‘తిక్కశంకరయ్య” కాదా ?

Sharing is Caring...

Subramanyam Dogiparthi……………………..  An entertaining film………………

ఈ సినిమాకు తిక్క శంకరయ్య పేరు పెట్టినవారికి పద్మవిభూషణ పురస్కారం ఇవ్వాలి . పిచ్చి శంకరయ్య అని పెట్టాలి . ఎందుకంటే మధ్యలో పిచ్చోడు అవుతాడు కాబట్టి . కాని తిక్క అని పెట్టి , ఫుల్ డబ్బులు వసూలు చేసుకున్నారు . సినిమా అంతా NTR , జయలలిత ల పిచ్చి గోల , తిక్క గోల ,హైపర్ పిచ్చి గోల.  అయితే మాత్రం , అందమైన గోల . గోల లోనే కాదు , అందంలో కూడా ఇద్దరూ పోటీపడ్డారు. 

NTR ద్విపాత్రాభినయం చేశారు. మోహన్‌గా ఎంతో కూల్ గా .. హుందాగా నటించారు. శంకరయ్యగా డిఫరెంట్ స్టైల్ లో నటించి మెప్పించారు. రెండు పాత్రలకు ఉన్న వైవిధ్యాన్ని చక్కగా చూపారు.టి వి రాజు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపరే.  జయలలిత  ఈ సినిమాలో చాలా ఫాస్ట్ గా డాన్స్ చేస్తుంది.  

రాకెన్ రోల్ , ట్విస్టులు , భరత నాట్యంతో సహా అన్నీ బాగుంటాయి.. అన్నింటిలో అదరగొట్టేసింది.  తొలి కోడి కూసింది తెలతెలవారింది  , కోవెల ఎరగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఏనాడు పాటలు శ్రావ్యంగా , హుందాగా ఉంటాయి. ఐసర బజ్జా పిల్లమ్మా అరెరే అరెరే అరెరే బుల్లెమ్మా , యాస్కోడి తస్సాదియ్యా రెండు పాటల షూటింగ్ అయ్యాక జయలలిత ఇంటికెళ్ళి వేడినీళ్ళ కాపడం పెట్టించుకొని ఉంటుంది. 

‘ముచ్చటగొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ దొరబాబు’  పాట , ‘వగకాడ బిగువేలరా’ భరతనాట్యం పాటలలో రెండు వైవిధ్యమైన నృత్యాలను జయలలిత సునాయాసంగా చేసి శభాష్ అనిపించుకుంది . యాస్కోడి తస్సాదియ్యా అనే పదాలు సి నారాయణరెడ్డి గారికి ఎక్కడ దొరికాయో ! అయినా పిచ్చోడి , తిక్కోడి మాటలకు అర్ధాలు ఏముంటాయిలే !!

డి యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా బాగా సక్సెస్ అయిన గోల సినిమా. యోగానంద్ కథకు తగిన విధంగా చక్కని కామెడీని జతకూర్చి, సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ తో యోగానంద్ చాలా సినిమాలు తీశారు. డీ వీ నరసరాజు సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తాయి.

కృష్ణకుమారి తన పాత్రకు తగ్గ సౌమ్యతను, అణకువను చూపుతూ మెప్పించేలా నటించింది.  ఇతర పాత్రల్లో నాగభూషణం, సూర్యకాంతం , నాగయ్య , పద్మనాభం , రాజనాల , హేమలత , అల్లు రామలింగయ్య , డా శివరామకృష్ణయ్య ప్రభృతులు నటించారు.మామూలుగా ప్రతి సినిమాలో NTR చేతిలో తన్నులు తినే రాజనాల ఈ సినిమాలో తిక్క NTR కు తండ్రిగా  నటించడం విశేషం.  

100% వినోదాత్మక సినిమా. నా గ్యారంటీ.  మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలస్ లో  ఆడింది .ఓ మూడు నాలుగు సార్లు చూసి ఉంటా . టి విలో వచ్చినప్పుడల్లా కాసేపు చూస్తుంటా . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . జయలలిత కాపడం  ఎందుకు పెట్టించుకుందో తెలుసుకోవాలి కదా !!!! 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!