Court Room Drama……..
ది తాజ్ స్టోరి’ (The Taj Story) ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. సీనియర్ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు తుషార్ అమ్రిష్ గోయల్ దర్శకత్వం వహించారు.తాజ్ మహల్ నిర్మాణం, దాని చరిత్ర, వివాదాల చుట్టూ కథ సాగుతుంది.
కథాంశం ఏమిటంటే ?
ఆగ్రాలో తాజ్ మహల్ వద్ద టూరిస్ట్ గైడ్‌గా పనిచేసే విష్ణు దాస్ (పరేష్ రావల్) కథ ఇది. తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించలేదని, అది అంతకు ముందే ఉన్న ఒక హిందూ రాజు ప్యాలెస్ అని విష్ణు దాస్ నమ్ముతాడు. ఈ విషయమై స్కూల్ టెక్స్ట్‌బుక్స్‌లో ఉన్న చరిత్రను సవాల్ చేస్తూ, తాజ్ మహల్ కింద ఉన్న 22 మూసివేసిన గదులను తెరిచి తవ్వకాలు జరపాలని కోరుతూ అతను హైకోర్టులో పిల్ (PIL) దాఖలు చేస్తాడు.
ఈ క్రమంలో ఒక గైడ్ నుండి లాయర్‌గా మారి అతను కోర్టులో ఎలాంటి వాదనలు చేశాడు? ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు? అనేదే సినిమా కథ.
విష్ణు దాస్ పాత్రలో పరేష్ రావల్ తన అద్భుతమైన నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించారు. కోర్ట్‌రూమ్ సీన్లలో ఆయన చెప్పే డైలాగులు, హావభావాలు మెప్పిస్తాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. ఆపోజిట్ లాయర్ రషీద్ గా జాకీర్ హుస్సేన్ కూడా పోటాపోటీగా నటించారు.
సినిమా ద్వితీయార్థంలో వచ్చే కోర్టు సీన్లు, ఇరుపక్షాల లాయర్ల మధ్య జరిగే వాదోపవాదాలు కొంతవరకు ప్రేక్షకులలో ఉత్కంఠను కలిగిస్తాయి.నమిత్ దాస్, అమృతా ఖాన్విల్కర్, ఇతర నటులు తమ పరిధి మేర బాగా నటించారు.
సినిమా కథ సోషల్ మీడియాలో చలామణి అయ్యే కొన్ని సిద్ధాంతాలపైనే ఎక్కువగా ఆధారపడినట్టు కనిపిస్తుంది.సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 45 నిమిషాలు ఉండటం వల్ల, కొన్ని చోట్ల చర్చలతో సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చారిత్రక అంశాలను లోతుగా రీసెర్చ్ చేసి చూపించడం కంటే, కేవలం పొలిటికల్ డైలాగ్స్, సెంటిమెంట్‌తోనే కథను నడిపించడానికి ప్రయత్నించారు.
‘ ది తాజ్ స్టోరీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద, సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలను,వివాదాలను ఎదుర్కొంది. ‘ఈ సినిమా కథ పి.ఎన్. ఓక్ (P. N. Oak) ప్రతిపాదించిన వాదనల ఆధారంగా రూపొందింది.ఈ వాదనలకు ఎలాంటి శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలు లేవని, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు (ASI) విమర్శించారు.
గతంలో సుప్రీం కోర్టు కూడా పి.ఎన్. ఓక్ వేసిన పిటిషన్‌ను కొట్టిపారేస్తూ ఆయన ఆలోచనలను తప్పుబట్టింది.సోషల్ మీడియా, ట్విట్టర్ (X) వేదికగా చాలా మంది ఈ సినిమాను ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ వంటి వివాదాస్పద చిత్రాలతో పోల్చారు.ఆ వివాదాలలోకి వెళ్లకుండా సినిమాని సినిమాగా చూడవచ్చు.
భిన్నమైన కథలను పొలిటికల్/హిస్టారికల్/కోర్టు రూం డ్రామాలు ఇష్టపడేవారు ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించే వారికి ఇది కాస్త భారంగా అనిపించవచ్చు. జియో హాట్ స్టార్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.

