Survival thriller ………..
“త్రాష్” (Thrash – 2026) సరికొత్త సర్వైవల్ థ్రిల్లర్ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.ఈ చిత్రానికి టామీ విర్కొలా (Tommy Wirkola) దర్శకత్వం వహించగా, ఆడమ్ మెక్కే నిర్మించారు. ఇందులో ఫీబీ దినేవోర్ (Phoebe Dynevor), విట్నీ పీక్, ప్రముఖ నటుడు డిజిమోన్ హౌన్సౌ (Djimon Hounsou) ప్రధాన పాత్రలు పోషించారు.
కథాంశం
దక్షిణ కాలిఫోర్నియా తీరంలోని ఒక చిన్న పట్టణాన్ని’హెన్రీ’ అనే భీకరమైన కేటగిరీ 5 తుఫాను (Hurricane) వణికిస్తుంది.భారీ వరదల వల్ల ఆ ఊరంతా నీట మునుగుతుంది. కేవలం వరదలు మాత్రమే కాకుండా, సముద్రపు ఉప్పెన కారణంగా ఆకలితో ఉన్న భయంకరమైన బుల్ షార్క్స్ (గుంపులుగా దాడి చేసే షార్క్ చేపలు) ఆ ఊరి వీధుల్లోకి ప్రవేశిస్తాయి.
ఒక వైపు కారులో చిక్కుకుపోయిన గర్భవతి లిసా (ఫీబీ దినేవోర్), మరోవైపు బయట ప్రపంచం అంటే భయపడే అగోరాఫోబియా ఉన్నయువతి డకోటా (విట్నీ పీక్) ఈ నీటిలో ఈదులాడే షార్క్‌ల నుండి తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు? వారిని రక్షించడానికి మెరైన్ పరిశోధకుడైన డేల్ (డిజిమోన్) చేసిన ప్రయత్నాలే ఈ సినిమా కథ.
సినిమా నిడివి కేవలం 86 నిమిషాలు మాత్రమే ఉండటం వల్ల కథ చాలా వేగంగాసాగుతుంది.. గర్భవతిగా ప్రాణాల కోసం పోరాడే పాత్రలో ఫీబీ దినేవోర్, డిజిమోన్ హౌన్సౌలు, ఇతర నటులు తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమా ప్రారంభంలో గర్భవతి అయిన లిసా (ఫీబీ దినేవోర్) ప్రసవ వేదనతో కారులో ఆసుపత్రికి వెళ్తుండగా వరద నీరు కారును ముంచెత్తుతుంది.
కారు తలుపులు లాక్ అయిపోవడం, నీరు క్రమంగా పైకి రావడం, అదే సమయంలో కారు విండో బయట ఒక రాక్షస బుల్ షార్క్ తిరిగే సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. చూసే ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠ కు లోనవుతారు.
బయట ప్రపంచం, జనాలు అంటే భయపడే మానసిక సమస్య (అగోరాఫోబియా) తో బాధపడుతున్న డకోటా వరద నీరు తన ఇంటి బేస్మెంట్లోకి చేరినప్పుడు, ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఆ యువతే సాహసం చేసి కారు లో ఇరుక్కుపోయిన గర్భవతి ని కాపాడే సీన్స్ బాగున్నాయి.
వరద నీటిలో ఈదులాడుతున్న షార్క్ చేపలను వేటాడటంలో, బాధితులను రక్షించడంలో మెరైన్ రీసెర్చర్ డేల్ (డిజిమోన్ హౌన్సౌ) చేసే సాహసాలు ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 15 నిమిషాలు చాలా వేగంగా, ఊపిరి సలపనివ్వకుండా సాగుతుంది.
కథ పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సాంకేతికంగా సినిమాను నిలబెట్టడంలో కెమెరా పనితనం , సంగీతం కీలక పాత్ర పోషించాయి
ఈ చిత్రానికి జెడ్ బెనెడిక్ట్ కెమెరామెన్‌గా వ్యవహరించారు. వరద నీటిలో, మునిగిపోతున్న కారులో గర్భవతి చిక్కుకున్నప్పుడు కెమెరా యాంగిల్స్ చాలా క్లోజ్-అప్‌గా ఉండి ప్రేక్షకుడికి ఊపిరి సలపనివ్వని అనుభూతిని ఇస్తాయి. నీటి లోపల షార్క్‌ల కదలికలను చూపించిన విధానం బాగుంది. షార్క్ ఎటువైపు నుండి దాడి చేస్తుందో తెలియని సస్పెన్స్‌ను కెమెరా కదలికల ద్వారా బాగా ఎలివేట్ చేశారు.
సినిమాకు లాస్సే ఎన్ర్సన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అందించారు. ఈ తరహా సినిమాలకు సంగీతంతో పాటు సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ముఖ్యం. ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షం శబ్దాల మధ్య.. నీటి అడుగున షార్క్ తోక కదిలే చప్పుడు, హఠాత్తుగా చేసే దాడుల సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను భయపెడతాయి. పాత్రల శ్వాస వేగం పెరిగే శబ్దాలు ఉత్కంఠను మరింత పెంచాయి.
లాజిక్లను పక్కనబెట్టి, ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం ఒక షార్క్-అటాక్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ “త్రాష్” సినిమాను చూడవచ్చు.

