Stunning New Discovery…………………………
సౌరవ్యవస్థలో భూమి తరువాత మానవుడు నివసించే అవకాశాల ఉన్న గ్రహంగా అంగారకుడిని భావిస్తున్నారు. ఆమేరకు అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. నాసాతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన స్పేస్ ఏజెన్సీలు అరుణగ్రహంపైకి రోవర్లను పంపించాయి.
ఈరోవర్లు గ్రహ ఉపరితలం, నీటి ఆనవాళ్ల గురించి పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే జరిగిన పలు అధ్యయనాలు మార్స్ పై ఒకప్పుడు విస్తారం గా నీరు ఉండేదని చెప్పాయి.
అయితే తాజాగా నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో అద్భుత ఆవిష్కరణ చేసింది. ఒకప్పుడు అంగారకుడిపై సరస్సులు ఉండేవనే ఆధారాలను కనుగొంది. క్యూరియాసిటీ అలల గుర్తులను, కొన్ని రాతి నమూనాలను కనుగొనడం విశేషం.
ప్రస్తుతం క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై గేల్ బిలంలో ఉన్న మౌంట్ షార్ప్ ప్రాంతంలో ఉంది. ఇక్కడే మిలియన్ సంవత్సరాల క్రితం ఒక సరస్సు ఉండేదని అందుకు ఆధారంగా కాలక్రమేణా సరస్సు మిగిల్చిన అలల అల్లికలను కనుగొంది. నాసా దాదాపుగా దశాబ్ధం కింద క్యూరియాసిటీ రోవర్ ను పంపింది.
రెండేళ్ల క్రితం పర్సువరెన్స్ అనే మరో రోవర్ ను విజయవంతంగా మార్స్ పైకి పంపింది. ఒకప్పుడు నదులు, సముద్రాలతో అంగారక గ్రహం భూమిని పోలి ఉండేది. ఇప్పటికే అక్కడ ధృవాల వద్ద గడ్డకట్టిన స్థితిలో నీరు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అయితే భూమితో పోలిస్తే అంగారకుడి పరిమాణం చిన్నగా ఉండటంతో పాటు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం లేకపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా నీరు అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరికొన్ని పరిశోధనలు జరిగితే కానీ ఇంకొంత సమాచారం తెలియదు.