Oldest Mummy……………
పెరూ సెంట్రల్ తీరంలో సుమారు 800 సంవత్సరాల వయస్సు గల మమ్మీ తవ్వకాలలో బయటపడింది. లిమా ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతుండగా ఈ మమ్మీ ని అధికారులు కనుగొన్నారు.మమ్మీ అవశేషాలు దక్షిణ అమెరికా తీరం.. పర్వతాల మధ్య అభివృద్ధి చెందిన సంస్కృతికి చెందిన వ్యక్తివిగా గుర్తించారు. ఈ మమ్మీ వయసులో పెద్ద వాడు అయిన మగ వ్యక్తి మృత దేహమని నిర్థారించారు.
“మమ్మీ శరీరమంతా తాళ్లతో కట్టి, చేతులతో ముఖాన్ని కప్పిఉంచిన స్థితిలో..పాతకాలపు ఫుడ్ డెలివరీ బ్యాగ్ లో దొరికింది. ఇది అప్పటి జాతుల అంత్యక్రియల నమూనాలో భాగమై ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. పెరూ లోని ఎత్తయిన ఆండియన్ ప్రాంతంలో నివసించిన వ్యక్తి అవశేషాలు గా భావిస్తున్నారు. రేడియో కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా వయసును అంచనా వేశారు.
లిమా నగర శివార్లలోని భూగర్భ నిర్మాణంలో ఈ మమ్మీని కనుగొన్నారు. భూగర్భంలో సిరామిక్స్, కూరగాయల అవశేషాలు, రాతి పనిముట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీన్ని భద్రం గా దాచారు. 2021 లో ఈ తవ్వకాలు జరిగాయి. ఇక్కడకు దగ్గర్లోనే ‘మచు పిచ్చు’ పర్యాటక స్థలం ఉంది.
ఈ ‘మచు పిచ్చు’ ని ‘ఇంకా చక్రవర్తి పచాకుటి ‘కోసం 1438–1472 మధ్య కాలంలో ఒక ఎస్టేట్‌గా నిర్మించారు.దీన్నే”లాస్ట్ సిటీ ఆఫ్ ది ఇంకాస్” అని కూడా పిలుస్తారు. ఒక శతాబ్దం తర్వాత స్పానిష్ ఆక్రమణ సమయంలో ఇంకా వంశీయులు దానిని విడిచి వెళ్లారు.
ఈ సైట్‌ను ‘ఇంకా హుయానా పిచ్చు’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది అదే పేరుతో ఉన్నచిన్న శిఖరంపై ఉంది. 15,16వ శతాబ్దాలలో దక్షిణ అమెరికాలోని పశ్చిమ ప్రాంతాలను ఆధిపత్యం చెలాయించిన ఇంకా సామ్రాజ్యానికి ముందు, తరువాత అభివృద్ధి చెందిన విభిన్న సంస్కృతులకు చెందిన వందలాది పురావస్తు ప్రదేశాలకు పెరూ నిలయం.
1983లో దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. 2007లో ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ పోల్‌లో ‘మచు పిచ్చు’ ప్రపంచంలోని కొత్త ఏడు వింతలలో ఒకటిగా ఎంపికైంది. ఆ దరిమిలా ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారిపోయింది. నిత్యం టూరిస్టులు వస్తుంటారు.