Nirmal Akkaraaju ……………………… Contempt of court
న్యాయ వ్యవస్ధపై ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి.ఇది 60దశకం నాటి మాట. అప్పట్లో కోర్టులంటే అందరు భయపడేవారు. ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను న్యాయమూర్తి సీరియస్ గా తీసుకున్నారు. సీఎం కామెంట్స్ ను కంటెప్ట్ ఆఫ్ కోర్టు క్రింద పరిగణించారు.
ఇంతకూ ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు ..ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఇ.ఎమ్.శంకరన్ నంబూద్రిపాద్ .. ఆయన కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంగా కోర్టు తీర్పు పై తనదైన ధోరణిలో మాట్లాడారు.
1967 నవంబర్ 9 న “హింసకు న్యాయవ్యవస్ధ కారణమని .. . ధనికులకు మద్దతుగా ఉందని,వర్గాలుగా విభజిస్తుందని, పాలించే వర్గాలకు అండగా పేద కూలీలకు వ్యతిరేకంగా ఉందని , పేదలను దోచుకునే విధంగా న్యాయవ్యవస్ధ ఉందని” నంబూద్రిపాద్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలను మరుసటి రోజు వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఇది గమనించిన హైకోర్టు సీఎం వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.దీనికి సమాధానంగా సీఎం నంబూద్రిపాద్ పూర్తిగా కాకపోయినా కొంత నిజమని జవాబు ఇచ్చారు.
తాను వాక్ స్వేచ్ఛను అనుసరించి వ్యాఖ్యలు చేశానన్నారు.మార్కిస్ట్ సిద్ధాంతాన్ని అనుసరించి తాను మాట్లాడానని స్పష్టం చేశారు. నంబూద్రీపాద్ మాటలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ హైకోర్టు 1000 రూపాయల జరిమానా, 1నెల సాధారణ జైలు శిక్ష వేసింది. అప్పట్లో ఈ కేసు పెద్ద సంచలనం సృష్టించింది.
కోర్టు తీర్పు పై అప్పీలు కెళ్ళిన నంబూద్రిపాద్,తమ సిద్దాంతం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తీర్పుపై అప్పీల్ లో ముఖ్యంగా కోర్టు తీర్పులను గౌరవించాలని జడ్జిల మీద వ్యక్తిగత దూషణలు చేయరాదని న్యాయవ్యవస్ధ లేదా జడ్జిల పై విమర్శలు తప్పని కానీ పేదలను దోచుకునే పెద్దల గురించి ప్రజలకు వివరించడం తప్పు కాదని అఫిడవిట్ లో స్పష్టం చేసారు.
ఈ కేసును నంబూద్రిపాద్ తరఫున అప్పటి ప్రఖ్యాత లాయర్ వి.కె.కృష్ణ మీనన్ కోర్టులో వాదించారు.
కంటెప్ట్ ను వాక్ స్వేచ్ఛను కలప రాదని మీనన్ వాదించారు.కేసు మొత్తం చదివితే మార్కిస్టు లెనినిజం గురించే ఉంటుంది.చివరకు 50 రూపాయల జరిమానా తో కేసును కొట్టి వేశారు.