స్, సస్పెన్స్ ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తుంది.

చివరలో వినికిడి లోపం ఉన్న హీరో, కంటిచూపు సరిగ్గా లేని విలన్ మధ్య దట్టమైన అడవిలో చీకట్లో సాగే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ చాలా గ్రిప్పింగ్‌గా, ఉత్కంఠభరితంగా డిజైన్ చేశారు. చిన్న చిన్న లాజికల్ లోపాలు ఉన్నప్పటికీ సినిమా చూడవచ్చు.  

షాన్ రెహమాన్ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అందించారు. మెలోడీ పాటలకు పేరుగాంచిన ఆయన, ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు భిన్నమైన, గంభీరమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈ చిత్రానికి రాబీ వర్గీస్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
కథ మొత్తం కేరళలోని హిల్ స్టేషన్ మున్నార్  దాని చుట్టుపక్కల ఘాట్ రోడ్ల నేపథ్యంలో సాగుతుంది.అక్కడి  దట్టమైన మంచు, కొండ ప్రాంతాలను కెమెరాలో చాలా రిచ్‌గా, అదే సమయంలో ఒక రకమైన డార్క్  థ్రిల్లర్ మూడ్ వచ్చేలా ప్రెజెంట్ చేశారు. రాత్రి వేళల్లో సాగే ఘాట్ రోడ్డు చేజింగ్స్, వర్షంలో వచ్చే సీన్లను చాలా సహజమైన లైటింగ్‌తో షూట్ చేశారు.

హీరో మానసిక సంఘర్షణను, కిల్లర్ కోసం అతను వెతికేటప్పుడు ముఖంలో కనిపించే తీవ్రతను చూపించడానికి ఉపయోగించిన క్లోజప్ షాట్స్, కెమెరా యాంగిల్స్  బాగుంటాయి.

జాన్ లూథర్’ ఒక నీట్ అండ్ డీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. క్లైమాక్స్ ట్విస్ట్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ…జయసూర్య పెర్ఫార్మెన్స్, గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కోసం థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఓసారి హ్యాపీగా చూసేయవచ్చు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!