చూడదగిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Investigation thriller……

‘కాళిదాస్’ (Kaalidas) ఇదొక తమిళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, క్వాలిటీ కంటెంట్ కారణంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ మంచి ఆదరణ పొందింది.హీరో భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించాడు.

కథ ఏమిటంటే  ?

బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ల పై నుండి పడి కొందరు వివాహిత యువతులు వరుసగా మరణిస్తూ ఉంటారు. ప్రాథమిక దర్యాప్తులో ఇవి ఆత్మహత్యలుగా అనిపించినప్పటికీ, ఈ వరుస మరణాల వెనుక ఏదో బలమైన మిస్టరీ ఉందని పోలీస్ ఆఫీసర్ భరత్ గుర్తిస్తాడు.

మరోవైపు, తన డ్యూటీలో నిరంతరం బిజీగా ఉండటం వల్ల అతని భార్య విద్య (ఆన్ శీతల్) ఒంటరితనంతో బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఒక అపరిచిత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అసలు ఆ అపార్ట్‌మెంట్ మరణాల వెనుక ఉన్న కిల్లర్ ఎవరు? విద్య జీవితంలోకి వచ్చిన ఆ అపరిచితుడికి, ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా? కాళిదాస్ ఈ మిస్టరీని ఎలా చేధించాడు? అనేదే అసలు కథ.

చాలా కాలం తర్వాత భరత్ ఒక సీరియస్, డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంతో మెచ్యూర్డ్ నటనను కనబరిచాడు. యాక్షన్ హంగామా లేకుండా నటించాడు. భార్య పాత్రలో ఆన్ శీతల్ తన ఒంటరితనాన్ని, ఎమోషన్స్‌ను చక్కగా పండించింది.

సినిమాలో  ACP జార్జ్  పాత్ర లో ప్రముఖ నటుడు, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్ సహజంగా నటించారు.‘మిస్టర్ ఎక్స్’  పాత్రను నటుడు ఆధవ్ కన్నదాసన్ పోషించారు. ఆయన ప్రముఖ తమిళ కవి, గీత రచయిత కన్నదాసన్ మనవడు. 

దర్శకుడు శ్రీ సెంథిల్ రాసుకున్న కథ , స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను చివరి వరకు ఊహించని ట్విస్ట్‌లతో కట్టిపడేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉండి, షాక్‌కు గురిచేస్తుంది.
విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ప్రతి ఇన్వెస్టిగేషన్ సీన్‌లోనూ ఉత్కంఠను పెంచింది.

కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా, ఆధునిక సమాజంలో భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, ఒంటరితనం విపరీత పరిణామాలకు దారితీస్తుందనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఫస్ట్ హాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ సీన్లు కొన్నిచోట్ల ఒకే ఫార్మాట్‌లో సాగుతూ కాస్త నెమ్మదిగా అనిపిస్తాయి. ఇది పక్కా సస్పెన్స్ డ్రామా కావడం వల్ల రెగ్యులర్ మాస్ మసాలా ఫైట్లు, డ్యూయెట్లు ఆశించే వారికి అంతగా నచ్చకపోవచ్చు. చేజింగ్ సీన్స్ ను బాగా తీశారు.  

సినిమాటోగ్రాఫర్ సురేష్ బాలా ఎక్కువ భాగం డార్క్, గ్రే, సీరియస్ కలర్ టోన్స్‌ను ఉపయోగించారు. ఇది కథలోని సస్పెన్స్‌ను మరింత బాగా ఎలివేట్ చేసింది. అపార్ట్‌మెంట్ల పైకప్పు నుండి పడి చనిపోయే సీన్లను, ఆ ఇన్వెస్టిగేషన్ విజువల్స్‌ను చూపించడానికి వాడిన ఏరియల్ లేదా టాప్-యాంగిల్ షాట్స్ ప్రేక్షకుడిలో ఒక రకమైన ఆందోళనను, ఉత్కంఠను కలిగిస్తాయి.

కేవలం క్రైమ్ సీన్లు మాత్రమే కాకుండా, హీరో భార్య పడే ఒంటరితనాన్ని, ఆమె డిప్రెషన్‌ను చూపించడానికి అపార్ట్‌మెంట్ లోపల ఇరుకైన లైటింగ్,  క్లోజప్ షాట్లను చాలా చక్కగా ఉపయోగించారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ వచ్చే సస్పెన్స్ సీన్లలో  BGM బాగుంది.

సినిమా అంతా కిల్లర్ ఎవరో అని ఆడియన్స్ రకరకాల పాత్రలను అనుమానించేలా దర్శకుడు కథను నడిపించాడు. కానీ, చివర్లో అసలైన కిల్లర్ హీరో భార్య విద్య (ఆన్ శీతల్) అని,అలాగే ఆమెకు పరిచయమైన ఆ అపరిచిత వ్యక్తి (Mr. X) అసలు నిజంగానే లేడని, అది ఆమె భ్రాంతి (Hallucination) అని రివీల్ చేయడం ప్రేక్షకులు ఏ మాత్రం  ఊహించని ట్విస్ట్‌.

చాలా మందికి ఈ ట్విస్ట్‌ నచ్చ వచ్చు .. కానీ భ్రాంతి (Hallucination) లో ఉన్న ఒక మహిళ అంత పర్‌ఫెక్ట్‌గా వరుస హత్యలను ఎలా చేయగలిగింది? అనేది పెద్ద ప్రశ్న.. ఈ విషయంలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. కథను ముగించడానికి ఈ సైకలాజికల్ ట్విస్ట్‌ను వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమా,అమెజాన్ ప్రైమ్,యూట్యూబ్ లో ఉంది,ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!